అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2022-08-11T05:47:43+05:30 IST

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ డాక్టర్‌ స్రవంతిరాయ్‌ బుధవారం దొంగల వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
దొంగల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ డాక్టర్‌ స్రవంతిరాయ్‌

రెండు కార్లు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం 

పరారీలో ముగ్గురు

తెనాలి క్రైం, ఆగస్టు 10: అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను తెనాలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ డాక్టర్‌ స్రవంతిరాయ్‌ బుధవారం దొంగల వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. జూలై 20న అర్ధరాత్రి కొల్లిపరలోని భీమవరపు మీనాకుమారి ఇంట్లో రూ.10 లక్షలు నగదు, నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కొల్లిపర ఎస్‌ఐ రవీంద్రారెడ్డి 12 మంది సభ్యులుగల ముఠా ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా గుర్తించారు. కొల్లిపరకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ అప్సర్‌, మరికొందరు ముఠాగా ఏర్పడి రెండు కార్లలో గ్రామంలోకి ప్రవేశించి అర్ధరాత్రి సమయంలో మీనాకుమారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. అనంతరం బుధవారం మరో దొంగతనానికి పథకం పన్ని నందివెలుగు వద్ద మరికొందరితో సమావేశమాయ్యరు. ఈ సమాచారం తెలుసుకున్న రూరల్‌ సీఐ ఎం. సుబ్రహ్మణ్యం, కొల్లిపర ఎస్‌ఐ రవీంద్రారెడ్డి ఎంతో చాకచక్యంతో ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.8.50లక్షలు నగదు, బంగారు నగలు, పోగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మొత్తం 12 మంది సభ్యుల్లో ముఠాకి నాయకత్వం వహిస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌ షేక్‌ అప్సర్‌తో పాటు నూతక్కి జగదీష్‌ (కృష్ణాజిల్లా పామూరుకు), పల్లపు భువనేష్‌ (పల్నాడు జిల్లా దాచేపల్లి), బుస్కా మాణిక్యరావు (చుండూరు.. వలివేరు), కోడూరు సునీల్‌ కుమార్‌ (నారాకోడూరు), చావలి సాంబశివరావు, షేక్‌ బాజి (కృష్ణాజిల్లా నున్న), గోవాడ కిరణ్‌ (మిర్యాలగూడ),  సిరికొండ శ్రవణ్‌ (నల్గొండ)లను అదుపులోకి తీసుకోగా, ముగ్గురు పరారిలో  ఉన్నట్లు తెలిపారు. వీరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని, ఈ ముఠా నేరచరిత్రను లోతుగా విచారించాల్సి ఉందని డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో రూరల్‌సీఐ సుబ్రహ్మణ్యం, కొల్లిపర ఎస్‌ఐ రవీంద్రారెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T05:47:43+05:30 IST