కేంద్రమంత్రి అర్జున్ మేఘవాల్‌కి కరోనా

ABN , First Publish Date - 2020-08-09T05:21:10+05:30 IST

కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌‌‌కి కొవిడ్-19 పాజిటివ్‌ ఉన్నట్టు ఇవాళ వైద్య పరీక్షల్లో తేలింది...

కేంద్రమంత్రి అర్జున్ మేఘవాల్‌కి కరోనా

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌‌‌కి కొవిడ్-19 సోకినట్టు ఇవాళ వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. తాను రెండు సార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నాననీ.. రెండోసారి పాజిటివ్ అని తేలిందని మేఘవాల్ వెల్లడించారు. అయితే ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉన్నట్టు ఆయన తెలిపారు. మధ్య ప్రదేశ్‌లోని బికనేర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మేఘవాల్ ప్రస్తుతం కేంద్ర భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు.


‘‘కొవిడ్-19 లక్షణాలు ఉన్నట్టు అనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వైద్యుల సూచనల మేరకు ఎయిమ్స్‌లో చేరాను. ఇటీవల కాలంలో నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా దయచేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను..’’ అని మేఘవాల్ పేర్కొన్నారు. కాగా ఇవాళ మరో కేంద్రమంత్రి కైలాస్ చౌదరి కూడా కొవిడ్-19 బారిన పడ్డారు. ఇప్పటికే కేంద్రమంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లు కరోనా ఇన్ఫెక్షన్‌కి గురైన విషయం తెలిసిందే.

Updated Date - 2020-08-09T05:21:10+05:30 IST