‘తెలంగాణ ట్వెల్వ్‌’గా చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఆ పోరాట ఘట్టం...

ABN , First Publish Date - 2021-07-04T19:21:26+05:30 IST

ఉద్యమాల తెలంగాణ కోసం అంతర్జాతీయ సమాజమే పెద్ద ఉద్యమం చేసిందంటే ఈ తరానికి ఆశ్చర్యంగా ఉంటుంది. రైతాంగ సాయుధ పోరాట సమయంలో పన్నెండు మంది తెలంగాణ వీరులకు మరణశిక్ష విధించింది నాటి సర్కారు.

‘తెలంగాణ ట్వెల్వ్‌’గా చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఆ పోరాట ఘట్టం...

నేటితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలై 75 ఏళ్లు 


ఉద్యమాల తెలంగాణ కోసం అంతర్జాతీయ సమాజమే పెద్ద ఉద్యమం చేసిందంటే ఈ తరానికి ఆశ్చర్యంగా ఉంటుంది. రైతాంగ సాయుధ పోరాట సమయంలో పన్నెండు మంది తెలంగాణ వీరులకు మరణశిక్ష విధించింది నాటి సర్కారు. మరణం చివరి అంచుల వరకు వెళ్లిన ఈ కేసుపై అభ్యుదయ భావాలున్న విదేశీయులు సైతం రంగంలోకి దిగి ధర్మపోరాటం చేశారు. న్యాయానికి ఊపిరి పోసి ఉరిశిక్ష నుంచీ తప్పించారు. ‘తెలంగాణ ట్వెల్వ్‌’గా చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఆ పోరాట ఘట్టం ఉత్కంఠభరితం... తెలంగాణ నిత్య ఉద్యమస్ఫూర్తికి నిదర్శనం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..


ప్రపంచ చరిత్రలోఅత్యంత అరుదైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమై నేటికి (జూలై 4) సరిగ్గా 75 సంవత్సరాలు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నుంచి, వర్తక సంఘాలు, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర జనసంఘం, ఆంధ్ర మహాసభల మీదుగా అప్పటికి నాలుగు దశాబ్దాలకు పైగా రగులుతున్న తెలంగాణ ప్రజల చైతన్యం 1946 జూలై 4 వచ్చేసరికి భళ్లున పెల్లుబికింది. అప్పటి నల్లగొండ జిల్లా కడివెండి గ్రామంలో ప్రభుత్వ నిర్బంధ లెవీ వసూలుకు వ్యతిరేకంగా ఊరేగింపు జరుగుతోంది. విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు ఉద్యమకారులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సంగం కార్యకర్త దొడ్డి కొమరయ్య మరణించడంతో.. కమ్యూనిస్టు పార్టీ సాయుధ ప్రతిఘటనా పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ రోజు నుంచి 1951 అక్టోబర్‌ 20న అధికారికంగా పోరాట విరమణ జరిగేవరకూ తెలంగాణ రైతాంగ పోరాటం అగ్గిలా మండింది. ఎన్నెన్నో చారిత్రక విజయాలు సాధించింది. అసమ భూసంబంధాలకూ వెట్టి వంటి శ్రమ దోపిడీ రూపాలకూ సామాజిక పీడనకూ వ్యతిరేకంగా లక్షలాది ప్రజలు కదిలారు. మూడు వేల గ్రామాలు భూస్వామ్య పీడన నుంచి విముక్తి పొందాయి. భూస్వాముల చెరలో ఉన్న పదిలక్షల ఎకరాల భూమి దున్నేవారికి దక్కింది. ఈ దేశ ప్రజలు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎంచుకోవలసిన మార్గమేమిటో తెలంగాణ రైతాంగం ఉద్యమ రూపంలో చేసి చూపింది. అది అప్పటివరకూ భారత ఉపఖండ చరిత్రలో జరిగిన విడివిడి, వ్యక్తిగత, సామూహిక రైతాంగ తిరుగుబాట్లకు ఒక సంఘటిత సైద్ధాంతిక పునాదిని కల్పించింది. దేశంలో ఆ తర్వాత జరిగిన జరుగుతున్న ప్రజా ఉద్యమాలన్నిటికీ వెలుగు దివ్వెగా నిలిచింది.


ముప్పయి వేల పేజీలు...


పోరాటం జరుగుతున్నప్పుడు పాటలు, కవిత్వం, కథల రూపంలో వెలువడిన తెలంగాణ పోరాట సాహిత్యంలో గడిచిన ఏడు దశాబ్దాలలో ఆ ప్రక్రియలతో పాటు ఆత్మకథలు, అనుభవాలు - జ్ఞాపకాలు, జీవితచరిత్రలు, నవలలు, సామాజిక, రాజకీయార్థిక, చారిత్రక, సాహిత్య విశ్లేషణల రూపంలో రెండు వందలకు పైగా పుస్తకాలు వచ్చాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో సాహిత్యం, అర్థశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజనీతిశాస్త్ర శాఖల్లో దాదాపు ఇరవై ఎంఫిల్‌, పీహెచ్‌డీ సిద్ధాంత వ్యాసాల పరిశోధన జరిగింది. ఆ పోరాట విశిష్టతకు తగినట్టుగా కనీసం ముప్పై వేల పేజీల సాహిత్యం వెలువడి ఉంటుంది. 

అయితే ఇంత విశేష కృషి జరిగినా, ఆ పోరాటం గురించి ఇంకా రాయాల్సిందీ, విశ్లేషించాల్సిందీ ఎంతో ఉంది. ఇప్పటికే కొన్ని అంశాలలో లోతైన పరిశోధన జరిగినప్పటికీ, ఇంకా వెలుగు చూడాల్సిన సమాచారం ఎంతో ఉంది. అటువంటి ఘట్టాల్లో ఒకటి - పోరాటాన్ని అణచివేయడానికి ఆనాటి పాలకవర్గాలు జరిపిన దమనకాండకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో జరిగిన కృషి ఏమిటనేది? మొత్తం ముప్పైవేల పేజీల అచ్చయిన సమాచారంలో అప్పుడు ప్రజా ఉద్యమ కార్యకర్తలకు అనుకూలంగా న్యాయస్థానాలలో వాదనలు వినిపించిన హైదారాబాద్‌ న్యాయవాది మనోహర్‌ రాజ్‌ సక్సేనా రాసిన నూట యాభై పేజీల ‘హిస్టారిక్‌ తెలంగాణ పెజంట్స్‌ స్ట్రగుల్‌ అండ్‌ ది లీగల్‌ బాటిల్‌’ (అది కూడ గందరగోళంగా అచ్చయిన పుస్తకం), కొన్ని పుస్తకాల్లో ప్రస్తావనలు మినహా సమగ్రమైన అణచివేత రూపాల, న్యాయపోరాటాల చరిత్ర ఇంకా వెలుగు చూడవలసే ఉన్నది. అలా వెలుగు చూడవలసిన మహత్తర త్యాగాల, పోరాటాల చరిత్రలో విశిష్టమైనది మరణశిక్ష పడిన తెలంగాణ పోరాట యోధుల గాథ.

 



ఉరిశిక్ష పడింది ఎంతమందికి?


నిజానికి ఇన్ని పుస్తకాలు వచ్చినప్పటికీ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఎంతమందికి మరణశిక్ష పడిందో తెలిపే కచ్చితమైన సమాచారం ఎక్కడా లేదు. దాదాపు వంద మందికి మరణశిక్ష పడి ఉంటుందని కొందరు రాశారు. నల్లా నరసింహులు, కందిమళ్ల ప్రతాపరెడ్డి వంటివారు 50 మందికి ఉరిశిక్షలు విధించారన్నారు. మనోహర్‌ రాజ్‌ సక్సేనా అయితే ఆ సంఖ్య 28 అని పేర్కొన్నారు. అందులో మరణశిక్ష పడిన తర్వాత జైలు నుంచి తప్పించుకున్న నల్లా నరసింహులు, నంద్యాల శ్రీనివాసరెడ్డి, పదహారో ఏటనే మరణశిక్ష పడి ఒక అమెరికన్‌ పత్రికా విలేఖరి వార్త వల్ల ప్రపంచానికి తెలిసిన ఎర్రబోతు రామిరెడ్డి వంటి కొందరి గురించి, ‘తెలంగాణ ట్వెల్వ్‌’ అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారమై, నిరసనలు వ్యక్తమైన పన్నెండు మంది గురించి మాత్రమే కొద్దిగా చరిత్రకెక్కింది. 


ఈ మరణ శిక్షల్లో ఎక్కువ భాగం నిజాం పాలనా కాలంలో పడినవి కావు, 1948 సెప్టెంబర్‌ 17 తర్వాత ప్రవేశించిన భారత సైన్యం ఏర్పాటు చేసిన న్యాయస్థానాల్లో పడిన శిక్షలు. ‘తెలంగాణ ట్వెల్వ్‌’గా ప్రఖ్యాతికెక్కిన పన్నెండు మందినైతే ‘మరణశిక్ష రేపు అమలు చేస్తాం’ అని సిద్ధం కూడా చేశారు. కుటుంబ సభ్యుల చివరి కలయికలు జరిపించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిరసనల వల్ల, సుప్రీం కోర్టులో వ్యాజ్యం వల్ల ఆ ఉరితీత ఆగిపోయింది. కాని పదిహేను నెలల తర్వాత సుప్రీం కోర్టులో న్యాయపోరాటం విఫలమైంది. చిట్టచివరికి రాష్ట్రపతి క్షమాభిక్షతో మరణశిక్ష యావజ్జీవ శిక్షగా మారింది.


ఆ పన్నెండు మంది- దోమల జనార్దన రెడ్డి, గార్లపాటి రఘుపతి రెడ్డి, దూదిపాల చిన్న సత్తి రెడ్డి, మేర హనుమంతు, మాగి వెంకులు, దాసరి నారాయణ రెడ్డి, వడ్ల మల్లయ్య, వడ్ల పాపయ్య, మిర్యాల లింగయ్య, కల్లూరి ఎల్లయ్య, గులాం దస్తగిరి, శామ్యూల్‌.


ఈ పన్నెండు మందికి బడ్డు, అక్కినేపల్లి, షా అబ్దుల్‌పురం గ్రామాలలో జరిగిన హత్యల కేసులలో మరణశిక్షలు పడ్డాయి. యూనియన్‌ సైన్యాల ప్రవేశం తర్వాత, కొంతకాలం సైనిక గవర్నర్‌ పాలన, కొంతకాలం పౌరపాలన అన్నప్పటికీ, 1952 వరకు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఎచ్‌ ఇ ఎచ్‌ నిజామ్స్‌ గవర్నమెంట్‌ పేరుతోనే జరిగాయి. కానీ నిజాం ప్రభుత్వ న్యాయస్థానాలను పక్కన పెట్టి, నేరాలను విచారించడానికి హైదరాబాద్‌ సైనిక గవర్నర్‌ ప్రత్యేక ట్రైబ్యునల్‌లను నియమించారు. అలా సైనిక గవర్నర్‌ ఆదేశాల మేరకు నల్లగొండలో ఏర్పాటైన ప్రత్యేక ట్రైబ్యునల్‌ 1949 ఏప్రిల్‌ 7న నమోదైన క్రిమినల్‌ కేస్‌ నం. 14, 1949 జూలై 20న నమోదైన క్రిమినల్‌ కేస్‌ నం. 17, 18 కేసులలో ఈ మరణశిక్షలు విధించారు.


కేసుల్లో నిజమెంత?


కేసుల విచారణలో ఎన్ని అవకతవకలు జరిగాయంటే ఇప్పుడు ఆ డెబ్బై ఏళ్ల వెనుక, వలస పాలన, నిజాం పాలన తొలగిపోయిన తొలిరోజుల్లోనే న్యాయవిచారణ అనే తూతూ మంత్రపు తతంగం ఎంత అన్యాయంగా అనాగరికంగా జరిగిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు మొట్టమొదట ఆ కేసులే సందేహాస్పదమైనవి. ఒక కేసు పోరాటకాలంలో ఊరి నుంచి పారిపోయి, పోలీసు చర్య తర్వాత తిరిగి వచ్చిన హతుడి బంధువుల ఫిర్యాదు మీద నమోదయింది. ఆ హత్య జరిగింది 1948 సెప్టెంబర్‌లో పోలీసు చర్య గందరగోళం మధ్య కాగా, నేరం మీద ఫిర్యాదు నమోదైనది ఏడు నెలల తర్వాత 1949 ఏప్రిల్‌లో. ముద్దాయిలు ఎవరో ఫిర్యాదీలకు ట్రైబ్యునల్‌కు వచ్చేవరకూ తెలియదు. మరొక కేసుకు సంబంధించిన హత్య రజాకార్ల కేంద్రమైన గ్రామంలో జరిగింది. పోలీసు చర్య తర్వాత పారిపోతున్న రజాకార్లు జరిపిన హత్యాకాండను ఈ కమ్యూనిస్టు కార్యకర్తల మీద మోపారు. ఇంకొక కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలే తలకిందులుగా ఉన్నాయి. శవపరీక్ష జరిపినట్టు ఒక డాక్టర్‌ ఇచ్చిన నివేదిక ఉంది గాని ఆ శవపరీక్ష ఆస్పత్రిలో జరగలేదు. గ్రామంలో ఎందుకు జరిపావు? అనే ప్రశ్నకు డాక్టర్‌ దగ్గర జవాబు లేదు. అసలు ఆ వైద్యుడు గ్రామానికి రాకముందే తన కొడుకు శవ దహనం అయిపోయిందని హతుడి తండ్రి పేర్కొన్నాడు.




ఇటువంటి తప్పుల తడక సాక్ష్యాధారాలు, అసంగతాలు అలా ఉంచి జరిగిన విచారణను చట్టబద్ధమైన న్యాయవిచారణ అనడం భాషకే అవమానం. నిందితులెవరికీ ఇంగ్లిష్‌ పరిచయం లేదు గాని ట్రైబ్యునల్‌ విచారణంతా ఇంగ్లిష్‌లో జరిగింది. మొత్తం విచారణ క్రమంలో నిందితులకు అర్థమైన ఒకే ఒక్క ఇంగ్లిష్‌ మాట ‘‘మీరు కమ్యూనిస్టులేనా’’ అనేదని నమోదైంది. రెండు కేసులలో నిందితులకు న్యాయవాదులు లేరు. అలా లేనప్పుడు ప్రభుత్వం అందించవలసిన న్యాయసహాయం కూడా ప్రభుత్వం ఇవ్వజూపిన ప్రతిఫలం చాలా తక్కువ గనుక అందలేదు. అసలు ట్రైబ్యునల్‌ ముందుకు తీసుకువచ్చేవరకూ నిందితులకు తమను ఏ నేరం కింద అరెస్టు చేసి తీసుకొస్తున్నారో చెప్పలేదు. క్రిమినల్‌ కేసు నిందితులుగా కుటుంబాలకు అరెస్టు సమాచారం లేదు. 


నిందితులకు న్యాయవాదులు లేని రెండు కేసులలో వారిని 1949 ఆగస్ట్‌ 3న మొదటిసారి ట్రైబ్యునల్‌ ముందుకు తెచ్చారు. 6న విచారణ మొదలవుతుందని, న్యాయవాదిని సమకూర్చుకోవాలని చెప్పారు. వారి న్యాయవాదులు లేకుండానే 7 న విచారణ ప్రారంభమైంది. అదే నెల 13, 14ల్లో మరణశిక్ష విధించారు. మాధవ రావు, లక్ష్మణ రావు, ఖాజా మొహినుద్దీన్‌ లతో కూడిన ట్రైబ్యునల్‌ ఇంత గందరగోళపు విచారణ జరిపింది. ఈ తీర్పు మీద హైదరాబాద్‌ హైకోర్టుకు అప్పీలుకు వెళ్లగా హైకోర్టు కూడా ఇంతే హడావుడిగా, ఎటువంటి న్యాయబద్ధమైన విచారణ లేకుండా డిసెంబర్‌ 14న మరణశిక్షను ఖరారు చేసింది. ఆ వెంటనే శిక్ష అమలు చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. జె ఎన్‌ చౌధురి సైనిక ప్రభుత్వమూ, ఆ తర్వాత పౌర ప్రభుత్వం పేరుతో వచ్చిన వెల్లోడి ప్రభుత్వమూ మనుషుల ప్రాణాలు తీయడానికి మితిమీరిన ఉత్సాహం చూపాయి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి రాకముందే ఈ మరణశిక్షను అమలు చేయాలనుకోవడమే ఈ తొందరకు కారణమని వ్యాఖ్యాతలు అన్నారు. పన్నెండుగురిలో ఐదుగురిని జనవరి 22న, ఏడుగురిని జనవరి 23న ఉరితీస్తామని జనవరి 9న వారికి సమాచారం ఇచ్చారు. సంతకాలు తీసుకున్నారు. అప్పటివరకూ వారిని ఉంచిన నల్లగొండ, చంచల్‌ గూడ జైళ్ల నుంచి ఉరికంబం ఉన్న ముషీరాబాద్‌ జైలుకు బదిలీ చేశారు. 


అంతర్జాతీయ వార్త అయ్యింది...


అలా ఇక పన్నెండు రోజులకు ఉరితీయబోతున్నారనగా ఆ వార్త దావానలంలా వ్యాపించిందనీ, జైళ్లలోనూ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ ఆందోళన మొదలయిందని పి సుందరయ్య రాశారు. లండన్‌ నుంచి ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ లాయర్స్‌ అధ్యక్షుడు డి ఎన్‌ ప్రిట్‌, బొంబాయి నుంచి డేనియల్‌ లతీఫీ, గణేశ్‌ షాన్‌ బాగ్‌ వంటి న్యాయవాదులు హైదరాబాద్‌ చేరుకుని స్థానిక న్యాయవాది మనోహర్‌ లాల్‌ సక్సేనాతో కలిసి మరణశిక్షను ఆపే ప్రయత్నాలు ప్రారంభించారు. మరణశిక్ష వార్తలు, ఖండనలు వెల్లువెత్తాయి. ఉరిశిక్ష ఆపమని కోరుతూ ప్రభుత్వానికి కుప్పలుతెప్పలుగా దేశంలో నుంచీ, విదేశాల నుంచీ టెలిగ్రాములు, విజ్ఞప్తులు రావడం మొదలయింది. తెలంగాణ వీరుల డిఫెన్స్‌ కమిటీ అనేది ఏర్పడి ‘12 మంది తెలంగాణ వీరుల మరణశిక్షను ఆపివేయండి’ అనే నినాదం చెలరేగింది. 


చెకొస్లవేకియా యువజన సంఘం, హంగేరియన్‌ స్వాతంత్య్ర యోధుల సమాఖ్య, హంగేరియన్‌ యువజన సంఘం, ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య, ప్రపంచ ట్రేడ్‌ యూనియన్ల సమాఖ్య, ప్రజాతంత్ర న్యాయవాదుల ప్రపంచ సమాఖ్య, ప్రపంచ విద్యార్థి సమాఖ్య వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ మరణశిక్షను రద్దు చేయాలని కోరాయి. చెకొస్లవేకియాలోని ప్రాగ్‌లో ఏర్పాటైన ఒక సభలో సుప్రసిద్ధ అమెరికన్‌ గాయకుడు పాల్‌ రాబ్సన్‌ ఈ మరణశిక్షను ఖండిస్తూ ఉపన్యసించాడు. స్పానిష్‌ మహాకవి పాబ్లో నెరూడా ఈ మరణశిక్ష రద్దు చేయాలని ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూకు విజ్ఞప్తి చేశాడు. దేశంలో సైఫుద్దీన్‌ కిచ్లూ, కె ఎ అబ్బాస్‌, రమేశ్‌ థాపర్‌ వంటి ప్రముఖులెందరో ఉరిశిక్షను రద్దు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నో చోట్ల ఉరిశిక్ష వ్యతిరేక సభలు జరిగాయి. 


జనవరి 19న ముఖ్యమంత్రి వెల్లోడి ఢిల్లీ వెళ్తున్నాడనే వార్త ఉర్దూ పత్రికలో చదివి, విమానాశ్రయంలో ఆయనను పట్టుకుని ఉరిశిక్ష ఆపమని ఒత్తిడి తెమ్మని తమ న్యాయవాదులకు చెప్పామని అప్పటికే జైలులో ఉన్న నల్లా నరసింహులు రాశారు. అలా వెళ్లి విజ్ఞప్తి ఇచ్చిన న్యాయవాదులతో ఢిల్లీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లోడి అన్నాడట. ఏం జరిగిందో తెలియదు గాని మొత్తానికి అప్పటికి ఆ గండం గడిచి ఉరిశిక్షలు తాత్కాలికంగా ఆగిపోయాయి. కాని ఆ పన్నెండుమందినీ ముషీరాబాద్‌ జైలులో ఉరికంబం నీడలోని సెల్స్‌లోనే ఉంచారు. ఈలోగా డి ఎన్‌ ప్రిట్‌ చొరవతో భారత సుప్రీం కోర్టులో ఈ ఉరిశిక్షలను రద్దు చేయాలని వ్యాజ్యం వేశారు. సైనిక గవర్నర్‌ ఆదేశాల మేరకు ఏర్పాటైన ట్రైబ్యునల్‌ సాక్ష్యాధారాల విచారణ, క్రాస్‌ ఎగ్జామినేషన్‌, ఇరుపక్షాల వాదనలు వంటి ప్రక్రియలన్నీ ఉండే చట్టబద్ధమైన న్యాయస్థానం కాజాలదనీ, అందువల్ల దాని తీర్పు చెల్లదనీ ప్రిట్‌ వాదించారు. అలాగే ఈ మూడు కేసుల్లో రెండింటిలో సక్రమమైన న్యాయమైన విచారణ జరగలేదనీ, నిందితుల వాదన వినిపించే అవకాశమే ఇవ్వలేదనీ అందువల్ల కూడా ఈ తీర్పు చెల్లదని ఆయన అన్నారు. కలగాపులగపు నేరారోపణలు చేసినందువల్ల ఈ విచారణలు చట్టబద్ధమైనవి కాదని చెప్పారు. ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చిన సమయంలో ఉరిశిక్ష అనేది లేదనీ, శిరచ్ఛేదనం అనే శిక్షే ఉన్నదనీ, కనుక ఉరిశిక్ష చెల్లదనీ వాదించారు. హైదరాబాద్‌ రాజ్యంలో విధించిన మరణశిక్షలను అంతిమంగా మహా ఘనత వహించిన నిజాం ప్రభువు ఆమోదించవలసి ఉంటుందనీ, ఇంకా ఆయన పేరు మీదనే ప్రభుత్వం నడుస్తున్నది గనుక ఆయన ఆమోదం లేకుండా ఉరిశిక్ష అమలు చేయగూడదని వాదించారు. 


జస్టిస్‌ సయ్యద్‌ ఫజల్‌ అలీ, జస్టిస్‌ మెహర్‌ చంద్‌ మహాజన్‌, జస్టిస్‌ బి కె ముఖర్జీ, జస్టిస్‌ సుధీరంజన్‌ దాస్‌, జస్టిస్‌ ఎన్‌ చంద్రశేఖర అయ్యర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో 1951 మార్చి 16న తీర్పు వెలువరించింది. 1950 జనవరి 26న సంక్రమించిన అధికారాలతో ఏర్పడిన భారత సుప్రీంకోర్టుకు అంతకు ముందే హైదరాబాద్‌ హైకోర్టు ధ్రువీకరించిన ట్రైబ్యునల్‌ తీర్పు ఉచితానుచితాలను నిర్ధారించే అధికారం లేదనీ, 1950 జనవరి 26కు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును తిరగతోడే అధికారం తమకు లేదనీ సాకులతో, సాంకేతిక కారణాలతో మరణశిక్ష రద్దు వాదనలను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ట్రైబ్యునల్‌ తీర్పు సక్రమంగా లేదనీ, అన్యాయం జరిగిందనీ అంటూనే హైదారాబాద్‌ హైకోర్టు పైన అప్పటికే రద్దయిన జ్యుడిషియల్‌ అథారిటీకే తప్ప తమకు అధికారం లేదనీ తీర్పు ఇచ్చింది. మరో మాటలో చెప్పాలంటే పన్నెండు మందినీ ఉరి తీయవలసిందేననీ, వారి ప్రాణాలు కాపాడడం తమ చేతుల్లో లేదనీ హంతక నిర్ధారణ చేసింది. 


పోరాట ఫలితం..


తెలంగాణ ట్వెల్వ్‌ కేసు అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి పొందింది గనుక, న్యాయవాది డి ఎన్‌ ప్రిట్‌ పేరున్న వాడు కనుక సుప్రీంకోర్టు విచారణ సమయంలోనూ, తీర్పు చెప్పేటప్పుడు పలు దేశాల రాయబారులు, విదేశీ విలేఖరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని పత్రికలు రాశాయి. అప్పుడిక రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ తన అధికారం ఉపయోగించి క్షమాభిక్ష ఇవ్వవచ్చుననీ, మరణశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చవచ్చుననీ విజ్ఞప్తులు మొదలయ్యాయి. ఆయన ఆ విన్నపాలను అంగీకరించి ‘పన్నెండు మంది తెలంగాణ వీరుల’ ఉరిశిక్షలను రద్దు చేసి యావజ్జీవ శిక్షలుగా మార్చారు. ఒక్కొక్కరు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల జైలు నిర్బంధం అనుభవించి, కొందరు 1956లో, మరికొందరు 1958లో విడుదలయ్యారు.


తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో అతి ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటైనప్పటికీ ఈ ‘తెలంగాణ ట్వెల్వ్‌’ ఉదంతం తగినంత ప్రాచుర్యంలోకి రాలేదు. తెలంగాణ సాయుధ పోరాటం మీద వెలువడిన ప్రసిద్ధ ప్రామాణిక గ్రంథాలేవీ ఈ పన్నెండు మంది పేర్లు, ఆనాటికి వయసు, గ్రామాల పేర్లు కూడా పూర్తిగా రాయలేదు. చివరికి వారి కేసు న్యాయవాదిగా పనిచేసిన మనోహర్‌ రాజ్‌ సక్సేనా పుస్తకం కూడా ఆ పన్నెండు మంది పేర్లు లేకుండానే అచ్చయింది. పుస్తకం అచ్చయిన తర్వాత గుర్తించినట్టుగా, ఆ పన్నెండు పేర్లు టైప్‌ చేసిన కాగితం ఒకటి పుస్తకంలో అతికించారు. ఈ కేసు గురించి వివరంగానే రాసిన నల్లా నరసింహులు సైతం ఆరు పేర్లు రాసి, మరో ఆరు పేర్లు జ్ఞాపకం లేదు అని రాశారు. ఆయన పేర్కొన్న ఆరు పేర్లలో రెండు ‘తెలంగాణ ట్వెల్వ్‌’ లోనివి కావు. కాకపోతే నరసింహులు ఆ ఆరుగురు ఏ గ్రామాలకు చెందినవారో రాశారు. ఉదయం వీక్లీ తెలంగాణ పోరాట ప్రత్యేక సంచిక (1987)లో రాసిన పి. బాలకృష్ణ నలుగురి పేర్లు మాత్రమే రాశారు. ఇలా ‘తెలంగాణ ట్వెల్వ్‌’ సమాచారం సరిగా అందకపోవడం వల్ల, ఉరిశిక్ష పడిన మరి కొందరి గురించి రాసినప్పుడు వారిని కూడా ఇందులో భాగం చేస్తున్నారు. ఈ గందరగోళానికి మూలం మొత్తంగా మరణశిక్షలు పడినవారి గురించి సమాచారం లేకపోవడం. ప్రత్యేకించి అంత పెద్ద ఎత్తున జరిగిన ‘తెలంగాణ ట్వెల్వ్‌’ ఆందోళన వివరాలు అందుబాటులో లేకపోవడం. మామూలుగానే న్యాయస్థానాల దస్తావేజుల్లో పేర్ల బదులు నిందితుల అంకెలే (ఎ1, ఎ2అని) ఉంటాయి గాని, ప్రత్యేక సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక నిందితుడి పేరు ప్రస్తావించింది. కల్లూరి ఎల్లయ్య అనే నిందితుడి పేరును ‘‘కల్లూర్‌ గౌండ్ల ఎల్లడు ’’ అని రాశారు. అవమాన సూచకమైన పేరు, కులం ప్రస్తావన మన న్యాయస్థానాల సామాజిక విలువలకు నిదర్శనం. 


సుప్రీంలో ప్రిట్‌ వాదనలు..


ఈ కేసును అధ్యయనం చేసి, భారత సుప్రీం కోర్టులో అద్భుతమైన వాదనలు వినిపించి, ‘తెలంగాణ ట్వెల్వ్‌’కు జరిగిన అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చి, అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టడంలో అపారమైన కృషి చేసిన డి ఎన్‌ ప్రిట్‌ తన ఆత్మకథ మూడో భాగం ‘ది డిఫెన్స్‌ అక్యూజెస్‌’ లో ఈ కేసు గురించి వివరంగా రాశారు. ‘‘రాజకీయ ఉద్దేశాలతో బనాయించిన కేసుల చరిత్రలో కూడ ఈ తెలంగాణ కేసు విచారణలు అత్యంత విస్తారమైన అన్యాయానికి తప్పుడు ఉదాహరణలుగా నిలుస్తాయి’’ అన్నారు. 


ఈ ‘తెలంగాణ ట్వెల్వ్‌’లోని చివరి ఇద్దరిలో ఒకరైన గార్లపాటి రఘుపతి రెడ్డి గత సంవత్సరం మరణించారు. అప్పుడు పత్రికల్లో చిన్న వార్త వచ్చింది. మిగిలినవారి విషయంలో అది జరిగిందో లేదో  కూడా తెలియదు. మరణించే నాటికి రఘుపతి రెడ్డి వయసు 93 అంటే, అరెస్టయ్యే నాటికి, మరణశిక్ష పడేనాటికి 21-22 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది. మిగిలిన పదకొండు మంది కూడా అటువంటి నవయువకులే అయ్యుంటారు. వారిని ఉద్యమంలోకి ఆకర్షించిన స్వప్నాలేవో, పోలీసు హింసను, తప్పుడు కేసులను, అబద్ధపు విచారణను, మరణశిక్షను కూడా తట్టుకుని నిలిచేంత దృఢత్వాన్ని ఇచ్చిన ఆదర్శాలేవో మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది. హైదారాబాద్‌ రాజ్యాన్ని విముక్తి చేయడానికే అడుగుపెట్టానని చెప్పుకున్న భారత రాజ్యపు సైన్యం రైతాంగ యోధుల మీద ఇంత కక్షపూరితంగా వ్యవహరించడాన్ని అర్థం చేసుకోవలసే ఉన్నది. వలసవాద న్యాయ, చట్ట విధానాలు ప్రజా వ్యతిరేకమైనవని అప్పటి దాకా ఎలుగెత్తిన భారత రాజ్యం తెలంగాణ రైతాంగ యోధుల పట్ల ఇంత చట్టవ్యతిరేకంగా, అన్యాయంగా ఎందుకు ప్రవర్తించిందో చరిత్రను అన్వేషించాలి. సామాజిక, పరిపాలన, న్యాయశాస్త్ర చరిత్రలలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ‘‘తెలంగాణ ట్వెల్వ్‌’ ఘట్టం ఇంతగా ఎందుకు మరుగున పడిందో చర్చించాల్సిన అవసరం ఉన్నది. 


- ఎన్‌. వేణుగోపాల్‌ 

ఫోన్‌: 9848577028

Updated Date - 2021-07-04T19:21:26+05:30 IST