Abn logo
Sep 22 2021 @ 23:58PM

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయా?

చేపలను విడుదల చేస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఎల్లారెడ్డి, సెప్టెంబరు 22: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయా అని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఎల్లారెడ్డి పెద్దచెరువులో చేపపిల్లల విడుదల కార్యక్రమానికి వచ్చిన ఆయన ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి చేపపిల్లలను వదిలారు. అనంతరం వీకేవీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం వారికి ఉచిత చేపపిల్లలే కాకుండా చేపలు పెద్దగా అయిన తర్వాత చేపలను అమ్ముకోవడానికి వారికి వాహనాలు, ఆటోలు కూడా అందించిందని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 72 రిజర్వాయర్లు, 26 వేల చెరువులు ఉన్నాయని వాటిలో 100 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నామని తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా ట్రాక్టర్ల పథకాలతో పాటు వారు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల ఖాతాలో జమ చేస్తుందని అన్నారు. ఇంత మంచి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ లు అనవసర రాద్దాంతం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం వైపే ఉంటారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సురేందర్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని మత్స్యకారులు ఆర్థిక ఇబ్బందులతో ఉండేవారని ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషిచేస్తున్నార ని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటేశం, మత్స్యసంఘం అధ్యక్షుడు సాయిరాం, మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, జడ్పీటీసీలు ఉషాగౌడ్‌, మనోహర్‌రెడ్డి, రాజాగౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు నర్సి ంలు, సాయిలు, కౌన్సిలర్‌లు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.