Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 15 2022 @ 03:21AM

కరోనా ఆంక్షలేవీ..?

  • మేడారానికి జాతరకు ముందే లక్షలాదిగా వస్తున్న భక్తులు
  • ప్రత్యేక వారాల్లో గద్దెల వద్ద జనం కిట కిట
  • కానరాని భౌతికదూరం.. సగం మందికే మాస్కులు


ములుగు, జనవరి 14: కోట్ల మంది భక్తుల విశ్వాసానికి నిలువుటద్దం మేడారం. గుడి గోపురం, దేవుని విగ్రహంలేని ఈ ఆధ్యాత్మిక క్షేత్రం మహా జాతరకు ముందే జనసంద్రంగా మారుతోంది. అయితే మేడారానికి లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం.. సగం మంది మాస్కులు కూడా ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో కరోనా నిబంధనలను ఖాతరు చేయకపోవడం ఎటువంటి విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందోననే టెన్షన్‌ నెలకొంది. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నాలుగు రోజులపాటు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లను మంజూరు చేయగా, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా భక్తులు ముందస్తు మొక్కులకు తరలివస్తున్నారు. ఆది, సోమ, బుధ, శనివారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఆదివారం సుమారు లక్ష మంది వనదేవతలను దర్శించుకున్నారు. 


ఈ క్రమంలో భౌతిక దూరం ఎవ్వరూ పాటించడంలేదు. సగం మంది మాస్కులు ధరించడం లేదు. గద్దెల ఆవరణ భక్తులతో కిటకిటలాడుతోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పిస్తున్నారు. దీంతో అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. ఇక, కరోనా కట్టడి కోసం కృషిచేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మేడారంలో మాత్రం ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. బుధ, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ రోజుల్లో మాత్రమే అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల ప్రధాన ద్వారం వద్ద వైద్య సిబ్బంది భక్తులకు సూచనలు చేయడానికే పరిమితమవుతున్నారు. ప్రతిసారి మహా జాతరలో పది రోజుల ముందు నుంచి తాత్కాలిక వైద్యశాలను ఏర్పాటు చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందే క్యాంపును నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


కొవిడ్‌ నిబంధనల అమలు సాధ్యమేనా..?

మేడారానికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిసా, చత్తీ్‌సగఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. వీరిలో చాలా మంది రెండు మూడు రోజులు ఇక్కడే బస చేస్తారు. అయితే, ఇప్పుడు వందలు, వేలల్లో వస్తున్న వారు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడటం కష్టమవుతుండగా.. కోటి మంది వచ్చే మహాజాతరను కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ నిర్వహించడం సాధ్యమవుతుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

లక్షణాలుంటే జాతరకు రావొద్దు

జలుబు, దగ్గు లక్షణాలు స్వల్పంగా ఉన్నా మేడారం జాతరకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చిన వారు భౌతికదూరం పాటిస్తూ మాస్కు కచ్చితంగా ధరించాలి. మేడారం, సమీప గ్రామాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు వచ్చినా ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. ఇప్పటి వరకైతే ఇక్కడ కేసులు లేవు. సంక్రాంతి తర్వాత మేడారంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జాతర వరకు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

- డాక్టర్‌ అల్లెం అప్పయ్య, ములుగు డీఎంహెచ్‌వో

Advertisement
Advertisement