ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-19T05:16:04+05:30 IST

జిల్లాలో ఈనెల 25 నుంచి నవబరు 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధికారుల

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
అధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌.

జిల్లాలో 34పరీక్ష కేంద్రాలు

నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

హాజరవనున్న 10,857మంది ప్రథమ సంవత్సర విద్యార్థులు

జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ 

కొత్తగూడెం కలెక్టరేట్‌, అక్టోబరు 18:  జిల్లాలో ఈనెల 25 నుంచి నవబరు 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ అధికారి, పోలీస్‌, రెవెన్యూ, వైద్య, విద్యుత, పంచాయితీరాజ్‌, మున్సిపల్‌ అధికారులతో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగూడెంలో 7, భద్రాచలంలో 4, పాల్వంచలో 4, మణుగూరులో3, ఇల్లెందులో 4, అశ్వారావుపేటలో 3, చర్ల, బూర్గంపాడు, పినపాక టేకులపల్లి, దుమ్ముగూడెం, మలకలపల్లి, జూలూరుపాడు మండలాల్లో 1 కేంద్రం చొప్పున, గుండాలలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతి లేదన్నారు. జిల్లాలో 8,119 మంది రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు వృత్తివిద్యాకోర్సులను అభ్యసిస్తున్న 2,738మందితో కలిపి మొత్తం 10, 857మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ నోడల్‌ అధికారిగా బి. సులోచనారాణి, కన్వీనర్‌గా మణుగూరు జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సయ్యద్‌ యూసఫ్‌, అశ్వాపురం హిస్టరీ లెక్చరర్‌ డి. సుధాకర్‌రెడ్డిని సభ్యులుగా నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను తాహసీల్దార్లు, ఎంపీడీవోలు పరిశీలించాలని, స్క్వాడ్‌ విధులు నిర్వహించాలన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించి పరీక్షకు హాజరు కావాలన్నారు.  పరీక్ష కేంద్రల వద్ద 144సెక్షన అమలు చేయాలని పోలీసులకు సూచించారు.  కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్‌ కేంద్రాలను మూయించాలని, అత్యవసర చికిత్స కేంద్రాల ఏర్పాటుతో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లును సిద్ధంగా ఉంచాలని  ఆదేశించారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్‌ కె. వెంకటేశ్వర్లు, డీఆర్‌వో అశోక్‌చక్రవర్తి, ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి సులోచనారాణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:16:04+05:30 IST