వీ సెల్యూట్‌..!

ABN , First Publish Date - 2021-01-16T06:59:28+05:30 IST

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం సైనికుల కవాతు మధ్య సైనిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

వీ సెల్యూట్‌..!
సైనిక అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న నయోరా పాత్ర

ఘనంగా ఆర్మీడే.. వేడుకల్లో చిన్నారి నయోరా పాత్ర

ఆమె ఆకాంక్షను నెరవేర్చిన ఆర్మీ అధికారులు

అల్వాల్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):  సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శుక్రవారం సైనికుల కవాతు మధ్య సైనిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్ర సబ్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ మేజర్‌ జనరల్‌ ఆర్కే సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్మారకస్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించారు. 

చిన్నారి ఆకాంక్ష నెరవేరిన వేళ దేశ సైనికుల త్యాగాలు, వారు చేస్తున్న సేవను తల్లిదండ్రులు ఆ చిన్నారికి కథలు, కథలుగా వివరించేవారు. తల్లి వర్షా పాత్రకు పెయింటింగ్‌, మ్యూజిక్‌ రంగంలో ప్రవేశం ఉంది. దీంతో చిన్నారి నయోరా పాత్ర కూడా తల్లి మాదిరిగానే పెయింటింగ్‌లు వేయడం, మ్యూజిక్‌ నేర్చుకుంది. ఆర్మీ త్యాగాలను వివరిస్తూ వివిధ రకాల పెయింటింగ్‌లు వేసేది. నయోరా పాత్ర తండ్రి సమీర్‌ పాత్ర కూడా సోషల్‌ మీడియా నుంచి కొన్ని వీడియోలు చూపించి, సైన్యం ఎదుర్కొంటున్న క్లిష్లమైన పరిస్థితులను చిన్నారికి వివరించేవాడు. దీంతో నయోరా పాత్రకు ఆర్మీ యూనిఫాం ధరించి, ఆర్మీ అధికారులను కలవాలనే కోరిక కలిగింది. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకలలో  పాల్గొనే అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తల్లిదండ్రులు పలుమార్లు మెయిల్స్‌ పంపించారు. స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం నగరంలో జరిగే ఆర్మీడే వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం పం పించింది. శుక్రవారం కల్నల్‌ ర్యాంకు అఽధికారి మరో ఇద్దరు సోల్జర్‌లు నయోరా పాత్ర ఇంటికి వెళ్లి, ఆమెను సికింద్రాబాద్‌లోని వీరుల సైనిక స్మారక స్థూపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఆమెను మేజర్‌ జనరల్‌ ఆర్కే సింగ్‌ ఆహ్వానించారు. అక్కడితోపాటు గోల్కోండలో నిర్వహించిన ఆర్మీ వేడుకలలో కూడా చిన్నారి పాల్గొంది. తమ కూతురి ఆకాంక్షను నెరవేర్చిన ఆర్మీ అధికారులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికైనా తమ కూతుర్ని  సైన్యంలో చేర్పిస్తామన్నారు. నయోరా పాత్ర తల్లిదండ్రులు విదేశాల్లో ఉద్యోగులు చేసేవారు. కూతురిని భారత సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పెంచాలని, ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. 

Updated Date - 2021-01-16T06:59:28+05:30 IST