China: సరిహద్దు వెంబడి అదనంగా 15 వేల మంది సైనికులను మోహరించిన భారత్!

ABN , First Publish Date - 2021-07-24T23:43:45+05:30 IST

చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

China: సరిహద్దు వెంబడి అదనంగా 15 వేల మంది సైనికులను మోహరించిన భారత్!

న్యూఢిల్లీ: చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి అదనపు బలగాలను మోహరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్ ఉగ్రవాద ఏరివేత చర్యల్లో నిమగ్నమైన 15 వేల మంది సైనికులను లద్దాఖ్ సెక్టర్‌కు తరలించినట్టు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే ఈ బలగాలను తరలించినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు పేర్కొన్నాయి. ‘‘చైనా దూకుడుకు బ్రేకులు వేసేందుకు కేంద్రం కొన్ని నెలల క్రితమే 15 వేల మంది సైనికులను లద్దాఖ్ సెక్టర్‌లో మోహరించింది.’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనాను అడ్డుకునేందుకు లేహ్ కేంద్రంగా ఉన్న 14 కోర్ దళాలకు ఈ అదనపు దళాలు సహాయకారిగా ఉంటాయి. 


గతేడాది తూర్పు లద్దాఖ్‌లో భారత సైనికులపై చైనా అక్మాత్తుగా దాడులు జరిపి నమ్మకద్రోహానికి పాల్పడిన విషయం తెలిసిందే.  ఈ ఘటనలో భారత సైనికులు కొందరు అమరులయ్యారు.  దీంతో.. అప్రమత్తమైన భారత్ నాటి నుంచీ వాస్తవాధీన రేఖ వెంబడి సైనికుల సంఖ్యను క్రమంగా పెంచింది. అంతకుమనుపు లద్దాఖ్ సెక్టర్‌లో ఒక డివిజన్ ఉండగా ప్రస్తుతం బలగాల సంఖ్య రెండు డివిజన్లకు చేరింది. మరోవైపు..చైనాపై మెరుపుదాడి కోసం సిద్ధం చేసిన 17 మౌంటెయిన్ స్ట్రైక్ దళాలను భారత్ ఇటీవలే మరీంతగా బలోపేతం చేసింది. 10 వేల మంది సైనికులను ఈ దళానికి అదనంగా కేటాయించింది. 

Updated Date - 2021-07-24T23:43:45+05:30 IST