తమాషాలు చేస్తున్నారా?

ABN , First Publish Date - 2021-08-08T04:45:16+05:30 IST

‘శాసన సభ్యులు సమాచారం అడిగితే..

తమాషాలు చేస్తున్నారా?
జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ

అధికారులపై మంత్రి బొత్స ఆగ్రహం

వాడివేడిగా డీఆర్‌సీ

ఎమ్మెల్యే ప్రశ్నలతో ఇరుకున పడిన జిల్లా వైద్యాధికారి

మంత్రికి క్షమాపణలు చెప్పిన కలెక్టర్‌


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): ‘శాసన సభ్యులు సమాచారం అడిగితే ‘కాన్ఫిడెన్షియల్‌ ఇష్యూ అంటారా?... తమాషాలు చేస్తున్నారా?’ అంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తీరుపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం శనివారం ఉదయం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి మీడియాకు అనుమతి నిరాకరించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ప్రజా సమస్యల ప్రస్తావన కంటే సభ్యులు సొంత అజెండాలే ఎక్కువగా ప్రస్తావించారు. వివిధ శాఖలపై ధ్వజమెత్తారు. అధికారులు తమ మాట వినటం లేదని కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సమాచారం అడిగినా ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగులు, వికలాంగుల పింఛన్లకు సంబంధించిన సమాచారం అడిగితే ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.


దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రమణకుమారి మాట్లాడుతూ ‘కాన్ఫిడెన్షియల్‌ విషయాలు కనుక ఇవ్వలేకపోయాన’ని చెప్పారు. ఆ మాటతో సమావేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ‘శాసన సభ్యులు సమాచారం అడిగితే ‘కాన్ఫిడెన్షియల్‌ ఇష్యూ అంటారా?’ అని మంత్రి బొత్స మండిపడ్డారు. ‘తమాషాలు చేస్తున్నారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి కల్పించుకొని... క్షమించాలని మంత్రిని కోరారు. ఇక ముందు ఇటువంటి పరిస్థితి రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. తమకు తెలియకుండానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. కనీస సమాచారం ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం కార్పొరేషన్‌, మండల పరిధిలో పింఛనుదారుల ఎంపిక ఎలా జరుగుతోందో తెలియడం లేదని ఎమ్మెల్యే కోలగట్ల అన్నారు. పింఛన్లు తొలగించారంటూ అనేక మంది అర్హులు తన వద్దకు వస్తున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 


వారిపై చర్యలు తీసుకోండి

నాటు బళ్లతో ఇసుకను తరలిస్తున్న వారిపై ఎస్‌ఈబీ పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని... వారిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి మంత్రి బొత్స ఆదేశించారు. అటవీ శాఖ పనితీరును ఎమ్మెల్యేలు ఎండగట్టారు. అటవీ శాఖ తీరు వల్ల సాలూరు మండలంలో 11 రోడ్లు నిలిచిపోయాయని ఎమ్మెల్యే రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. పావురాలుగెడ్డ, జిల్లేడువలస, గుర్లగెడ్డ, ఆడారుగెడ్డ ప్రాజెక్ట్‌లపై మంత్రులకు లేఖలు అందజేశారు. జగనన్న కాలనీల్లో వేగంగా మౌలిక సదుపాయాలను కల్పించాలని సంబంధిత అధికారులను మంత్రులు ఆదేశించారు. విద్యుత్‌ లైన్‌ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయని ఎస్‌ఈ మసిలామణిని ప్రశ్నించగా... ఆ వివరాలను ఆయన తెలిపారు. వ్యవసాయ శాఖ సమీక్షలో ఇంతవరకు వరి నాట్లు ఏ స్థాయిలో పడ్డాయని మంత్రులు అడిగి తెలుసుకున్నారు. ఎరువులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జీడీ ఆశాదేవిని ఆదేశించారు. అనంతరం సాగునీటి పరిస్థితులపై చర్చ సాగింది.


ఆలయ ఆస్తులు అన్యాక్రాంతమంటూ..

సమావేశం తరువాత విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. మాన్సాస్‌ పరిధిలో వందలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి  ఆరోపించారు. కొన్ని భూములను విక్రయించారని, పూర్తి సమాచారం త్వరలోనే వస్తుందని చెప్పారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. బొబ్బిలి ఆలయ ఆభరణాలు కోటలో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి బొత్స మాట్లాడుతూ మాన్సాస్‌ చైర్మన్ల వ్యవహారం కుటుంబ సమస్యగానే మరోసారి పేర్కొన్నారు. వారసత్వ సమస్యలపై కోర్టుల్లో పోరాడుతున్న విషయాన్ని ప్రభుత్వానికి అంటగట్టవద్దని అన్నారు. 


పిలిచారు.. వెళ్లగొట్టారు..

జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి మీడియా హాజరు కావాలని తొలుత ఆహ్వానించారు. సమావేశం ప్రారంభానికి కొద్దిసేపు ముందు మీడియాకు అనుమతి లేదని సమాచార పౌర సంబంధాల శాఖ డీడీ ప్రకటించారు. జిల్లా మంత్రుల ఆదేశాల నేపథ్యంలోనే డీడీ ఈ ప్రకటన చేశారు. దీంతో శనివారం ఉదయం 9.30  నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్‌ ప్రాంగణంలోనే మీడియా మొత్తం వేచి చూడాల్సి వచ్చింది. సమావేశ అనంతరం మీడియాతో మాట్లాడతామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చకంటే మీడియాను నియంత్రించే పనిలోనే ప్రజా ప్రతినిధులు ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ఎప్పుడూ లేని సంప్రదాయాన్ని మంత్రులు కొత్తగా అమలు చేయటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విలేకరుల సమావేశంలో కూడా ఏ సమస్యపై ప్రశ్నించినా మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడారు. 

Updated Date - 2021-08-08T04:45:16+05:30 IST