రాజ్ బబ్బర్ ట్వీట్లు కాంగ్రెస్‌కు రాజీనామా సంకేతాలా?

ABN , First Publish Date - 2022-01-28T19:37:29+05:30 IST

బాలీవుడ్ స్టార్, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ సమాజ్‌వాదీ పార్టీ

రాజ్ బబ్బర్ ట్వీట్లు కాంగ్రెస్‌కు రాజీనామా సంకేతాలా?

న్యూఢిల్లీ : బాలీవుడ్ స్టార్, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ సమాజ్‌వాదీ పార్టీ వైపు చూస్తున్నారని, ఇప్పటికే అఖిలేశ్ యాదవ్‌తో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల ఇస్తున్న ట్వీట్లు ఆయన కాంగ్రెస్‌ను వీడుతారనే అంచనాలను మరింత బలపరుస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడంతో ఆ పార్టీ సీనియర్ నేతలు వ్యంగ్యాస్త్రాలను సంధించగా, రాజ్ బబ్బర్ మాత్రం ఆజాద్‌ను అభినందించారు. తన స్పందనపై వచ్చిన విమర్శలకు ఘాటుగా జవాబిస్తూ మరొక ట్వీట్ చేశారు. దీంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి, సమాజ్‌వాదీ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు పుంజుకున్నాయి. 


కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన తర్వాత రాజ్ బబ్బర్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ఆజాద్‌ను అభినందించారు. ‘‘గులాం నబీ ఆజాద్ గారూ, మీకు అభినందనలు. మీరు ఓ పెద్దన్నయ్య వంటివారు. మీ నిష్కళంక ప్రజా జీవితం, గాంధేయ ఆదర్శాల పట్ల మీ నిబద్ధత ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. ఐదు దశాబ్దాలపాటు దేశానికి మీరు అత్యంత శ్రద్దాసక్తులతో చేసిన సేవకు గొప్ప గుర్తింపు పద్మభూషణ్’’ అని పేర్కొన్నారు. 


గులాం నబీ ఆజాద్‌ను అభినందించడంతో రాజ్ బబ్బర్‌పై కొందరు విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలపై రాజ్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రతిపక్ష నేత సాధించిన విజయాలను గౌరవించినపుడు పురస్కారం మరింత అర్థవంతమైనదవుతుందని తెలిపారు. తన సొంత పార్టీ నేతల కోసం ఎవరైనా ఇలా చేయవచ్చునన్నారు. పద్మ భూషణ్‌పై వివాదం అనవసరమైనదని భావిస్తున్నట్లు తెలిపారు. 


రాజ్ బబ్బర్ 1980వ దశకంలో జనతా దళ్‌లో చేరారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరి, 1999, 2004 లోక్ సభ ఎన్నికల్లో ఆగ్రా నుంచి గెలిచారు. 2006లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. రెండేళ్ళ విరామం తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్‌గా ఉన్నారు. 


Updated Date - 2022-01-28T19:37:29+05:30 IST