Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 31 Dec 2021 15:00:20 IST

సినిమా రివ్యూ : అర్జున ఫల్గుణ

twitter-iconwatsapp-iconfb-icon
సినిమా రివ్యూ : అర్జున ఫల్గుణ

చిత్రం : అర్జున ఫల్గుణ 

విడుదల తేదీ : డిసెంబర్ 31, 2021

నటీనటులు : శ్రీవిష్ణు, అమృతా అయ్యర్, రంగస్థలం మహేశ్, శివాజీరాజా, నరేశ్, దేవీప్రసాద్, సుబ్బరాజు, దయానంద్ రెడ్డి, గౌరవ్ పరీక్, చైతన్య గరికిపాటి, రాజ్‌కుమార్ కాశిరెడ్డి తదితరులు

ఎడిటర్ : విప్లవ్ నిషాదం

సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి

సంగీతం : ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్

నిర్మాణం : మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్

డైలాగ్స్ : సుధీర్ వర్మ పి

దర్శకత్వం : తేజ మార్ని

‘రాజ రాజచోర’ సూపర్ హిట్ తర్వాత విలక్షణ హీరో శ్రీవిష్ణు నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ఈ సినిమా ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చింది. కొత్త దర్శకుడు తేజ మార్ని దర్శకత్వంలో రూపొందింది ఈ సినిమా. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాకథనాలతో.. కామెడీ ఎంటర్‌టైనర్ గా సాగే ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది? శ్రీవిష్ణుకి మరో మంచి హిట్టిచ్చే సత్తా ఈ సినిమాకు ఉందా? రివ్యూలో చూద్దాం.

కథ

తూర్పుగోదావరి జిల్లా ములకల్లంకలో అర్జున్ (శ్రీవిష్ణు), శ్రావణి (అమృతా అయ్యర్), తాడోడు (రంగస్థలం మహేశ్), రాంబాబు, ఆస్కార్ చిన్నప్పటి నుంచి స్నేహితులు.  ఆ ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరుగుతూ తల్లి దండ్రులకు తలపోటుగా మారతారు. అర్జున్ కు తన స్నేహితులంటే ప్రాణం.  తాడోడి ఇంటిని బ్యాంక్ వారు జప్తు చేస్తుంటే.. ఆ ఊరి కరణం ( నరేశ్ ) హామీ మేరకు కొంత డబ్బు చెల్లించి.. జప్తును కొద్దిరోజులు వాయిదా వేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ప్రాసెస్ లో అర్జున్ తన ఆవును కరణానికి తనఖా పెట్టాల్సి వస్తుంది. తాడోడి ఇంటిని విడిపించి.. వారి కుటుంబాన్ని ఒడ్డున పడేయాలనుకున్న అర్జున్ స్నేహితులు ..ఆ ఊళ్ళో సోడా సెంటర్ పెట్టాలనుకుంటారు.  ఆ ప్రాసెస్ లో వారి చిన్నప్పటి మరో స్నేహితుడి ఆఫర్ మేరకు వైజాగ్ వెళ్ళి గంజాయి స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఐదుగురు స్నేహితులు వైజాగ్ లోని అరకు చేరతారు. అక్కడ సరుకు తీసుకొని.. ఒరిస్సాలో దాన్ని అందచేసి డబ్బులు తీసుకొని మళ్ళీ వైజాగ్ వచ్చేయాలని ప్లాన్ చేస్తారు. అయితే అనూహ్యంగా ఈ మిత్ర బృందం పోలీసులకు చిక్కుతారు. అక్కడనుంచి కష్టపడి తప్పించుకొని  తిరిగి తమ ఊరికి వచ్చేస్తారు. పోలీసులు వీరిని వేటాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఊరిలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అర్జున్ మిత్ర బృందం ఈ కేసునుంచి ఎలా బైట పడ్డారు? తాడోడి ఇంటిని జప్తునుంచి ఎలా విడిపించారు? అన్నది మిగతా కథ. 

విశ్లేషణ 

ఒక హీరో.. తన స్నేహితుల కోసం చేసిన అడ్వెంరస్ విలేజ్ స్టోరీ ఇది. తీసిపాడేసే కథయితే ఏమీ కాదు. చక్కటి కామెడీ, పంచ్ డైలాగ్స్, గోదావరి వెటకారం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే  వాటిని పెర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో కొంతమేరే సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ‘అర్జున ఫల్గుణ’ టైటిల్ కు జెస్టిఫికేషన్ ఇవ్వడానికి అన్నట్టు .. సినిమా బిగినింగ్ లో రంగస్థలం మహేశ్ చిన్నపిల్లలకి  అర్జున ఫల్గుణ కి నిర్వచనం ఇవ్వడం, అసలది ఎలా పుట్టింది అనేది వివరించడం, దానికి తగ్గట్టుగా హీరోని పరిచయం చేయడం బాగుంది. హీరో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వచ్చే సన్నివేశాల్ని మరింత పగడ్బందీ గా రాసుకొని ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే. బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోవడంతో కథనం ఫ్లాట్‌గా సాగుతుంది. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యం తీసుకున్నప్పుడు దానికి రిటేటెడ్ గా ఉన్న సీన్స్ ఎంతో థ్రిల్ చేయాలి ప్రేక్షకుల్ని. అవి లేకపోవడమే ఈ సినిమాకి మైనస్. కొన్ని ట్విస్టులు, ఇంటెర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటాయి. అలాగే.. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్వి్స్ట్, క్లైమాక్స్ మెప్పిస్తాయి. 

అర్జున్ గా శ్రీవిష్ణు అదరగొట్టాడు. తూర్పు గోదావరి యాసలో అతడు పలికే డైలాగ్స్ నవ్విస్తాయి. స్నేహితుల మధ్య వచ్చే వన్ లైన్ పంచెస్ బాగా పేలాయి. సుధీర్ వర్మ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. కథానాయిక అమృతా అయ్యర్ గ్లామర్ ఒలికించడానికి పెద్ద స్కోపేమీ లేదు. అలాగే. నటన పరంగా ఆమె చేసిందేమీ లేదు. ఇక కరణంగా నరేశ్ ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్ చూపుతూ వైవిధ్యంగా నటించారు. నరేశ్ ఈ తరహా పాత్రను ఇంతకు ముందెన్నడూ చేయలేదు.  పోలీసాఫీసర్ గా సుబ్బరాజు నటన పర్వాలేదనిపిస్తుంది. ఇక మహేశ్ తండ్రిగా దేవీప్రసాద్, శ్రీవిష్ణు తండ్రిగా శివాజీరాజా మంచి నటన కనబరిచారు. ఇక నేపథ్య సంగీతం, సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. జగదీష్ చీకటి కెమేరా పనితనం మెప్పిస్తుంది. మొత్తం మీద ‘అర్జున ఫల్గుణ’ చిత్రం శ్రీవిష్ణు వన్ మేన్ షో తో సాగిన చిత్రమని చెప్పాలి. 

ట్యాగ్ లైన్ : కొంత వినోదం.. కొంచెం సాహసం  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International