రేసుగుర్రాలు ఖరారు?

ABN , First Publish Date - 2022-08-11T07:57:00+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

రేసుగుర్రాలు  ఖరారు?

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అసంతృప్తులు మొదలు

మునుగోడు అభ్యర్థుల ఎంపిక తుది దశకు!

కూసుకుంట్ల వైపే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం చూపు 

ప్రభాకర్‌రెడ్డి వద్దంటున్న స్థానిక ప్రజాప్రతినిధులు 

అసంతృప్త నేతలకు మంత్రి జగదీశ్‌రెడ్డి బుజ్జగింపు

చల్లమల్ల కృష్ణారెడ్డిని దించేందుకే కాంగ్రెస్‌ మొగ్గు 

రాజగోపాల్‌రెడ్డిని ఆర్థికంగా ఎదుర్కోవాలంటే.. కృష్ణారెడ్డే సమర్థుడన్న అభిప్రాయంలో నాయకత్వం

సమన్వయ కమిటీలు, అభిప్రాయ సేకరణ పేరిట ఆశావహులను అంగీకరింపజేసే ప్రయత్నాలు

ఇప్పటికే ఏర్పాట్లలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి 


హైదరాబాద్‌/నల్లగొండ, ఆగస్టు 10, (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా అభ్యర్థుల పేర్లను ఆయా పార్టీలు ప్రకటించకపోయినా.. అనధికారికంగా సంకేతాలిచ్చాయి. అయితే ఇలా సంకేతాలు రావడంతోనే ఆశావహుల్లో అసంతృప్తి మొదలైంది. అటు అధికార టీఆర్‌ఎస్‌లో, ఇటు కాంగ్రె్‌సలోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డే మరోసారి బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ప్రభాకర్‌రెడ్డికే టికెట్‌ ఇవ్వనున్నట్లు, ఆ పార్టీ అంతర్గతంగా కొంద రు కీలక నేతలకు తెలిపింది.  అయితే ప్రభాకర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో వ్యతిరేకిస్తున్నారు. 


ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దంటూ అధిష్ఠానానికి ముందుగానే లేఖ రాశారు. అయినా ఆయననే అభ్యర్థిగా ఖరారు చేస్తున్నట్లు సంకేతాలు రావడంతో నేతల్లో అసంతృప్తి పెల్లుబికింది. దీంతో నల్లగొండ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి.. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఆ నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు తదితర నేతలతో మంత్రుల క్వార్టర్స్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. అందరితోనూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వారందరినీ తీసుకుని ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడున్న నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి తదితరులతో కలిసి మళ్లీ చర్చలు జరిపారు. చివరకు అంతా కలిసి పనిచేయాలని, ఈ విజయం కీలకమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లేనని తెలిసింది.


అయితే ఈ సంకేతాలు రావడంతోనే ఆశావహుల్లో ఒకరైన పాల్వాయి స్రవంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆర్థిక బలం చూసే టికెట్‌ ఇస్తే మునుగోడులోనూ హుజూరాబాద్‌ ఫలితమే పునరావృతమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే టికెట్‌ ఆశిస్తున్న వారందరితోనూ మాట్లాడి సమన్వయం చేసే ప్రయత్నంలో టీపీసీసీ నేతలు ఉన్నారు. ఈ మేరకు బుధవారం గాంధీభవన్‌లో వారితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు సమావేశం నిర్వహించారు. ఇక బీజేపీ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వంపై ముందునుంచీ స్పష్టత ఉంది. ఆయన రాజీనామాతోనే ఉప ఎన్నిక రాగా, ప్రచారం కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు  చేసుకుంటున్నారు. ఈ నెల 21న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యే బహిరంగ సభతో రాజగోపాల్‌రెడ్డి ప్రచారపర్వం ప్రారంభం కానుంది. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 16 నుంచి మండలాల సమన్వయ కమిటీలతో భేటీ రూపంలో నియోజకవర్గంలో పర్యటనలు ప్రారంభించనున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు మునుగోడు నియోజకవర్గంలో పర్యటించి వ్యవహారాలను చక్కబెడుతున్నారు. సీఎం కేసీఆర్‌ మాత్రం ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే సమయాన్ని బట్టి ప్రచార పర్వంలోకి దిగనున్నారు. 


ఆర్థికబలమే అదనపు అర్హత!

ఉప ఎన్నిక కావడం, అదికూడా సాధారణ ఎన్నికల నాటికి ఉండబోయే రాజకీయ పరిణామాలను నిర్దేశించేది కావడంతో.. ఎంత కాదన్నా, ఎవరు వద్దన్నా అభ్యర్థుల ఎంపికలో చివరకు ఆర్థికబలం కూడా అదనపు అర్హతగా చేరిపోయింది. టీఆర్‌ఎ్‌సలో ఆర్థిక అంశం పెద్ద విషయం కాకపోయినా, అధికారంలో ఉన్న పార్టీగా నిధులకు కొరత ఉండే అవకాశం ఏమాత్రం లేకపోయినా.. ఉన్నవారిలో ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థినే ఎంపికచేశారన్న వాదన ఉంది. రేసులో ఉన్న మరో నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి శాసనమండలి చైర్మన్‌గా ఉన్నందున ఆయనను  ఉప ఎన్నిక బరిలోకి దించే ఆలోచనను అధినాయకత్వం చేయలేదని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రె్‌సలోనూ ఆర్థిక బలమే ప్రాతిపదికగా అభ్యర్థి ఎంపిక జరుగుతుందని స్పష్టమవుతోంది. టికెట్‌ కోసం పోటీపడుతున్న నేతల్లో ఆర్థికంగా అందరికంటే బలంగా ఉన్నది చల్లమల్ల కృష్ణారెడ్డే. ఇదొక్కటే ఆయన ఎంపికకు కారణం కాకపోయినా.. ఇదో అదనపు అర్హత కిందే పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ శిబిరంలో చేరిపోయిన రాజగోపాల్‌రెడ్డి కాంగ్రె్‌సను ఖాళీ చేసే పనిలో భాగంగా మండలాల వారీగా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి భరోసా ఇస్తున్నారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 90 శాతం మంది నేతలు హాజరవుతున్నారు. వారికి భరోసా ఇచ్చి క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలంటే డబ్బు అంశమే ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న ముగ్గురిని ఎంత త్వరగా ఒప్పించి అంత త్వరగా పనిలో పడాలని కాంగ్రెస్‌ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే కృష్ణారెడ్డి పేరును ఖరారు చేయాలని అనుకున్నా మిగిలిన ఆశావహులు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందన్న సమాచారంతో పీసీసీ నేతలు వేచి చూస్తున్నారు. ఒకేసారి అభ్యర్థి పేరు ప్రకటించకుండా సమావేశాలు, మండలాల్లో అభిప్రాయ సేకరణ పేరుతో కొంత ప్రశాంత వాతావరణం నెలకొల్పి నెలాఖరుకు కృష్ణారెడ్డి పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. 

Updated Date - 2022-08-11T07:57:00+05:30 IST