Agnipath Protest: ప్రభుత్వ అధికారిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్న యువకుడు

ABN , First Publish Date - 2022-06-19T22:17:22+05:30 IST

అంకుల్.. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయండి. నాలుగేళ్లుగా కఠినంగా సాధన చేస్తున్నాను. ఆర్మీలో చేరడం నా కల. కానీ అగ్నిపథ్ వల్ల నా కల ధ్వంసం అవుతుంది’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. యువకుడి బాధచూసి సదరు అధికారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ అధికారి స్పందిస్తూ..

Agnipath Protest: ప్రభుత్వ అధికారిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్న యువకుడు

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం(Agnipath scheme)పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మిలిటరీలో పని చేయాలనుకునే ఆశావాహ యువత రోడ్లపైకి వచ్చి ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు. కాగా, హర్యానాలో సైతం కొనసాగుతున్న ఈ నిరసనల్లో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించింది. నిరసన చేస్తున్న ఒక యువకుడు ఉన్నట్టుండి ఒక ప్రభుత్వ అధికారిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతే.. అప్పటిదాక ఎంతో వేడిమీద ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిరసనకారులంతా యువకుడిని అధికారిని చూస్తూ ఉండిపోయారు. ఎన్నో కలలతో తాను నాలుగేళ్లుగా ఆర్మీ కోసం సిద్ధమవుతున్నానని, తన జీవితం నాశనం అవుతుందంటూ దు:ఖించాడు. ఆ అధికారి సైతం తన భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. యువకుడిని ఓదార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


హర్యానాలోని పానిపట్‌లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఒకవైపు యువత నిరసన చేస్తుంటే మరొకవైపు పోలీసులు సహా స్థానిక జిల్లా అధికారులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఒక అధికారి వద్దకు ఒక యువకుడు వచ్చి అతడిని కౌగిలించుకున్నాడు. ‘‘అంకుల్.. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయండి. నాలుగేళ్లుగా కఠినంగా సాధన చేస్తున్నాను. ఆర్మీలో చేరడం నా కల. కానీ అగ్నిపథ్ వల్ల నా కల ధ్వంసం అవుతుంది. మీ పిల్లలు ఇలా నిరసనలోకి వస్తే మీకెలా ఉంటుంది చెప్పండి?’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. యువకుడి బాధచూసి సదరు అధికారి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ అధికారి స్పందిస్తూ ‘‘ఏడవకు బేటా.. ఇది నాకు రాతపూర్వకంగా ఇవ్వు. ప్రభుత్వానికి మెమోరండం పంపిస్తాను’’ అని అన్నారు.

Updated Date - 2022-06-19T22:17:22+05:30 IST