Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 6 2021 @ 18:19PM

రఫేల్ జెట్స్‌కు మిసైల్స్... తొలి చిత్రాలను షేర్ చేసిన ఐఏఎఫ్...

న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాలు భారత గగనతలంలో హుందాగా విహరిస్తున్నాయి. లడఖ్‌లో గగనతల రక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. వీటి రెక్కలపై ఎంఐసీఏ ఎయిర్-టు-ఎయిర్ మిసైల్స్‌ను అమర్చారు. మిసైల్స్‌ను మోసుకెళ్తున్న ఈ యుద్ధ విమానాల తొలి చిత్రాలను భారత వాయు సేన (ఐఏఎఫ్) మంగళవారం విడుదల చేసింది. ‘‘డేగల ధైర్యసాహసాలు’’ అంటూ ఈ చిత్రాలను ట్వీట్ చేసింది. 


అనేక రకాల పాత్రలను పోషించే ఈ యుద్ద విమానాలను ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ తయారు చేసింది. గగనతల ఆధిపత్యానికి పెట్టింది పేరైన ఈ విమానాలు అత్యంత కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగలవు. రూ.59 వేల కోట్ల వ్యయంతో 36 యుద్ధ విమానాల కోసం భారత్, ఫ్రాన్స్ ప్రభుత్వాలు నాలుగేళ్ళ క్రితం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా మొదటిసారి గత ఏడాది జూలై 29న ఐదు రఫేల్ యుద్ధ విమానాలు మన దేశానికి వచ్చాయి. వీటిని అంబాలా వాయు సేన స్థావరంలో మోహరించారు. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం 36 యుద్ధ విమానాలు మన దేశానికి చేరుకోవడం 2022 చివరికల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. వీటిలో యుద్ధ విమానాలు 30 కాగా, శిక్షణ విమానాలు ఆరు ఉంటాయని సమాచారం. శిక్షణ విమానాల్లో రెండు సీట్లు ఉంటాయని, యుద్ద విమానాల్లో ఉండే అంశాలన్నీ దాదాపు వీటిలో కూడా ఉంటాయని తెలుస్తోంది. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉండటంతోపాటు, మిటీయర్, స్కాల్ప్ మిసైళ్ళను వీటికి అమర్చవచ్చు. దీంతో గగనతలంపై ఆధిపత్యం సాధించడంలో భారత వాయు సేన సామర్థ్యం మరింత పెరుగుతుంది.


రఫేల్ యుద్ధ విమానాలు కొద్ది నెలల నుంచి ఆర్మ్‌డ్ మిషన్స్‌ను నిర్వహిస్తున్నాయి. అయితే లడఖ్‌లో దీనికి సంబంధించిన విన్యాసాల చిత్రాలను విడుదల చేయడం ఇదే తొలిసారి. రఫేల్ యుద్ధ విమానాలను ఆఫ్ఘనిస్థాన్, లిబియా, సిరియాలలో ఉపయోగిస్తున్నారు. 


Advertisement
Advertisement