టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా?

ABN , First Publish Date - 2021-07-19T05:30:00+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత మాస్క్‌లు తీసేసి తిరగకూడదని ప్రభుత్వం, వైద్యులు హెచ్చరిస్తున్నారు. శుభ్రంగా ఉండటం, జనాల్లోకి వెళ్లకపోవడమే మంచిది.

టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా?

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత మాస్క్‌లు తీసేసి తిరగకూడదని ప్రభుత్వం, వైద్యులు హెచ్చరిస్తున్నారు. శుభ్రంగా ఉండటం, జనాల్లోకి వెళ్లకపోవడమే మంచిది. అయితే ప్రయాణీకులు ఆగే పరిస్థితి లేదు. నేచర్స్‌ లవర్స్‌ అవేమీ పట్టించుకోవడం లేదు. అయితే ప్రయాణాలు చేసే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

జాగ్రత్తలు తీసుకుంటేనే రిస్క్‌ను తగ్గించుకున్నట్లు. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లేవారు మరింత జాగ్రత్తలు పాటించాలి. అన్ని ఆఫీసులు, మాల్స్‌, విహార కేంద్రాలు తెరవడం వల్ల ఎక్కడ చూసినా గుంపు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో కరోనా బారిన పడకుండా ఉండాలంటే.. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాల్సిందే. కుటుంబంతో కలిసి ప్రయాణించేప్పుడైనా, మీరు సోలో ట్రిప్‌ వేస్తున్నా సరే.. ముందు మనం బుక్‌ చేసుకుంటున్న హోటల్‌ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తుందో లేదో అడిగి తెలుసుకోవాలి. వాళ్ల హోటల్‌ వెబ్‌సైట్స్‌ను పరిశీలించాలి. రూమ్‌ శానిటైజేషన్‌, క్యాష్‌లెష్‌ పేమెంట్స్‌ ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. ఫలానా హోటల్స్‌కు జనాలు ఎక్కువగా వస్తున్నారనే విషయం తెలిస్తే దాన్ని ఎంపిక చేసుకోకుండా ఉండటమే ఉత్తమం. రద్దీ లేని హోటల్‌కే మొగ్గుచూపాలి. రెండు మూడు రోజులనుంచి ఖాళీగా ఉండే రూమ్‌ను తీసుకోవడం కూడా మంచిదే.

శానిటైజేషన్‌ ఉండాల్సిందే

రూమ్‌ వెకేట్‌ చేసిన వెంటనే హోటల్‌ గదులను శానిటైజ్‌ చేయడం మామూలే. అలా కాకుండా మన కోసం గెస్ట్‌లు వచ్చినా సరే హోటల్‌ గదిలోని తలుపులు, కిటికీ, రిమోట్‌, స్విచ్‌లు కూడా శుభ్రపరిచే వాటికే ఓటేయ్యాలి. హౌస్‌ కీపర్స్‌, బాయ్స్‌, అతిథులు వచ్చినా పరిమిత దూరంలో ఉండి మాట్లాడటం మంచిది. మాస్క్‌ తప్పనిసరిగా వాడాలి. ఎలివేటర్స్‌, లిఫ్టులు వాడే పని లేకుండా మొదటి, రెండో ఫ్లోర్‌లో తీసుకోవాలి. అతిథులనైనా, మనమైనా సరే స్టెప్స్‌ ఉపయోగించడమే మంచిది. మీరు ఒకవేళ జిమ్‌, వర్కవుట్స్‌, యోగా చేసేవారైతే హోటల్‌లో ఉండే జిమ్‌కు వెళ్లకపోవడమే మంచిది. మీ గదిలోనే ఉండి యోగా, వర్కవుట్స్‌ చేయడం మంచిది. సాధ్యమైనంత వరకూ గుంపుగా ఉన్నపుడు బఫే తినడం కంటే సింగిల్‌గా రూమ్‌లోకి తెప్పించుకుని తినడం లేదా రెస్టారెంట్‌ ఏరియాలో సోలోగానే తినటమే సో బెటర్‌!


సమూహంలోకి వద్దే వద్దు

ఆ.. ఏముందీ! కరోనా లేదనే నిర్లక్ష్యంతో గుంపులోకి వెళ్తే అంతే సంగతులు. ఇంకా కరోనా కేసులు నమోదు అవుతున్నాయనే విషయం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రార్థనా మందిరాలు, గుంపులుగా ఉండే జలపాతాలు, నదీ స్నానాలు.. లాంటి వాటికి దూరంగా ఉండాలి. రద్దీ స్థలాలతో పాటు అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, ఫుడ్‌ కోర్టులు.. లాంటి వాటికి వెళ్లకపోవడమే ఉత్తమం.  సాధ్యమైనంత వరకూ ఈ సమయంలో ఫ్యామిలీ ట్రిప్‌లను అవాయిడ్‌ చేయడమే మంచిది. 

Updated Date - 2021-07-19T05:30:00+05:30 IST