దొంగతనం కేసులో నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2022-08-06T05:09:17+05:30 IST

పర్చూరులో గత నెలలో జరిగిన దొంగతనం కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

దొంగతనం కేసులో నలుగురి అరెస్టు
స్వాధీనం చేసుకున్న ఆభరణాలతో వివరాలు తెలియజేస్తున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బంగారం, సెల్‌ఫోన్లు స్వాధీనం

బాపట్ల, ఆగస్టు5: పర్చూరులో గత నెలలో జరిగిన దొంగతనం కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పర్చూరు గ్రామంలోని యూనియన్‌ బ్యాంక్‌ సమీపంలో శ్రీరామ్‌ వెంకటసుబ్బారావు కుటుంబం నివసిస్తోంది. గత నెల 29న అర్ధరాత్రి వారి ఇంట్లోకి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించారు. వెంకటసుబ్బారావును బెదిరించి, భార్యను కట్టివేసి ఇంట్లో ఉన్న బంగారం, సెల్‌ఫోన్లను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పర్చూరు పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు పర్యవేక్షణలో మార్టురు సీఐ ఐ.ఆంజనేయరెడ్డి బృందంగా ఏర్పడి సాంకేతిక ఆధారాలతో కేసును దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. పర్చూరులోని కొమర్నేనివారిపాలేనికి చెందిన దేవరకొండ శ్రీను, పల్నాడు జిల్లా చల్లగుండ్ల గ్రామానికి చెందిన కుంభా వీరబ్రహ్మం, కుంభా సాంబశివరావు, సంతమాగులూరు మండలం కామేపల్లికి చెందిన కుంభా పెద రోశయ్య, నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన ఉయ్యాల చక్రవర్తిలు ఈ నేరానికి పాల్పడినట్లు తెలుసుకొన్నారు.  వారిలో నలుగురిని శుక్రవారం అరెస్టు చేసి వారి వద్ద ఉన్న 77.410 గ్రాముల బంగారు ఆభరణాలను, సెల్‌ఫోన్‌లను, నేరానికి ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నిందితులు గతంలో అనేకచోట్ల వైన్‌షాపులలో ప్రవేశించి నగదు, మద్యం బాటిల్స్‌ అపహరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.  సమావేశంలో ఏఎస్పీ పి.మహేష్‌, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, సీఐ ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-06T05:09:17+05:30 IST