Abn logo
Mar 2 2021 @ 00:19AM

ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో అక్రమాలు నిజమే!

నిర్థారించిన అధికారులు 

ఐదు ఆసుపత్రులకు రూ.3,33,650 ఫైన్‌


నెల్లూరు (వైద్యం), మార్చి 1 : జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో రోగుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న వాటిపై అధికారులు కొరడా ఝళిపించారు. ఇటీవల ఆయా ఆసుపత్రుల్లో తనిఖీలు జరిపిన అధికారులు అక్రమాలు జరిగింది నిజమేనని నిగ్గుతేల్చారు. ఈ నేపఽథ్యంలో సోమవారం ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌తోపాటు కమిటీ సభ్యులు సమావేశమై ఆయా ఆసుపత్రులకు జరిమానా విధించారు. 


మెడికవర్‌ ఆసుపత్రిలో రోగుల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా నగదు వసూలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. రూ. 15,600 చొప్పున ఐదుగురి నుంచి రూ.78 వేలు, రూ. 20 వేల వంతున ఇద్దరి నుంచి రూ. 40 వేలు, రూ. 5,775 వంతున ఐదుగురి నుంచి రూ.28,875, అలాగే రూ. 16 వేల వంతున ఐదుగురి నుంచి రూ.80 వేలు కలిపి మొత్తం రూ. 2,26,875 అక్రమంగా  వసూలు చేసినట్లు నిర్థారించారు. ఈ మొత్తాన్ని జరిమానా కింద వసూలు చేయాలని నిర్ణయించారు. 


 జయభారత్‌ ఆసుపత్రిలో ఐదుగురు రోగుల నుంచి రూ.665 లెక్కన మొత్తం రూ.3,325 వసూలు చేసినట్లు తేల్చారు. కిమ్స్‌ అసుపత్రిలో ఐదుగురి నుంచి రూ. 10,278 లెక్కన మొత్తం రూ.51,390 అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు అధికారులు ప్రకటించారు. నారాయణ ఆసుపత్రిలో ఇద్దరి నుంచి రూ.12,030 వంతున మొత్తం రూ. 24,060, మరో ఐదుగురి నుంచి రూ.4వేల వంతున రూ.20వేలు వసూలు చేసినట్లు నిర్థారించారు. రిచ్‌ ఆసుపత్రిలో ఇద్దరి నుంచి రూ.4వేల వంతున రూ. 8వేలు  వసూలు చేసినట్లు అధికారులు తేల్చారు. ఆయా ఆసుపత్రులు అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని జరిమానాగా విధించారు. మొత్తం ఐదు ఆసుపత్రులకు రూ. 3,33,650 జరిమానా విధించినట్లు ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

 

ఆరోగ్యశ్రీ దరఖాస్తుదారులు 4న హాజరు కావాలి

నెల్లూరు (వైద్యం), మార్చి 1 : ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న జిల్లాలోని ప్రైవేట్‌ అసుపత్రులు, ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 4వ తేదీన గుంటూరు మెడికల్‌ కళాశాలలో జరిగే సమావేశానికి హాజరు కావాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు జరిగే ఈ సదస్సుకు ఆసుపత్రుల ప్రతినిధులు, బాధితులు తరలిరావాలని కోరారు. 

Advertisement
Advertisement
Advertisement