బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.రెండు వేల పెన్షన్‌ ఇస్తున్నారా?

ABN , First Publish Date - 2021-08-01T05:45:54+05:30 IST

రెండు వేల రూపాయాల పెన్షన్‌ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రశ్నించారు.

బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.రెండు వేల పెన్షన్‌ ఇస్తున్నారా?
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొప్పుల

- రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తారా

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

జమ్మికుంట, జూలై 31: రెండు వేల రూపాయాల పెన్షన్‌ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రశ్నించారు. పట్టణంలో 31.3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం లేదన్నారు. దళిత బంధులో 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో బండి సంజయ్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు.  వందల సంవత్సరాలుగా వెనుకబడి ఉన్న దళితులకు దళిత బంధు వరం లాంటిదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ది సంక్షేమంలో ఎంత ముందున్నామో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పట్టణాలు, గ్రామాలు, కుల వృత్తులను అభివృద్ధి చేయడమే కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు ఏదో ఒక రూపంగా అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పోడేటి రామస్వామి, నాయకులు పొనగంటి మల్లయ్య, తుమ్మేటి సమ్మిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-01T05:45:54+05:30 IST