Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 14 Jan 2022 02:53:22 IST

ఉచిత ఎరువులేవి?

twitter-iconwatsapp-iconfb-icon
ఉచిత ఎరువులేవి?

  • ఐదేళ్ల క్రితం నాటి హామీ ఏమైంది?
  • మాట తప్పినందుకు క్షమాపణలు చెప్పు
  • సిగ్గు లేకుండా ప్రధానికి లేఖ రాస్తారా?
  • రైతుబంధు పేరుతో రాయితీలన్నీ ఎత్తేశారు
  • ఉగాదిలోగా ఉచిత ఎరువులు, లక్ష రుణమాఫీ
  • అమలు చేయకపోతే మహోద్యమం తప్పదు
  • వ్యవసాయ మీటర్లపైనా దుష్ప్రచారమే
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ


హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు ఎరువులను ఉచితంగా ఇస్తామంటూ 2017లో హామీ ఇచ్చిన కేసీఆర్‌.. ఐదేళ్లయినా దాన్ని అమలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. మాట తప్పినందుకు క్షమాపణలు అడిగి తలదించుకోవాలన్నారు. కానీ, సిగ్గు లేకుండా ఎరువుల ధరలపై ప్రధానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు ఎరువుల కోసం రైతులు క్యూల్లో నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తుచేశారు. మోదీ సర్కారు వచ్చాక రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు అందుతున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. రైతుబంధు ఒక్కటి ఇచ్చి ఇతర రాయితీలన్నీ ఎత్తేసిన కేసీఆర్‌.. రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జీవో 317 నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలతో ప్రధానమంత్రికి లేఖ రాశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కన్నీళ్లతో చకినాల పిండి తడుపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని సంజయ్‌ విమర్శించారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాల్సిన రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు రోదిస్తున్నాయని చెప్పారు. 


ఈ మేరకు సంజయ్‌ గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతులకు ఉచితంగా ఎరువులు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రూ.లక్ష రుణమాఫీని ఉగాదిలోగా అమలు చేయాలని కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. లేకుంటే మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. డిస్కమ్‌లను అప్పుల్లో ముంచిన సీఎం.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో గత మూడేళ్లలో ఒక్క రైతు  మోటారుకు మీటరు బిగించినట్లు నిరూపించగలరా? నిరూపించకపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా?’’ అని సంజయ్‌ సవాల్‌ చేశారు. ‘‘ఎరువుల సబ్సిడీ పేరిట తెలంగాణ రాష్ట్రానికి ఏడేళ్లలో కేంద్రం వేల కోట్లు ఖర్చు చేసింది నిజం కాదా? మీరు చేసిందేమిటి?’’ అని నిలదీశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరకుల కొరత వల్ల ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగినా వీటిని కేంద్రం పాత ధరలకే సరఫరా చేస్తోందని గుర్తుచేశారు. 2014తో పోలిస్తే ప్రస్తుతం వరి, గోధుమలు సహా 23 రకాల పంటలకు ఇస్తున్న కనీస మద్దతు ధర 50-100 శాతం పెరిగిందని వివరించారు. పొరుగు రాష్ట్రాలు రైతులకు బోనస్‌ పేరిట క్వింటాకు రూ.200-600 వరకు చెల్లిస్తుండగా.. తెలంగాణలో నయాపైసా ఇవ్వడం లేదన్నారు. 


ఒక్క సిఫారసూ చేయలేదే..?

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానించేందుకు కేంద్రం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో కమిటీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క సిఫారసూ ఎందుకు చేయలేదని సంజయ్‌ నిలదీశారు. ‘‘పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుపై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదు. కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది. 19 రాష్ట్రాలూ పన్నులు తగ్గించాయి. తెలంగాణలో మాత్రం పైసా కూడా తగ్గించలేదు. పంటలకు ఎమ్మెస్పీ ఎలా నిర్ణయిస్తారో తెలియని అజ్ఞాని సీఎం. రైతుబంధు ఒక్కటిచ్చి మిగతా సబ్సిడీలను ఎత్తేసింది నిజం కాదా?’’ అని సంజయ్‌విమర్శించారు. ఏడేళ్లుగా పంట బీమాను అమలు చేయలేదన్నారు. రైతుల పాలిట రాబందుగా మారిన కేసీఆర్‌ రైతుబంధునంటూ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ‘‘మీరు నిజంగా రైతుబంధే అయితే అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఎందుకుంది? రూ.10 వేల కోట్ల రైతుబంధు నిధులు ఇస్తున్నట్లు చెప్పుకొంటున్న మీరు.. ఊరూరా బెల్ట్‌షాపులు తెరిచి ఏటా రూ.30 వేల కోట్లు దండుకోవడం లేదా?’’ అని ప్రశ్నించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.