ప్రభుత్వాలు ఉన్నాయా?

ABN , First Publish Date - 2020-07-21T06:20:49+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నది. ఒకేరోజు నాలుగు వేల కేసులు రావడం, 50 మందికి పైగా చనిపోవడం ఆనవాయితీగా మారేట్టు కనిపిస్తున్నది...

ప్రభుత్వాలు ఉన్నాయా?

తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తున్నది. ఒకేరోజు నాలుగు వేల కేసులు రావడం, 50 మందికి పైగా చనిపోవడం ఆనవాయితీగా మారేట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో సాపేక్షంగా పరిస్థితి మెరుగుగా ఉన్నది కానీ, భీతావహ పరిస్థితి కొనసాగుతూనే ఉన్నది. రెండు రాష్ట్రాలలోనూ, మరణాల నివారణలో ప్రభుత్వాలు క్రియాశీలంగా చేస్తున్న కృషి ఏమీ కనిపించడం లేదు. ఒక రాష్ట్రంలో కొన్ని, మరో రాష్ట్రంలో మరికొన్ని మంచి పద్ధతులు కనిపిస్తున్నప్పటికీ, ఒకరినుంచి ఒకరు నేర్చుకోవడం అన్నది లేదు. ప్రభుత్వాలు పరిస్థితిని గాలికి వదిలేసి కూర్చోకపోతే, ప్రజలలో విశ్వాసాన్ని కల్పించడం సాధ్యమే. పారదర్శకమైన సమాచారం, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను యుద్ధ ప్రాతిపదిక మీద మెరుగుపరచడం, ప్రైవేటు ఆస్పత్రుల మీద ప్రభుత్వ నియంత్రణ– ఈ మూడు చర్యలు తీసుకొనగలిగితే, వాతావరణంలో ఇంత భయాందోళనలు, విషాదం నెలకొనేవి కావు. 


ఆదిలో ఎంతో ఆదర్శంగా కనిపించిన తెలంగాణ ప్రభుత్వం, లాక్‌డౌన్‌ సడలించే సమయం వచ్చే నాటికి, చేతులెత్తేసినట్టు కనిపించసాగింది. తగినన్ని పరీక్షలు చేయకపోవడం, పరీక్షా కేంద్రాలను పెంచకపోవడం, ప్రైవేటు చికిత్సను అనుమతించకపోవడం–మొదట సమస్యలుగా ఉండేవి. తమకు వ్యాధి సోకిందేమోనన్న అనుమానం ఉన్నవారికి వెంటనే స్పందన దొరకకపోవడం, వ్యాధి నిర్ధారణ కానివారికి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రవేశం ఇవ్వకపోవడం, ప్రైవేటులో అందుకు ఆస్కారం లేకపోవడం– ఈ కారణాల వల్ల పై సమస్యల గురించిన ఆందోళన ప్రజలలో ఉండేది. ఇప్పుడు, పరీక్షల సంఖ్య పెంచారు. పరీక్షాకేంద్రాల సంఖ్యను కూడా పెంచారు. ప్రైవేటు చికిత్సను అనుమతిస్తున్నారు. అయినా, పరిస్థితి మెరుగుపడలేదు. పరీక్షల సంఖ్యను పెంచేనాటికి, వ్యాప్తి విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికీ రోజువారీగా జరుపుతున్న 15వేల పై చిలుకు పరీక్షలు, వాస్తవ స్థితిని ప్రతిబింబిస్తున్నాయా అన్నది అనుమానమే. పైగా, పరీక్షలు జరపడం వల్ల వ్యాధి వ్యాప్తి తగ్గదు. ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి ఇవ్వడం ఆస్పత్రుల వ్యాపారానికి ఉపయోగపడినంతగా రోగులకు ఉపయోగపడడం లేదు. రోగలక్షణాలకు తప్ప రోగానికి చికిత్స లేని కొవిడ్‌–19 చికిత్సకు లక్షలాది రూపాయల బిల్లు ఎందుకు అవుతుందో అడిగేవారు లేరు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్కో రోగికి అవుతున్న ఖర్చును ప్రాతిపదికగా తీసుకుని ఫీజులు నిర్ణయించి, కఠినంగా అమలు చేయవలసిన ప్రభుత్వం చేతులు ముడుచుకు కూర్చున్నది. చిన్న నిరసన ప్రదర్శన జరిపితే, కొంచెం ఎక్కువ సేపు దుకాణాలు తెరచిపెడితే– సాంక్రమిక వ్యాధుల చట్టం ప్రకారం తీవ్రమైన కేసులు పెడుతున్న ప్రభుత్వాలు, ఒక్క వ్యాపార ఆస్పత్రి మీద కూడా ఇంత వరకు కేసు పెట్టలేదు. స్పెయిన్‌ వంటి దేశాల్లో, ప్రైవేటు ఆస్పత్రులనన్నిటినీ ప్రభుత్వాలు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ విషయంలో మెరుగుగా ఉన్నది. ప్రైవేటు వైద్యసంస్థలను ఎంతో కొంత అదుపు చేస్తున్నది. అత్యవసర సమయంలో వచ్చిన పేషెంటును తిరస్కరించడానికి వీలులేదు. వైద్యుల ప్రవర్తనా నియమావళి కూడా అందుకు అంగీకరించదు. ఆ అస్పత్రిలో పడకలు లభ్యం కాకున్నా, అత్యవసర విభాగంలో తాత్కాలిక చికిత్స చేసి, పడకలు అందుబాటులో ఉన్న ఆస్పత్రికి పేషెంటును పంపాలి. ప్రైవేటు ఆస్పత్రుల మీద భ్రమతో, ప్రాణభయంతో వెడుతున్న పేషెంట్లకు తగిన ఆశ్వాసన ఇచ్చే వ్యవస్థ ఉండాలి. అత్యవసర సమయాల్లో వ్యవహరించవలసిన తీరు గురించి ప్రచారం ముమ్మరంగా జరగాలి. ఉభయ రాష్ట్రాల్లో ఈ అంశాల్లో అలక్ష్యమే కనిపిస్తున్నది. కరోనా నిరోధానికి ముఖానికి ముసుగులు ధరించడం తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆలస్యంగానైనా నిబంధన విధించి, అమలుచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ముసుగులు ధరించనివారికి వెయ్యి జరిమానా అని ఎప్పుడో ప్రకటించినా, ఆచరణ మాత్రం శూన్యం. ఎటువంటి కట్టడులూ లేవు. బహిరంగ ప్రదేశాల్లో అయినా భౌతికదూరాన్ని పాటింపజేయడానికి ఎటువంటి యంత్రాంగమూ లేదు. ఈ ప్రభుత్వాలకు ప్రాణాలంటే నిజంగా పట్టింపు ఉన్నదా? 


కొన్ని ముఖ్య నగరాల్లో సరే, జిల్లా కేంద్రాలలోని ఆస్పత్రులలో పరిస్థితీ ఆశాజనకంగా లేదు. ఆ కేంద్రాల్లో ప్రాథమిక వసతుల కొరత. ఆక్సిజన్‌ ఉండదు. ఐసియు పడకలు తక్కువ. వెంటిలేటర్లు ఇంకా తక్కువ. అన్నిటికి మించి, వైద్య అధికారులకు, సిబ్బందికి ఈ నూతన పరిస్థితికి తగ్గ శిక్షణ ఉండదు. తెలంగాణ హైకోర్టు సూచించినట్టు కౌన్సెలింగ్‌ అవసరమైతే, దాన్ని కూడా అందించాలి. కరోనా విపత్తు నిర్వహణలో ఆరితేరిన అనుభవజ్ఞులు ఎవరూ లేరు. అందరూ నేర్చుకొనవలసిందే, నేర్చుకొన్నది ఇతరులకు పంచవలసిందే. ఒక వైద్యుల స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యుల అనుభవాన్ని, సమాచారాన్ని తమతో పంచుకోవలసిందిగా కోరింది. పశ్చిమ దేశాల్లో అనేక ప్రముఖ కొవిడ్‌ ఆస్పత్రులు వైద్యసేవలు అందించడంతోపాటు, రోగుల సమాచారాన్ని, మృతుల ప్రత్యేక వివరాలను క్రోడీకరించి, తమ పరిశీలనలను ప్రపంచంతో పంచుకుంటున్నాయి. భారతదేశంలో ఈ పని ఎన్ని ఆస్పత్రులు చేస్తున్నాయో సందేహమే.


సరే, లాక్‌డౌన్‌ మళ్లీ విధించడం మంచిది కాదు, ఆర్థికానికి నష్టం అనుకుని ప్రభుత్వాలు సందేహిస్తూ ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక లాక్‌డౌన్‌ మాత్రం విధిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏ మాటా మాట్లాడదు. పూర్తి లాక్‌డౌన్‌ కాకపోయినా, వారంతపు లాక్‌డౌన్‌, కొన్ని ప్రత్యేక రంగాల లాక్‌డౌన్‌, నగరాన్ని జిల్లాలను వేరుచేసే లాక్‌డౌన్‌– వంటి అనేక పద్ధతులను ఆలోచించవచ్చు. వాళ్లు ఆలోచించరు, ప్రతిపక్షాలూ సూచించవు. 


ఆయుధాలు కిందపడేసి, నిర్వ్యాపకంగా ఉంటే ఏమి జరుగుతుందో ఆంధ్రప్రదేశ్‌లో చూశాము. గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలకు విస్తరిస్తే విపత్తు ఎంత తీవ్రంగా ఉంటుందో అది ఒక నమూనా మాత్రమే. హైదరాబాద్‌ పరిధిలో కొంత తగ్గుదల కనిపిస్తున్నది కానీ, గ్రామీణ ప్రాంతాలలో పెరుగుదల ఉన్నదంటున్నారు. అదే క్రమం కొనసాగితే, త్వరలోనే ఆంధ్ర పరిస్థితే తెలంగాణలోనూ తప్పదు. మేలుకొనాలి. కనీసం ప్రతిపక్షాలు, ప్రజలు, పౌరసమాజం ప్రభుత్వాన్ని మేల్కొల్పాలి. 

Updated Date - 2020-07-21T06:20:49+05:30 IST