ఈ విశ్వంలో మనం ఒంటరేనా?

ABN , First Publish Date - 2021-07-18T16:49:02+05:30 IST

మన తెలుగు వాళ్ల ఖ్యాతి ఏళ్ల కిందటే ఎల్లలు దాటింది. ఇప్పుడు విశ్వమే వాళ్లకు అంతిమ లక్ష్యమైంది..

ఈ విశ్వంలో మనం ఒంటరేనా?

మన తెలుగు వాళ్ల ఖ్యాతి ఏళ్ల కిందటే ఎల్లలు దాటింది. ఇప్పుడు విశ్వమే వాళ్లకు అంతిమ లక్ష్యమైంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మనస్వి లింగం అందులో ఒకరు. అతనికి ఆకాశమే కాదు, అంతరిక్షమే హద్దు. విశ్వాంతరాలను శోధించి, ఖగోళశాస్త్రంలో పురోగతి సాధించి... ప్రపంచానికే కొత్త దారులు చూపుతున్నారు. గ్రహాంతర జీవుల అన్వేషణలో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారీయన. ఇప్పుడిప్పుడే అంతరిక్ష పరిశోధనలపై ఆశలు రేపుతున్న ఆస్ట్రో బయాలజీ నేపథ్యంతో... ఆయన రాసిన ‘లైఫ్‌ ఇన్‌ ది కాస్మోస్‌’ పుస్తకం ఆ రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో పనిచేస్తున్న మనస్వి... తొలి భారతీయ ఆస్ట్రో బయాలజీ ఆచార్యులు... గ్రహాంతర జీవుల అన్వేషణకు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి? ఆ విశేషాల విశ్లేషణే ఈ వారం కవర్‌స్టోరీ... 



ఆస్ట్రో బయాలజీ శాస్త్రానికి సంబంధించి ఇప్పటి దాకా ఒక పాఠ్యపుస్తకం లేదు. ఈ కొత్త పుస్తకం ఆ కొరతను తీరుస్తుంది. వాస్తవానికి ఆస్ట్రోబయాలజీలో అంతరిక్షంలో జీవానికి సంబంధించిన అంశాలు మాత్రమే కాకుండా.. విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది? గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? జీవం ఎక్కడ, ఎప్పుడు, ఎలా పుట్టింది? ఎలా విస్తరించింది? లాంటి అనేక విషయాలపై కూడా దృష్టి సారిస్తుంది. ఈ పుస్తకం చివరి అధ్యాయంలో అంతరిక్షంలో అన్వేషణ జరపటానికి మన వద్ద ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సరిపోతుందా? అనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. 


అది 2000 సంవత్సరం.. హైదరాబాద్‌ నగరం.. సమయం ఉదయం 9 గంటలు.. తాత, మనవడు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు... ఆ కుర్రాడికి పట్టుమని పన్నెండేళ్లు లేవు. ఆ చిట్టి బుర్ర నిండా ప్రశ్నలే! ప్రతిదీ కుతూహలమే! ఆ రోజు ఆకాశం నీలిరంగు పులుముకుంది. అక్కడక్కడ మేఘాలపై సూర్యకిరణాలు పడి మెరిసిపోతున్నాయి.. 


‘‘తాతా... ఆకాశంలో.. ఆ మేఘాల వెనక ఎవరైనా ఉంటారంటావా? ఉంటే వాళ్లు మనకెందుకు కనిపించరు? అసలు మనలాంటి జీవులు ఈ విశ్వంలో ఇంకేమైనా ఉన్నాయంటావా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు కుర్రాడు. హఠాత్తుగా ఆ కుర్రాడికి తన చుట్టూ కనిపించే ప్రపంచమంతా మసకబారినట్లు అనిపించింది. అనంతమైన ఆకాశంలో కనిపించని ఏవో దారులు.. రకరకాల రూపాలు కనిపించటం మొదలుపెట్టాయి...


ఒకప్పటి ఆ పన్నెండేళ్ల పిల్లవాడే నేడు ఆస్ట్రో బయాలజీలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన తెలుగు వ్యక్తి డాక్టర్‌ మనస్వి లింగం. ‘‘ఆ క్షణం నాకు ఇంకా గుర్తుంది.. మా తాతయ్య ఓపిగ్గా చెప్పే సమాధానాల వల్లే నాలో ప్రశ్నలు మొదలయ్యేవి.. చిన్నప్పటి ఆ కుతూహలమే నన్ను శాస్త్రవేత్తను చేసింది’’ అని నాటి జ్ఞాపకాన్ని పంచుకున్నారు తొలి భారతీయ ఆస్ట్రో బయాలజీ ప్రొఫెసర్‌ మనస్వి. ఫ్లోరిడా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మనస్వి రాసిన - ‘లైఫ్‌ ఇన్‌ ది కాస్మోస్‌’ అనే పుస్తకం ఖగోళ శాస్త్ర ప్రపంచంలో సంచలనం సృష్టిస్తూ, అనేక కొత్త విషయాలను చర్చకు పెట్టింది. విశ్వంలో జీవం ఆనుపానులను అధ్యయనం చేసే శాస్త్రమైన ఆస్ట్రోబయాలజీలో ఉన్నతాభ్యాసం చేసేవారికి ఈ పుస్తకం ఇప్పుడొక కరదీపిక. ఈ సువిశాల విశ్వంలో మానవుడు ఒక్కడే ఉన్నాడా? ఇతర జీవులు కూడా ఉన్నాయా? జీవం భూమిపైనే పుట్టిందా లేక మార్స్‌, వీనస్‌లపై కూడా పుట్టి ఉండవచ్చా? తను ప్రతిపాదించిన కొత్త ఖగోళ సిద్ధాంతం ఏమిటి? ఆయన రాసిన ‘లైఫ్‌ ఇన్‌ ది కాస్మోస్‌’ ద్వారా ఏమి చెబుతున్నారు? మొదలైన విషయాలపై మనస్వి ఆంధ్రజ్యోతికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.  


ఆయన ప్రతిపాదన ఏంటంటే? 

అంతరిక్షంపై మానవుడికి ఉన్న ఆసక్తి ఈనాటిది కాదు. సుదూరంలో మిణుకు మిణుకు మంటూ మెరిసే తారలు.. వెలుగులు విరజిమ్మే చందమామ, హఠాత్తుగా మెరిసి క్షణాల్లో మాయమయ్యే ఉల్కాపాతాలు.. భూమిపై రాలిపడే తోకచుక్కలు... దూసుకువచ్చే గ్రహశకలాలను కొన్ని వేల ఏళ్లుగా మానవుడు గమనిస్తూనే ఉన్నాడు. ఖగోళానికి సంబంధించిన కొత్త విషయాలు కనుగొంటూనే ఉన్నాడు. కొన్నివేల ఏళ్ల ఈ ప్రస్థానంలో - ఇప్పటికీ అంతుచిక్కని విశ్వ రహస్యాలు అనంతం. ఈ నేపథ్యంలో.. ‘ఈ విశ్వంలో మానవుడు ఒంటరేనా? లేక మనకు తెలియని సుదూర ప్రాంతాల్లో జీవం ఉందా... ఏలియన్స్‌ వంటి గ్రహాంతర జీవులు ఉన్నాయా?’ అనే మౌలిక ప్రశ్నలు వేలాది సంవత్సరాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తూనే ఉన్నాయి. దానికింకా సరైన సమాధానం దొరకలేదు. నిరంతర అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఒకవేళ మనం ఈ విశ్వంలో ఒంటరి కాకపోతే - మనలాంటి జీవులు ఎక్కడైనా ఉన్నారా? అసలు జీవానికి ఒకటే రూపమా? వేర్వేరు రూపాలుంటాయా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రత్యేక శాస్త్రం ఆస్ట్రోబయాలజీ. దీనిని సమగ్రంగా ఆవిష్కరించే పుస్తకమే ‘లైఫ్‌ ఇన్‌ ది కాస్మోస్‌’. ఆ పుస్తకం గురించి మనస్వి చెబుతూ ‘‘జీవం ఎలా ఆవిర్భవించింది? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు జీవాన్ని మనం ఎలా నిర్వచించగలం? అనేవి ఇప్పటికీ శేష ప్రశ్నలే. ముందుగా భూమిపై జీవం ఎలా వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఈ విషయంలో రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు ఉన్నాయి. భూమిపై ఉన్న ఒక చిన్న సరస్సులో నుంచి జీవం ఆవిర్భవించిందనేది మొదటి ప్రతిపాదన. సముద్రగర్భంలో అగ్నిపర్వతాలు పేలినప్పుడు కొన్ని రంధ్రాల (హైడ్రోథర్మల్‌ వెంట్స్‌) ద్వారా జీవం పుట్టిందనేది రెండో ప్రతిపాదన. ఈ రెండింటినీ సమర్థించే శాస్త్రవేత్తలు ఉన్నారు.. వ్యతిరేకించేవారూ ఉన్నారు. ఈ ప్రతిపాదనలకు ఉన్న శాస్త్రీయతను నా పుస్తకంలో విశ్లేషించాను’’ అని మనస్వి వివరించారు. 


‘ఆస్ట్రో బయాలజీ’లో ఏకలవ్యుడు

హైదరాబాద్‌లో చదువుకున్న ఒక కుర్రాడు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఎలా అయ్యాడనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఆ మాటే మనస్వితో అంటే... ఆయన ఇలా చెప్పుకొచ్చాడు...


‘‘నా చిన్నతనమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. చిన్నప్పుడు నన్ను రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడేవి. అందువల్ల స్కూల్లో కంటే ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉండేవాణ్ణి. ఆ సమయంలోనే నాకు సైన్స్‌ పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగింది. ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. నాకు సైన్స్‌ పట్ల ఆసక్తి పెరగడంలో ప్రధాన భూమిక పోషించింది మా తాతగారు. చిన్నప్పుడు నాకు వచ్చే రకరకాల సందేహాలకు ఆయన ఓపికగా సమాధానాలు చెప్పేవారు. అమ్మనాన్న నాకు చదువు చెప్పించటమే కాదు.. జీవన విలువలను కూడా నేర్పించారు. నేను సాధిస్తున్న విజయాలన్నింటికీ నా కుటుంబమే కారణం. వారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం లేకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. చాలా మంది విద్యార్థుల మాదిరిగానే ఇంటర్‌ అయిన తర్వాత ముంబయి ఐఐటీలో ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌ను అభ్యసించా. అప్పుడు కూడా నేను ఆస్ట్రో బయాలజిస్ట్‌ను అవుతానని అనుకోలేదు. ఖగోళ శాస్త్రానికి చెందిన అనేక పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని. ఫిజిక్స్‌కు ఖగోళశాస్త్రానికి మధ్య సంబంధాన్ని విశ్లేషిస్తూ ఉండేవాడిని. 2010లో యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో చేరటం నా జీవితాన్ని మలుపుతిప్పిందని చెప్పాలి. నేను చదవింది ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌. నాకు ఇష్టమైనది ఆస్ట్రో బయాలజీ. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలనేదే పెద్ద సమస్య. ఈ విషయాన్ని నా గైడ్‌ ఫిలిఫ్‌ జె. మోరిసన్‌తో చర్చించా. ఆయన సూచన మేరకు ‘ప్లాస్మా ఫిజిక్స్‌’ను అభ్యసించటం మొదలుపెట్టా. 


ఫిజిక్స్‌లోని విభాగాలన్నింటిలోను ప్లాస్మా ఫిజిక్స్‌ భిన్నమైనది. శక్తి(ఎనర్జీ)కి సంబంధించిన అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఆ సమయంలో మళ్లీ నాకు ఖగోళ శాస్త్రమంటే ఆసక్తి పెరిగింది. అయితే నాకు ఖగోళ శాస్త్రంలో ఆసక్తి ఉందనే విషయాన్ని కూడా ఎవరికీ చెప్పేవాడిని కాదు. మహాభారతంలో ఏకలవ్యుడిలా నాకు నేనే సొంతంగా అన్నీ నేర్చుకుంటూ ఉండేవాడిని. ప్లాస్మా ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ వచ్చిన తర్వాత ప్రిన్‌స్టన్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టొరల్‌ అసోసియేట్‌గా చేరాను. ఆ సమయంలో కూడా ఖగోళశాస్త్రానికి, ఆస్ట్రోబయాలజీకి సంబంధించిన అంశాలన్నీ చదువుతూ ఉండేవాడిని. నా ఆలోచనలన్నింటినీ ఒక ప్రతిపాదనగా రూపొందించి- ఆస్ట్రోబయాలజీ జర్నల్‌కు పంపా. ఆ కథనాన్ని వారు ప్రచురిస్తారని భావించలేదు. కానీ ఆ జర్నల్‌లో నా వ్యాసం పబ్లిష్‌ అయ్యింది. ఆ కథనం శాస్త్ర ప్రపంచంలో సంచలనం రేకెత్తించింది. ఎంతోమంది పరిశోధకులు, ఆచార్యులు పరిచయం అయ్యారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన యాండ్రూ హెచ్‌ కోల్‌, ప్రొఫెసర్‌ ఎవి లోయిబ్‌లతో పరిచయం నా జీవితాన్ని ఒక మలుపు తిప్పందనే చెప్పాలి. లోయిబ్‌ను ప్రతి నాలుగు వారాలకు ఒకసారి కలిసేవాణ్ణి. మా చర్చ ఖగోళ శాస్త్రంపైనే సాగేది. కేవలం ఆస్ట్రో బయాలజీ మాత్రమే కాకుండా రకరకాలైన శాస్త్ర విషయాలను చర్చించేవాళ్లం. ఈ సమయంలోనే ప్రొఫెసర్‌ లోయిబ్‌, నేను కలిసి ఆస్ట్రో బయాలజీపై పుస్తకం రాయాలనుకున్నాం. ఎందుకంటే ఆస్ట్రో బయాలజీపై ఇప్పటి దాకా అందుబాటులో ఉన్న పుస్తకాలన్నీ అంతరిక్షంలో జీవం అనే విషయంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. మా పుస్తకం మాత్రం కేవలం జీవం గురించి మాత్రమే కాకుండా దానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది..’’ అన్నారు మనస్వి. 



ఈ ప్రశ్నే కీలకం..

భూమిపైకి జీవం ఎలా వచ్చిందనే విషయాన్ని కొద్దిసేపు పక్కనపెడితే- ‘అసలు జీవానికి అర్థమేమిటి? కొన్ని పరమాణువులు కలిస్తే అది జీవమయిపోతుందా? జీవమనే సంక్లిష్ట ప్రక్రియ ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఎక్కడ ఆగుతుంది’ అనే విషయాలు కూడా మనకు తెలియవు. అంతే కాకుండా భూమిపై జీవం అంటే కేవలం కెమిస్ట్రీ, బయాలజీ మాత్రమే కాకుండా మేథ, మనస్సు వంటి అనేక విషయాలు కూడా సమ్మిళితమవుతాయి. వీటన్నింటికీ ఈ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి. ‘‘అంతరిక్షంలో జీవం ఎలా ఉంటుందనే విషయాన్ని అధ్యయనం చేయటానికి మన వద్ద ఎటువంటి నమూనాలు లేవు. ఉదాహరణకు మనకు ఎవరైనా గ్రహాంతర వాసి చిక్కాడనుకుందాం. అతనిపై పరిశోధనలు చేస్తే- ఈ విశ్వంలోని ఇతర ప్రాంతాల్లో జీవం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కానీ ఇప్పటి దాకా మన వద్ద అలాంటి నమూనాలేమీ లేవు. మనకు తెలిసినంత వరకూ జీవం ఉన్నది కేవలం భూమిపైనే. అయితే విశ్వంలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా జీవం ఉండే అవకాశముందనేది ఒక ప్రతిపాదన. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే అంతరిక్షంలోకి వెళ్లి పరిశోధనలు చేయటమే మార్గం. అయితే మనం ఊహించలేనంత పెద్దదైన అంతరిక్షంలో జీవం కోసం ఎక్కడ వెతుకుతాం? అలా వెతకటానికి కూడా మనకు కొన్ని సిద్ధాంతాలు అవసరమవుతాయి. అలాంటి ఒక సిద్ధాంతమే పెన్స్‌పెర్మియా. ఈ సిద్ధాంతాన్ని పుస్తకంలో సమగ్రంగా విశ్లేషించా’’ అంటారు మనస్వి. 


ఆ మూడు గ్రహాల నుంచే...

ప్రతి రోజు అంతరిక్షంలో కొన్ని కోట్ల గ్రహశకలాలు ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని ఒక గ్రహం నుంచి ప్రయాణించి వేరే గ్రహంపై పడుతూ ఉంటాయి. మన సౌర వ్యవస్థలో ఇది అతి సామాన్యమైన విషయమే. ఇలా గ్రహశకలాల ప్రయాణం గురించి చెప్పే సిద్ధాంతమే పెన్స్‌ఫెర్మియా. ‘‘మన సౌర వ్యవస్థను జాగ్రత్తగా గమనిస్తే- మార్స్‌, వీనస్‌ల నుంచి భూమిపైకి.. భూమికి సంబంధించిన శకలాలు ఈ రెండు గ్రహాలవైపు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మూడు గ్రహాలలో ఒక దానిలో జీవం ఆవిర్భవించి.. ఇతర గ్రహాలకు చేరిందా? అనేది ఒక ప్రశ్న’’ అంటారు మనస్వి. ఈ విషయాన్ని కనుగొనాలంటే ముందు మన వద్ద అత్యాధునిక అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లు ఈ దిశగా అనేక ప్రయోగాలు చేస్తున్నాయిప్పుడు. అమెరికా ఇప్పటికే పెర్సవెన్స్‌ అనే రోవర్‌ను మార్స్‌పైకి పంపింది. అక్కడ నుంచి వచ్చిన విలువైన సమాచారాన్ని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఖగోళ పరిశోధనలో ఇది కీలకం కానుంది. మార్స్‌లో జీవం మనటానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే అక్కడ జీవం ఉందా? లేక ఒకప్పుడు జీవం ఉండేదా? అనే ప్రశ్నలకు సమాధానాలను కనుగొనటానికి ప్రయత్నిస్తున్నారు. వీటితో పాటు విశ్వంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయటానికి అత్యాధునికమైన టెలిస్కోప్‌లు, గామా రే డిటెక్టర్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా కూడా అదనపు సమాచారాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ఈ ప్రయోగాలు చేస్తూనే.. భూమిపై జీవం ఎలా పుట్టిందనే విషయాన్ని కనుగొనటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ‘పాలియోన్‌టాలజీ’, ‘ఫిలో జెనిటిక్స్‌’ వంటి శాస్త్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. భూమిపై జీవం పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించటం మొదలు పెట్టినప్పుడు.. ఇప్పటి దాకా మనకు తెలియని మరిన్ని ఆసక్తికర కొత్త విషయాలు తెలిసే అవకాశముంది.


గ్రహాంతర జీవులు సంకేతాలు పంపుతున్నారా? 

ఖగోళ శాస్త్రంలో మనస్వి పరిశోధనల ప్రయాణం ఈనాటిది కాదు. కొన్నేళ్ల నుంచీ చేస్తూనే ఉన్నాడు. అలాంటిదే విశ్వగ్రహాల నుంచీ శబ్ద తరంగాలను గుర్తించడం. మీకు ‘పీకే’ సినిమా గుర్తుంది కదా! అందులో ఒక గ్రహాంతరవాసి భూమిపైకి వస్తాడు. కానీ అతనికి మన భాష తెలియదు. అతను మన మనస్సుల్లోని భావాలను ఎలా తెలుసుకుంటాడు..? మన భాషను ఎలా నేర్చుకుంటాడనే సీన్లను దర్శకుడు చాలా ఆసక్తికరంగా మలుస్తాడు. ఇలా గ్రహాంతర వాసులకు సంబంధించిన అనేక సినిమాలు హాలీవుడ్‌లో కూడా వచ్చాయి. అయితే ‘పీకే’లో చూపించిన మాదిరిగానే.. గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? ఉంటే వారు మనతో సంబంధాలు ఏర్పరచుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? అనే అంశంపై మనస్వి లింగం ఆసక్తికర పరిశోధనలు చేశారు. 2007లో పోర్టారికాలో ఉన్న అరిసిబో అబ్జర్వేటరీ, ఆస్ట్రేలియాలోని పార్క్స్‌ అబ్జర్వేటరీలలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అంతరిక్షం నుంచి కొన్ని వింత శబ్ద తరంగాలను శాస్త్రవేత్తలు రికార్డు చేయగలిగారు. అప్పట్లో ఇదొక అద్భుతం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ‘‘ఈ తరంగాలను ఫాస్ట్‌ రేడియో బరస్ట్స్‌ అంటారు. వీటి నిడివి మిల్లీ సెకన్లలో ఉంటుంది. అయితే శబ్దతరంగాలు మాత్రం చాలా శక్తిమంతంగా ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాన్ని ఇప్పటి దాకా మనం కనుగొనలేకపోయాం. బహుశా కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ప్రాంతాల నుంచి ఈ శబ్దాలు వెలువడ్డాయన్న విషయం మాత్రమే మనకు తెలుసు..’’ అంటూ ఆ పరిశోధన గురించి చెప్పుకొచ్చారు మనస్వి.  ఈ శబ్దతరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటే అంతరిక్షంలో జీవం ఉందా? లేదా అనే విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. అందుకే ఈ అంశానికి ఖగోళ శాస్త్రవేత్తలు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘‘ఇలాంటి శబ్దతరంగాలను పసిగట్టడానికి అత్యంత శక్తిమంతమైన రేడియో ట్రాన్స్‌మీటర్‌ అవసరమవుతుంది. దీనిని కాంతి కిరణాలతో ప్రయాణించే ఒక వ్యోమనౌకలో (లైట్‌ సైల్‌) ఉంచి అంతరిక్షంలోకి పంపించాలి. అప్పుడు ఆ ట్రాన్స్‌మీటర్‌ పంపే సంకేతాల ఆధారంగా మనకు మరికొన్ని విషయాలు తెలుస్తాయి’’ అని ట్రాన్స్‌మీటర్‌ను అంతరిక్షంలోకి పంపే పద్ధతిని కూడా మనస్వి వివరించారు. ఆయన కెరీర్‌లో ఇలాంటి అనేక పరిశోధనలు ఉన్నాయి. విశ్వంలో జీవుల అన్వేషణ కోసం సాగిస్తున్న ప్రయాణంలో ఒక తెలుగు ఆచార్యులు చేస్తున్న అంతర్జాతీయ పరిశోధన మనందరికీ గర్వకారణమే! భవిష్యత్తులో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విప్లవాత్మక పరిశోధనల్లో ఆయన ముద్ర కచ్చితంగా ఉంటుందని ఆశించవచ్చు. 


‘గ్రాండ్‌’ పేరెంట్స్‌ : అన్నామలై యూనివర్శిటీలో ఎమ్మెస్సీ జువాలజీ చేసిన అమ్మమ్మ లక్ష్మీకాంతమ్మ... బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంఏ గణితం చదివిన తాతయ్య నాగభూషణం...



అమెరికాలో అరుదైన గౌరవం..

ప్రపంచంలో ఏ మూలన మెరికల్లాంటి శాస్త్రవేత్తలున్నా అక్కున చేర్చుకునే గుణం అమెరికాది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వాళ్లను అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోదు. మేథోశక్తిని జాతి సంపదగా గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. అందుకే  పలు రంగాల మేథావులకు ప్రత్యేక వీసాలు మంజూరు చేసి... అమెరికాలోనే తగిన స్థానం కల్పిస్తుందా దేశం. అలా అందించే వీసా ‘ఓ1’. తెలుగు వాడైన మనస్వికి కూడా అమెరికాలో అలాంటి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఆగస్టు 20వ తేదీ నాటికి హెచ్‌1బీ  వీసా కాల వ్యవధి ముగుస్తుంది. దీనితో ఈసారి హెచ్‌1బీ కాకుండా అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఓ1’ను మంజూరు చేయడం విశేషం. ఇది మనస్వికి యూఎస్‌ఏ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం. 


- సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - 2021-07-18T16:49:02+05:30 IST