నేటి నుంచే ఆర్మీ ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-14T06:25:54+05:30 IST

నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియంలో శనివారం అర్ధరాత్రి తరువాత/ఆదివారం తెల్లవారుజాము నుంచి అగ్నిపథ్‌ ఆర్మీ నియామక ర్యాలీ ప్రారంభం కానున్నది. ర్యాలీలో పాల్గొనేందుకు అభ్యర్థులు శనివారం రాత్రికే స్టేడియం పరిసరాలకు చేరుకున్నారు.

నేటి నుంచే ఆర్మీ ర్యాలీ
ఆర్మీ ర్యాలీకి తరలివచ్చిన అభ్యర్థులు

పూర్తయిన సన్నాహాలు 

శనివారం రాత్రికే చేరుకున్న అభ్యర్థులు

వర్షం వస్తే బీచ్‌ రోడ్డులో ర్యాలీకి ఏర్పాట్లు 

విశాఖపట్నం/మహారాణిపేట, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌  స్టేడియంలో శనివారం అర్ధరాత్రి తరువాత/ఆదివారం తెల్లవారుజాము నుంచి అగ్నిపథ్‌ ఆర్మీ నియామక ర్యాలీ ప్రారంభం కానున్నది. ర్యాలీలో పాల్గొనేందుకు అభ్యర్థులు శనివారం రాత్రికే స్టేడియం పరిసరాలకు చేరుకున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే టోకెన్లు జారీచేశారు. ఎక్కువగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి అభ్యర్థులు తరలివచ్చారు. స్టేడియంకు ఆనుకుని రామకృష్ణాబజార్‌ రోడ్డు నుంచి సీహార్స్‌ జంక్షన్‌ వైపు వెళ్లే డబుల్‌రోడ్డులో ఒకవైపు ట్రాఫిక్‌ను నిలిపివేసి, అభ్యర్థులు వేచి ఉండేందుకు కేటాయించారు. రాత్రి 12 గంటల తరువాత విడతలవారీగా వారిని స్టేడియం లోపలకి అనుమతించారు. తెల్లవారుజామున ర్యాలీ మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. ర్యాలీకి అనువుగా స్టేడియం లోపల బారికేడ్లుతో పాటు ట్రాక్‌ను సిద్ధం చేశారు. వర్షం వస్తే  కోస్టల్‌ బ్యాటరీ నుంచి ఆర్కేబీచ్‌ వరకు ర్యాలీ నిర్వహించేందుకు వీలుగా రోడ్లు, భవనాలశాఖ ఎస్‌ఈ జాన్‌ సుధాకర్‌ నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ర్యాలీ సజావుగా జరిగేందుకు నగరంలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా శనివారం అర్థరాత్రి తరువాత చెదురుమదురుగా జల్లులు కురిసే అవకాశం ఉందని, అంతకు మించి భారీ వర్షాలు పడవని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం కూడా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. 


అభ్యర్థులకు తప్పని తిప్పలు

ర్యాలీలో ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ విఽధానంలో అభ్యర్థులను అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో రోడ్డుపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లలోకి వారిని అనుమతించారు. శనివారం రాత్రి ఏడుగంటల సమయంలో కంపార్టుమెంట్‌లోకి అభ్యర్థులు వెళ్లారు. అయితే అక్కడ వారికి బాత్రూమ్‌లు ఏర్పాటు చేయలేదు. మరుగుదొడ్డి అవసరం వచ్చినా బయటకు అనుమతించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్మీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 




Updated Date - 2022-08-14T06:25:54+05:30 IST