సాయుధ హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-17T04:42:19+05:30 IST

విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటూ.. మూడు దశాబ్దాలకుపైగా సాయుధ దళంలో పని చేస్తున్నారు. జాతీయస్థాయి బాక్సింగ్‌లో గోల్డ్‌మెడల్‌ కూడా సాధించారు. కానీ, ఏమైందో.. రోజూ మాదిరి రోల్‌కాల్‌కు హాజరైన గంట వ్యవధిలోపే బలవన్మరణం చెందారు. కుటుంబ సభ్యులకు, సహచర సిబ్బందికి తీరని విషాదాన్ని మిగిల్చారు. ఇదీ ఎచ్చెర్ల సాయుధ పోలీసుదళంలో హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్బారావు విషాదాంతం.

సాయుధ హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య
మర్రిపాడు సుబ్బారావు (ఫైల్‌ఫోటో)

- రోల్‌కాల్‌కు హాజరైన గంటలోపే ఘటన
- అనుమానాస్పదస్థితి మృతిగా కేసు నమోదు
ఎచ్చెర్ల, మే 16:
విధి నిర్వహణలో నిజాయితీగా ఉంటూ.. మూడు దశాబ్దాలకుపైగా సాయుధ దళంలో పని చేస్తున్నారు. జాతీయస్థాయి బాక్సింగ్‌లో గోల్డ్‌మెడల్‌ కూడా సాధించారు. కానీ, ఏమైందో.. రోజూ మాదిరి రోల్‌కాల్‌కు హాజరైన గంట వ్యవధిలోపే బలవన్మరణం చెందారు. కుటుంబ సభ్యులకు, సహచర సిబ్బందికి తీరని విషాదాన్ని మిగిల్చారు. ఇదీ ఎచ్చెర్ల సాయుధ పోలీసుదళంలో హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్బారావు విషాదాంతం. వివరాల్లోకి వెళితే. ఎచ్చెర్ల సాయుధ పోలీసుదళంలో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ మర్రిపాడు సుబ్బారావు(51) సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం నగరానికి సమీపాన తోటపాలెం పరిధి ఎస్‌ఏటీ నగరంలో ఈయన నివాసం ఉంటున్నారు. ఉదయం 5.30 గంటల సమయంలో ఇంటి వద్ద బయలుదేరి.. ఎచ్చెర్లలో సాయుధ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 5.45 నుంచి 6.15 గంటల వరకు రోల్‌కాల్‌కు హాజరయ్యారు. తర్వాత ఎవరికీ కన్పించకుండా పోయారు. తండ్రి ఇంటికి రాకపోవడంతో.. కుమారుడు రాజారావు (సాయుధ కానిస్టేబుల్‌) ఆయనకు పలుసార్లు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. అనుమానం వచ్చి సుబ్బారావు బ్యాచ్‌మీట్‌కు ఫోన్‌ చేశారు. దీంతో తోటి సిబ్బంది వెతకగా.. సాయుధ క్వార్టర్స్‌లోని 8వ సర్కిల్‌లో నిరుపయోగంగా ఉన్న ఓ ఇంట్లో ఫ్యాన్‌ కొక్కేనికి ఉరేసుకుని సుబ్బారావు నిర్జీవంగా కన్పించాడు. దీంతో కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది విషాదంలో మునిగిపోయారు.  

మనస్తాపంతోనే..
సుబ్బారావు స్వస్థలం మెళియాపుట్టి మండలం బందపల్లి. సాయుధ దళంలో 1992లో కానిస్టేబుల్‌గా చేరారు. అనంతరం పదోన్నతి పొంది హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సాయుధ కార్యాలయం, క్వార్టర్స్‌లో నీటి సరఫరా చేసే ప్లంబర్‌గా పని చేస్తున్నారు. దీంతోపాటు సాయుధ అధికారులు సూచనల మేరకు ఇతర విధులను కూడా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం తోటపాలెం పరిధి ఎస్‌ఏటీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. సుబ్బారావుకు భార్య వీరమ్మతో పాటు కుమారుడు రాజారావు, కుమార్తె కల్యాణి ఉన్నారు. రాజారావు స్థానిక సాయుధ దళంలోనే కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అల్లుడు ఎల్‌పీబీ నాయుడు కూడా ఇక్కడే ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య వీరమ్మ సుమారు ఆరు నెలల కిందట అనారోగ్యానికి గురై మంచం పట్టింది. ఓ వైపు విధులకు హాజరవుతూనే, మరో వైపు భార్యకు సేవలు చేయాల్సి రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో అప్పటికే మద్యం అలవాటు ఉన్న ఆయన.. మరింత బానిసయ్యాడు. ఆరోగ్యం క్షీణిస్తుందని కుటుంబ సభ్యులు పలుసార్లు హెచ్చరించినా.. మద్యం అలవాటును మానుకోలేకపోయాడు. ఈ విషయమై కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు జరగడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజారావు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ కె.రాము తెలిపారు.

ఎస్పీ సందర్శన
సంఘటన స్థలాన్ని ఎస్పీ జీఆర్‌ రాధిక, ఏఎస్పీ శ్రీనివాసరావులు సందర్శించారు. సుబ్బారావు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మూడు దశాబ్దాలకుపైగా సాయుధ దళంలో నిజాయితీగా సేవలందించిన సుబ్బారావు.. ఇలా చేయడం నమ్మశక్యంగా లేదని తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ‘ఆదివారం సాయుధ క్వార్టర్స్‌ ఆవరణలో నిర్వహించిన మరిడమ్మ సంబరంలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఈ సంబరానికి వేసిన టెంట్లను కూడా దగ్గరుండీ మరీ తీయించాడు. రోజూ మాదిరిగానే సోమవారం ఉదయం రోల్‌కాల్‌కు హాజరైన.. గంటలోపే శిఽథిల క్వార్టర్స్‌లో ఉరేసుకుని మృతి చెందడం బాధాకరమ’ని సిబ్బంది పేర్కొన్నారు.

Updated Date - 2022-05-17T04:42:19+05:30 IST