Agnipath Schemeపై భగ్గుమన్న యువత ఆందోళనను చల్లార్చేందుకు ఆర్మీ చీఫ్ యత్నం... కీలక ప్రకటన...

ABN , First Publish Date - 2022-06-17T19:57:43+05:30 IST

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల నేపథ్యంలో భారత సైన్యాధిపతి

Agnipath Schemeపై భగ్గుమన్న యువత ఆందోళనను చల్లార్చేందుకు ఆర్మీ చీఫ్ యత్నం... కీలక ప్రకటన...

న్యూఢిల్లీ : అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల నేపథ్యంలో భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. అగ్నిపథ్‌లో భాగంగా అగ్నివీరులుగా నియామకం కోసం వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకు ప్రభుత్వం పెంచిందని చెప్పారు. శక్తి, సామర్థ్యాలు, దేశభక్తిగల యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియామకాల ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. 


సైన్యంలో చేరేందుకు అన్ని విధాలుగా సిద్ధమవుతూ, కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్ళపాటు రిక్రూట్‌మెంట్లు లేకపోవడంతో నిరాశకు గురైనవారికి కూడా అగ్నిపథ్ పథకంలో వయోపరితిని పెంచడం వల్ల ప్రయోజనం కలుగుతుందని General Manoj Pandey తెలిపారు. వయో పరిమితి పెంపును ఒకసారి అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం తమకు చేరిందని చెప్పారు. అతి త్వరలోనే అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీరుల ఎంపిక కోసం ప్రకటనను విడుదల చేస్తామన్నారు. అగ్నివీరులుగా సైన్యంలో చేరే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని యువతను కోరారు. 


ఒకసారి వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వీకరించామని చెప్పారు. అగ్నివీరులుగా నియమితులయ్యేందుకు వయో పరిమితిని 23 సంవత్సరాలకు పెంచినట్లు తెలిపారు. రిక్రూట్‌మెంట్ సైకిల్, 2022కు ఇది వర్తిస్తుందని తెలిపారు. రిక్రూట్‌మెంట్ ర్యాలీస్‌లో పాల్గొనేందుకు, కోవిడ్-19 మహమ్మారి ఉన్నప్పటికీ సిద్ధమైన, యువ, శక్తి, సామర్థ్యాలుగల, దేశభక్తిగల అనేక మంది యువతకు ప్రభుత్వ నిర్ణయం మంచి అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమలైన ఆంక్షల వల్ల రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరగలేదని గుర్తు చేశారు. నియామకాల ప్రక్రియకు సంబంధించిన ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 


యువత ఆగ్రహానికి దిగొచ్చిన కేంద్రం

అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా యువత భగ్గుమనడంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) గురువారం రాత్రి స్పందించింది. 2022 రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అగ్నివీరులుగా నియమితులయ్యేవారికి గరిష్ఠ వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకు పెంచింది. త్రివిధ దళాల్లో సైనికుల నియామకాల కోసం ఈ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 


రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన పథకం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) గురువారం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించారు. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంత్సరాల వయసు మధ్య ఉన్నవారు అగ్నివీరులుగా ఎంపికయ్యేందుకు అర్హులని తెలిపారు. అగ్నివీరులుగా నియమితులైనవారిని నాలుగేళ్ళ తర్వాత విడుదల చేస్తామన్నారు. వీరిలో 25 శాతం మందిని తిరిగి రెగ్యులర్ సర్వీసుకు నియమిస్తామని తెలిపారు. 


రక్షణ మంత్రిత్వ శాఖ ప్రటకన

రక్షణ మంత్రిత్వ శాఖ (Defence Ministry) తాజా ప్రకటనలో, గడచిన రెండేళ్ళలో రిక్రూట్‌మెంట్ చేపట్టనందువల్ల 2022 రిక్రూట్‌మెంట్ సైకిల్‌కు వయో పరిమితి సడలింపును ఒకసారి మంజూరు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. అగ్నిపథ్ స్కీమ్, 2022 రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ కోసం గరిష్ఠ వయసును 23 సంవత్సరాలకు పెంచినట్లు తెలిపింది. 


భగ్గుమన్న యువత

ఇదిలావుండగా, అగ్నిపథ్ (Agnipath) పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, తెలంగాణా రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున రైళ్ళపై దాడులు చేశారు. ఈ పథకాన్ని అనేక ప్రతిపక్ష పార్టీలు, మిలిటరీ నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. రక్షణ దళాల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే త్రివిధ దళాలకు యూత్‌ఫుల్ ప్రొఫైల్ వస్తుందని ప్రభుత్వం చెప్తోంది. రెండేళ్ళపాటు సమాలోచనలు జరిపినతర్వాత ఈ పథకాన్ని ప్రకటించినట్లు త్రివిధ దళాల అధిపతులు ప్రకటించారు. 


సైనికాధికారులు కూడా ఈ కొత్త పథకాన్ని సమర్థిస్తున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం, శిక్షణ కార్యక్రమాన్ని ఆధునికీకరించడం వల్ల రక్షణ దళాలు ఈ పథకం ద్వారా నియమితులయ్యేవారికి ఆపరేషనల్ ఛాలెంజెస్‌ను నెరవేర్చడానికి అవసరమయ్యే నైపుణ్యాలు ఉండేవిధంగా చూడటానికి వీలవుతుందని చెప్తున్నారు. 


Updated Date - 2022-06-17T19:57:43+05:30 IST