ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-05-11T05:46:39+05:30 IST

తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు.

ఇళ్లల్లో చోరీలు చేస్తున్న ముఠా అరెస్టు
చోరీ సొత్తును పరిశీలిస్తున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

గుంటూరు, మే 10: తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాను నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. అడవితక్కెళ్లపాడు రాజీవ్‌గృహకల్పకు చెందిన ఉప్పల సురేష్‌, ఆది వెంకయ్య అలియాస్‌ శ్రీను, 7వ బ్లాక్‌కు చెందిన షేక్‌ మాలిక్‌, బొడ్డుగోరి వెంకట్‌లతోపాటు మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. రాజీవ్‌ గృహకల్ప ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు, ఇద్దరు మైనర్లు కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. అందుకు అవసరమైన డబ్బు కోసం తాళాలు వేసుకున్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్నారు. తురకపాలెంరోడ్డులోని జన్మభూమినగర్‌కు చెందిన తాళ్లపల్లి సుబ్బారావు అలియాస్‌ సురేష్‌ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఈ ముఠా కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆది వెంకయ్యకు చెందిన ద్విచక్ర వాహనంపై నగరంలో తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను ముందుగా గుర్తించి రాత్రి వేళ   ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. నల్లపాడు పోలీసు స్టేషన్‌ పరిధిలో నాలుగు దొంగతనాలు, పెదకాకాని, పట్టాభిపురం స్టేషన్‌ పరిధిలో మరో రెండు దొంగతనాలకు పాల్పడ్డారు. జన్మభూమినగర్‌లో జరిగిన చోరీ కేసు ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగగా ఈ ముఠా కొంతకాలంగా నగరంలో చేసిన చోరీ కేసులు వెలుగుచూశాయి. ఈ ముఠా ద్వారకానగర్‌, జన్మభూమినగర్‌, గోరంట్ల, అగతవరప్పాడు తదితర ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నల్లపాడు స్టేషన్‌ సమీపంలోని ఓ స్కూలు వద్ద చోరీ సొత్తును వీరు పంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా నల్లపాడు సీఐ కె.వీరాస్వామి, కానిస్టేబుళ్లు ఆదిబాబు, డి.పోతురాజు, షేక్‌ జాన్‌సైదా, ఎం.సంగంనాయుడు తదితరులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కేసులో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి రివార్డు ప్రకటించారు.

బంగారం కొట్టేసిన మహిళల అరెస్టు

ఓ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని ఇంటికి వచ్చి రూ.10 లక్షల ఖరీదైన సొత్తును అపహరించిన ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్‌ 4వ లైనుకు చెందిన జి.మనీష, ఆమె తల్లి జి.ఝాన్సీలను సోమవారం పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. వికాస్‌నగర్‌ 5వ లైనుకు చెందిన ఈవూరి రాధాదేవితో ఝాన్సీ కుటుంబానికి కొంతకాలంగా సాన్నిహిత్యం ఉంది. రాకపోకలు సాగించే క్రమంలో రాధాదేవి ఇంట్లో బంగారు ఆభరణాలు ఉన్నట్లు తల్లికూతురు గ్రహించారు. ఈ నేపథ్యంలో కూతురు మనీషాకు వివాహం నిశ్చయమైందని, పెళ్లి పిలుపుల కోసం వచ్చినట్టు ఝాన్నీ రాధాదేవి ఇంటికి వచ్చి గత నెల 29న మధ్యాహ్నం చెప్పారు. ఆ రోజు అంతా అక్కడే ఉండి ఆ తర్వాత రోజు రాధాదేవి ఇంట్లోని బీరువాలో దాచిన సుమారు 10 లక్షల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. వెస్టు డీఎస్పీ కె.సుప్రజ, పట్టాభిపురం ఇన్‌చార్జి సీఐ ఏవీ శివప్రసాద్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వై.సత్యనారాయణ నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.10 లక్షల ఖరీదైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-05-11T05:46:39+05:30 IST