ఆఫ్ఘన్ ఉగ్రవాదులు కశ్మీర్‌కు వచ్చే ప్రయత్నం చేయొచ్చు : ఆర్మీ చీఫ్

ABN , First Publish Date - 2021-10-09T23:41:05+05:30 IST

ఆప్ఘనిస్థాన్‌లో తయారైన ఉగ్రవాదులు ఆ దేశంలో పరిస్థితులు

ఆఫ్ఘన్ ఉగ్రవాదులు కశ్మీర్‌కు వచ్చే ప్రయత్నం చేయొచ్చు : ఆర్మీ చీఫ్

న్యూఢిల్లీ : ఆప్ఘనిస్థాన్‌లో తయారైన ఉగ్రవాదులు ఆ దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరిన తర్వాత కశ్మీరులో చొరబడే ప్రయత్నం చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనే అన్నారు. ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు భారతీయ దళాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థ శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 


కశ్మీరులో ఇటీవల సాధారణ ప్రజలపై జరుగుతున్న ఉగ్రవాద దాడులకు, ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడానికి మధ్య సంబంధం ఉందా? అని అడిగినపుడు జనరల్ నరవనే స్పందిస్తూ, ఈ సంబంధం గురించి చెప్పలేమన్నారు. కచ్చితంగా జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని, అయితే వాటికి ఆఫ్ఘనిస్థాన్‌లో జరిగిన లేదా జరుగుతున్నదానితో ప్రత్యక్ష సంబంధం ఉందా? అనే అంశాన్ని మనం చెప్పలేమని తెలిపారు. 


రెండు దశాబ్దాల క్రితం తాలిబన్లు పరిపాలించినపుడు ఆఫ్ఘనిస్థాన్‌లో తయారైన ఉగ్రవాదులు జమ్మూ-కశ్మీరుకు వచ్చారన్నారు. ఇది పునరావృతమవుతుందని అనుకోవడానికి తగిన కారణాలు ఉన్నాయన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఆ దేశం నుంచి ఉగ్రవాదులు కశ్మీరుకు రావచ్చునన్నారు. అటువంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి భారతీయ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయన్నారు. విదేశీ ఉగ్రవాదులను నిరోధించేందుకు సరిహద్దుల్లో పటిష్టమైన కౌంటర్ టెర్రరిజం గ్రిడ్ ఉందన్నారు. 


Updated Date - 2021-10-09T23:41:05+05:30 IST