వేతనాలు అందేనా?

ABN , First Publish Date - 2022-01-31T04:22:45+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు ఫిబ్రవరి నెలలో జీతాలు తీసుకొనే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగులు కన్నెర్ర చేసి రోడ్డెక్కారు. పాత పద్ధతిలోనే జీతాలివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వేతనాలు అందేనా?
జిల్లా ఖజానా శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు

చాలా మంది ఉద్యోగులకు వచ్చే నెలలో జీతం కష్టమే 

కొత్త పీఆర్సీ వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు

తీసుకునేందుకు ఉద్యోగులు ససేమిరా


ప్రభుత్వ ఉద్యోగులు ఫిబ్రవరి నెలలో జీతాలు తీసుకొనే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన నూతన పీఆర్సీ ఉత్తర్వులపై ఉద్యోగులు కన్నెర్ర చేసి రోడ్డెక్కారు. పాత పద్ధతిలోనే జీతాలివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పంతానికి పోయి కొత్త పీఆర్సీని అమలు చేయాలని భావిస్తోంది. జీతాల బిల్లులు పెట్టే ట్రెజరీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆదివారం పనిచేసేటట్టు ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ అందరి బిల్లులు తక్కువ వ్యవధిలో మంజూరయ్యే అవకాశం లేదు. కొన్ని విభాగాల ఉద్యోగులు, పింఛన్ల బిల్లులే అధికంగా పాస్‌ చేసినట్లు సమాచారం. 


గజపతినగరం, జనవరి 30:

వేతనాలను పాతపద్ధతిలో యథావిధిగా ఇవ్వాలంటూ ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీలతో ఇతర ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధపడ్డాయి. ఇంకో వైపు ప్రభుత్వం మొండివైఖరితో ముందుకెళ్తోంది. నూతన పీఆర్సీ ప్రకారమే వేతనాలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ ఖరాకండిగా ట్రెజరీ శాఖను ఆదేశించింది. కష్టమని ఆశాఖ ఉద్యోగులు అంటున్నారు. నిబంధనల ప్రకారం ఈ తంతు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. పాత పీఆర్సీ వేతనాలను సపోర్ట్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ను కూడా సర్కారు నిలిపివేసింది. ప్రభుత్వ తీరుతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెలా 20నుంచి 25వ తేదీవరకు ట్రెజరీలో బిల్లులు పెడితే 26నుంచి 30 లోపు ఆ బిల్లులను ఆమోదిస్తారు. కొత్త పీఆర్సీలో అనేక లింకులు పెట్టడంతో ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ముందుగా ఆయా శాఖలనుంచి ట్రెజరీ కార్యాలయాలకు ఉద్యోగుల డేటా పంపించాల్సి ఉంటుంది. ఆ డేటా వచ్చాక ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు పరిశీలించాలి. ఆ తరువాతే డ్రాయింగ్‌ అధికారి వేతనాల బిల్లులు ఆమోదించగలరు.

నెలలు పట్టే అవకాశం

ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లను పరిశీలించి బిల్లులు పెట్టాలంటే కనీసం ఐదారు నెలలు పట్టే అవకాశం ఉందంటున్నారు. ఉద్యోగుల డేటా వచ్చిన తరువాత ట్రెజరీ కార్యాలయాల్లో  సంబంధిత అధికారులు ఆ డేటాను, ఆ ఉద్యోగి సర్వీసు  రిజిస్టర్‌ను పరిశీలించి అనుమతించాలి. ఆ విధంగా జిల్లాలో 40వేలకు పైబడి ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు పరిశీలించాలి. ఒక్కో రిజిస్టరు పరిశీలించి నమోదు చేయాలంటే కనీసం 20 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఆ విధంగా అన్ని ట్రెజరీ  కార్యాలయాల్లో ఉన్న సిబ్బంది ఎంత కష్టపడి చేసినా రోజుకు 30నుంచి 40 రిజిస్టర్లకు మించి ఆమోదించలేరు. కొత్త పీఆర్సీతోనే ప్రభుత్వం వేతనాలు ఇవ్వాలని ట్రెజరీ శాఖ  మెడపై కత్తి పెట్టినట్లుగా ఆదేశించడంతో ట్రెజరీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

డేటా ఇవ్వని ఉద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగులు ట్రెజరీలకు డేటా పంపే విషయంలో సందిగ్ధం నెలకొంది. జిల్లాలో ట్రెజరీలతో పాటు సబ్‌ ట్రెజరీలకు ఉద్యోగులు తమ డేటాను శనివారం వరకు తీసుకురాలేదు. డేటా వచ్చాక ట్రెజరీ అధికారులు పరిశీలించాలంటే ఇప్పట్లో జరిగే పనికాదు. కొత్త పీఆర్సీ కింద వేతనాలు ఇవ్వడం దాదాపు గగనమే. 

ట్రెజరీ  ఉద్యోగుల్లో టెన్షన

ప్రభుత్వ ఆదేశాలతో ట్రెజరీ ఉద్యోగుల్లో మరింత ఆందోళన నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో డేటాద్వారా ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్లు పూర్తిగా పరిశీలించాకే బిల్లులు పెట్టుకొనేందుకు అవకాశం ఇవ్వాలని  పేర్కొంది. పరిశీలనకు గతం కంటే సమయం పడుతుంది. ట్రెజరీ ఉద్యోగులు ఆ ప్రకియ చేపట్టేందుకు  ససే మిరా అంటున్నారు. హడావుడిగా చేస్తే ఏదైనా పొరపాటు జరిగితే తమ ఉద్యోగాలకు ముప్పు వస్తుందని భయపడుతున్నారు. 

సెలవు రోజున పనిచేసిన ఖజానా శాఖ ఉద్యోగులు 

కలెక్టరేట్‌, జనవరి 30: కొత్త పీఆర్‌సీకి అనుగుణంగా జీతాల బిల్లులు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం సైతం విధులు నిర్వహించారు. ఈ మేరకు వారిపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో రోజంతా వారు బిల్లులపై కుస్తీ పట్టి కొన్నింటిని ఆనలైనలో నమోదు చేశారు. ఇదే సమయంలో ట్రెజరీకి బిల్లులు అందజేయాలని డీడీవోలపై ఉన్నతాధికారులు ఆదేశించారు. కానీ చాలా మంది స్పందించలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 మందికి పైగా డీడీవోలకు కలెక్టర్‌ మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

కొత్త పీఆర్‌సీపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఉద్యోగులు నాలుగు రోజుల నుంచి కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక దీక్షలు చేస్తున్నారు. పాత పీఆర్‌సీ ప్రకారం జీతాలు బిల్లులు పెట్టాలని ఉద్యోగులు డిమాండ్‌ చేయగా, నూతన పీఆర్‌సీ ప్రకారం జీతాల బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఖజానా శాఖ, పేఅండ్‌ అకౌంట్‌ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితిలో జిల్లా వ్యాప్తంగా చాలా మంది డీడీవోలు జీతాల బిల్లులు పెట్టడానికి ముందుకు రాలేదు. వారిలో కొంతమందికి కలెక్టర్‌ మెమోలు ఇచ్చినట్లు సమాచారం. జిల్లా ఖజానా డిప్యూటీ డైరెక్టర్‌ గణేష్‌ ఆధ్వర్యంలో కొంతమంది డీడీవోలు ఆదివారం కార్యాలయానికి వచ్చి బిల్లులు అందజేశారు. సుమారు 3300 మంది ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లుల డేటాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ ఉద్యోగుల్లో చాలా మంది పోలీసు శాఖకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 1191 మంది డీడీవోలు, సుమారు 21000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 14 వేల మంది నూతన పీఆర్‌సీ పరిధిలోకి వస్తారు. కాగా బిల్లులు ఇవ్వాలని డీడీవోలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి  ఉన్నా చాలా మంది ముందుకు రానట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జిల్లా ఖజానా శాఖ డీడీ గణేష్‌ వద్ద ప్రస్తావించగా జీతాల బిల్లులు పెట్టడం నిరంతరం జరుగుతున్న ప్రక్రియ అని, డీడీవోలు బిల్లులు పెట్టిన డేటాను సెంటర్‌ సర్వర్‌కు పంపిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3300 మంది ఉద్యోగులు జీతాల బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశామని, వీరిలో పోలీసు శాఖకు చెందిన బిల్లులు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. 


పెన్షనర్ల బిల్లులు మంజూరు

బొబ్బిలిరూరల్‌, జనవరి 30: బొబ్బిలి ఎస్‌టీవో కార్యాలయంలో సిబ్బంది ఆదివారం యథావిధిగా విధులు నిర్వహించారు. ఇన్‌చార్జి ఎస్‌టీవో కాపు శంకరరావు ఆధ్వర్యంలో సిబ్బంది పెన్షనర్లకు సంబంధించి 13 బిల్లులను మంజూరు చేశారు. బొబ్బిలి సబ్‌ ట్రెజరీ పరిధిలో 1827 మంది ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు. వారికోసం రూ.6,77,22,024 బిల్లులను పాస్‌ చేశామని, వీటిలో రూ.41,04,417 డిడక్షన్స్‌ ఉన్నాయని ఎస్‌టీవో శంకరరావు తెలిపారు. కొత్త పీఆర్‌సీ ప్రకారం వీటిని మంజూరు చేశామని ఆయన తెలిపారు. 


కలెక్టర్‌కు తహసీల్దార్ల లేఖలు

విజయనగరం, జనవరి 30: ఉద్యోగులంతా పాత పీఆర్‌సీనే కోరుకుంటున్నారంటూ కొందరు తహసీల్దార్లు తాజాగా కలెక్టర్‌కు విన్నవించారు. కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాల బిల్లులు ఇవ్వలేమంటూ తెలియజేశారు. కాగా కొత్త పీఆర్‌సీ ద్వారా జీతాలు చెల్లించాలన్న ప్రభుత్వ ఆదేశంపై కలెక్టర్‌ సూర్యకుమారి జిల్లాలోని డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ అఫీసర్ల(డీడీవో)కు ఈనెల 28న ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కానీ కొత్త పీఆర్‌సీ జీవోల ప్రకారం జీతాల బిల్లులు చేయలేమని అనేక మంది డీడీవోలు కలెక్టర్‌కు లేఖలు రాసినట్లు సమాచారం. ఇందులో ఇతర ఉద్యోగులు సైతం ఉన్నారు. దీనిపై కలెక్టర్‌ కూడా ఘాటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. బిల్లులు పెట్టని డీడీవోలకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం.




Updated Date - 2022-01-31T04:22:45+05:30 IST