పేదల ప్రాణాలు విలువైనవి కావా?

ABN , First Publish Date - 2020-04-28T05:53:31+05:30 IST

భౌతిక దూరం పాటించడానికి వీలులేని శారీరక శ్రమ పనులను కరోనా ఉపద్రవ కాలంలో ప్రారంభించడంలో ప్రభుత్వ ఉద్దేశమేమిటి? మొగిలియ్య (సంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామీణ సామాజిక నిర్వాహకుడు) ఆందోళన ఉత్పన్నం చేసిన ప్రశ్న అది....

పేదల ప్రాణాలు విలువైనవి కావా?

భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించేలా చేయడమే కరోనా వైరస్ నిరోధక లాక్‌డౌన్ లక్ష్యం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులు సమష్టిగా చేయవలసినవి. పనుల నిర్వహణలో బృందాలుగా వ్యవహరించే శ్రామికుల మధ్య భౌతిక దూరానికి ఏ మాత్రం ఆస్కారం లేని పనులవి. మరి ఈ పనులు చేసేవారిలో అత్యధికులు దళిత, ఆదివాసీ వర్గాల వారు, అందునా మహిళలు కావడం గమనార్హం. వర్గ, కుల, జెండర్ ప్రాతిపదికన జీవితాలకు విలువనివ్వడానికే భారత రాజ్య వ్యవస్థ ప్రాధాన్యతనిస్తున్నదా ఏమిటి?


భౌతిక దూరం పాటించడానికి వీలులేని శారీరక శ్రమ పనులను కరోనా ఉపద్రవ కాలంలో ప్రారంభించడంలో ప్రభుత్వ ఉద్దేశమేమిటి? మొగిలియ్య (సంగారెడ్డి జిల్లాలో ఒక గ్రామీణ సామాజిక నిర్వాహకుడు) ఆందోళన ఉత్పన్నం చేసిన ప్రశ్న అది. ఏప్రిల్ 15న అతడు మా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: ‘‘మా గ్రామంలో ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ చట్టం’ (క్లుప్తంగా ‘గ్రామీణ ఉపాధి హామీ’) పనులను ప్రారంభించారు. మా వాళ్ళందరూ ఆ పనులకు వెళ్ళుతున్నారు. పనిచేసే సమయంలో భౌతిక దూరాన్ని పాటించేందుకు ఎలాంటి ఆస్కారం లేదు. ఐదుగురు చొప్పున ఉండే బృందాలుగా ఏర్పడి పనులు చేయాలని గ్రామ కార్యదర్శి మాకు చెప్పాడు. చేయవలసింది ఊరి చెరువులో పూడికలు తీసివేసే పనులు. ఇందుకు పక్కపక్కనే వుండి పనిచేయవలసిరావడం వల్ల కూలీల కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం మెండుగా ఉన్నది. మమ్ములను ఇలా పనిచేయిస్తున్నారు సరే, మరి ఇది లాక్‌డౌన్ లక్ష్యానికి అనుగుణంగా వున్నదా? భౌతిక దూరాన్ని పాటిస్తూ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద చేపట్టే పనులు వేటినీ చేయడం సాధ్యం కానే కాదు. ఈ ఉపాధి హామీ పనులు చేస్తున్నవారిలో అత్యధికులు దళితులే’’. మొగిలయ్య తన ఆవేదనకు ఇలా ముక్తాయింపు నిచ్చాడు: ‘‘మా జీవితాలకు విలువేమీ లేదా?’’


గ్రామాలలో ఉపాధి హమీ పనులు ప్రారంభమయినట్టు ఏప్రిల్ 20న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పలు జిల్లాల నుంచి వార్తలు వెలువడ్డాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నంతవరకు ఉపాధి హామీ పనులను నిలిపివేయాలని అభ్యర్థిస్తూ మండల అభివృద్ధి అధికారి, జిల్లాకలెక్టర్‌కు పెద్ద గొట్టిముకుల (మెదక్ జిల్లా) లాంటి పలు గ్రామపంచాయత్‌లు లేఖలు రాశాయి. ఉపాధి హామీ కూలీలు ఆ పనులు చేసే క్రమంలో కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఎంతైనా ఉన్నదని ఆ లేఖలు ఆందోళన వ్యక్తం చేశాయి. గ్రామీణ ఉపాధి హామీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం గనుక తాము చేయగలిగేది ఏమీ లేదన్నది స్థానిక అధికారుల ప్రతిస్పందన. గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాన్ని కంటైన్‌మెంటేతర ప్రదేశాలన్నిటిలోనూ అమలుపరిచితీరాలి. ఈ కార్యక్రమం అమలు గ్రామాలకే అన్ని విధాల శ్రేయస్కరమని ఆ అధికారులు అన్నారు.


కామారెడ్డి జిల్లాలోని గ్రామాలలో ఉపాధి హామీ పనులు 2020 మార్చి తొలినాళ్ళలోనే ప్రారంభమయ్యాయి. అయితే లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు నిలిపివేసి, ఏప్రిల్ 20న పునః ప్రారంభించారు. నల్లమల ప్రాంత చెంచు ఆదివాసీల నుంచి తీవ్ర వ్యాకులత కలిగిస్తున్న వార్తలు వస్తున్నాయి. అక్కడ మార్చి 15న ప్రారంభించిన ఉపాధి హామీ పనులను లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత కూడా నిలిపివేయలేదు. కొన్ని పెంట (గ్రామాలు)లలో ఈ పనుల కింద రాతి గోడల నిర్మాణం జరుగుతోంది. మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే ఇరవై మంది చొప్పున ఉన్న బృందాలతో ఆ పనులు చేయిస్తున్నారు. ప్రతి బృందంలోనూ విభిన్న కుటుంబాలకు చెందిన మహిళలు ఒక జట్టుగా పనిచేయవలసివుంటుంది. ఇంతమందిని ఒక బృందంగా పని చేయించడం సమంజసమేనా? కొవిడ్ 19 మహమ్మారి సంభావ్య వ్యాప్తిని నిరోధించేందుకు విభిన్న కుటుంబాల మధ్య భౌతిక దూరం ఉండితీరాలన్న లక్ష్యాన్ని ఆ సామూహిక శ్రమ నిష్ఫలం చేయడం లేదూ? మన దేశంలో ఇప్పుడు మనుగడ ముప్పులో కొట్టుమిట్టాడుతున్న పివిటిజి (పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్) తెగలలో చెంచు ఆదివాసీలు కూడా వున్నారన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు.


ప్రస్తుతం తెలంగాణ గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హమీ పనులలో భాగంగా చెరువులలో పూడికలను పెద్ద ఎత్తున తీసివేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పక్క పొదలు, తుప్పలతో పాటు కూలిపోయిన కట్టడాల శిథిలాలను, రైతుల పొలాల నుంచి బురదను తొలగించడం మొదలైన పనులు జరుగుతున్నాయి. ఈ పనుల సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు ఒక వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. తొలగించిన వాటిని తట్టలలో పెట్టి ఒకరి నుంచి ఒకరికి అందివ్వవలసివుంటుంది. ఇం దుకు సంబంధిత పనివారు విధిగా అత్యంత చేరువగా, రెండడుగుల కంటే తక్కువ దూరంలో వుండితీరాలి. మరి కరోనా విపత్తు లాంటి ప్రజారోగ్య సంక్షోభ కాలంలో వ్యక్తులు మధ్య కనీసం ఐదారడుగుల భౌతిక దూరం వుండి తీరాలన్న ఆరోగ్య నిబంధనను పాటించడం, ఉపాధి హామీపనుల సందర్భంగా అసాధ్యమని స్పష్టమవడం లేదూ?


మరి సార్స్ కొవ్-2 సంక్రమణను, కొవిడ్ -19 వ్యాప్తిని కనీసస్థాయికి అదుపు చేయడం ఎలా సాధ్యమవుతుంది? మరింత ముఖ్యమైన విషయమేమిటంటే పనివారిని బృందాలుగా పనిచేయిస్తున్నారు. వీరంతా విభిన్న కుటుంబాలకు చెందిన వారు. మరి ప్రభుత్వం విధించిన, పొడిగించిన లాక్‌డౌన్ ప్రకటిత లక్ష్యం భౌతిక దూరం పాటించడం కదా. మరి జీవనోపాధికి కాయకష్టం చేసేవారిని ఈ విపత్తు వేళ అలా పనిచేయించడమంటే ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య రక్షణా లక్ష్యాన్ని ఉపేక్షించడమే కాదూ? కరోనా వైరస్‌ సాంక్రామిక తీరుతెన్నుల గురించి మనకు తెలిసిన దానిని బట్టి ఉపాధి హమీ పను లు జరుగుతున్న పద్ధతులు వైరస్ వ్యాప్తికి, మహమ్మారి ప్రబలడానికి అత్యంత అనుకూలతలని మరి చెప్పనవసరం లేదు. ప్రత్యేకించి ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. కొవిడ్ -19 పాజిటివ్‌గా నిర్ధారింపబడిన కేసులలో 70 శాతం వ్యాధి లక్షణ రహితంగా కన్పించినవేనని భారత వైద్యపరిశోధనా మండలి (ఐసిఎమ్‌ఆర్) ఇటీవల దేశాన్ని అప్రమత్తం చేసిన విషయాన్ని మనం మరువకూడదు.


గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులలో నీటి పారుదల, ఇతర జలసంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యమివ్వడం జరుగుతోంది. ఈ పనులను, ప్రతి ఇద్దరు కూలీల మధ్య ఐదారుడుగుల ‘సామాజిక’ లేదా భౌతిక దూరాన్ని పాటిస్తూ నిర్వహించడం అసాధ్యం. మరి ఈ వాస్తవాన్ని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2020 ఏప్రిల్ 15న జారీ చేసిన ఉత్తర్వు గుర్తించక పోవడం ఆశ్చర్యకరంగా వున్నది. క్షేత్ర స్థాయిలో మనం చూస్తున్నది పూర్తిగా ఈ వాస్తవాల దృష్టాంతాలే. ఉపాధి హమీ పనుల అమలుకు నిర్దేశించిన నిబంధనలను సంబంధిత ప్రభుత్వాధికారులు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు. ఉపాధి హమీ పనులను ఎప్పుడు అమలుపరిచినా ఆ పనులు చేసేవారి మధ్య ఖచ్చితమైన సామాజిక/ భౌతిక దూరం వుండేలా జాగ్రత్త వహించాలన్న నిబంధన విషయమంలో ఎవరూ ఎలాంటి జాగ్రత్త చూపించడమే లేదు! కనుకనే ఎన్‌ఆర్‌ఇజిఏ సంఘర్ష్ మోర్చా, ట్రేడ్ యూనియన్లు, ఉపాధి హమీ పనుల విషయంలో ప్రజా కార్యాచరణలో పాల్గొంటున్న వ్యక్తులు, సంస్థలు లాక్‌డౌన్ కాలంలో పనుల నిర్వహణను పూర్తిగా నిలిపివేసి, ఆ కాలానికి గాను కార్మికుల వేతనాలను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇది న్యాయబద్ధమైన డిమాండ్, సందేహం లేదు. ఈ డిమాండ్‌ను అమలుపరిచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రజాహిత వ్యాజ్యం ఒకటి సుప్రీం కోర్టులో దాఖలయింది. ఉపాధి హమీ పనులను పూర్తిగా నిలిపివేయాలని (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మానవ హక్కుల వేదిక ఈ నెల 16న ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. కరోనా విలయం లాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో భౌతిక దూరం పాటించడానికి వీలులేని పనులను నిర్వహించడం కార్మికులకు ప్రాణ హానిగా పరిణమించవచ్చని ఆ ప్రకటన స్పష్టం చేసింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నమోదయివున్నవారికందరికీ లాక్‌డౌన్ కాలానికి గాను పూర్తి వేతనాలు ఇచ్చి తీరాలని కూడా ఆ ప్రకటన డిమాండ్ చేసింది.


భారత రాజ్య వ్యవస్థ తన పౌరుల విషయంలో పరస్పర విరుద్ధ వైఖరులను అనుసరిస్తోంది. ఇది గర్హనీయం. ఒక వైపు లాక్‌డౌన్‌ను దేశ వ్యాప్తంగాను మే 3 దాకా పొడిగిస్తూ (తెలంగాణలో మే 7 వరకు) మరో వైపు ప్రతి పౌరుడు ఇంటి పట్టునే వుండిపోవాలని, భౌతికదూరాన్ని ఖచ్చితంగా పాటించాలని నిర్దేశిస్తోంది. ఇదే సమయంలో కంటైన్‌మెంట్ ప్రాంతాల వెలుపల ఉపాధి హమీ పథక పనులు ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. పేద ప్రజల పట్ల (వీరిలో అత్యధికులు దళితులు, ఆదావాసీలు- మహిళలే అధికం) భిన్న ప్రమాణాలను రాజ్యం అనుసరిస్తుందని చెప్పక తప్పదు. ఉపాధి హామీ పనులకు విధిగా వెళ్ళి తీరాలని, ఉపాధి హమీ పనులను పూర్తిచేస్తేనే కూలీ భత్యాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇలా నిర్దేశించడంలో రాజ్య వ్యవస్థ ఉద్దేశమేమిటి? వర్గ, కుల, జెండర్ ప్రాతిపదికనే, జీవితాలకు విలువనివ్వడానికే భారత రాజ్య వ్యవస్థ ప్రాధాన్యత నిస్తున్నదా ఏమిటి? ఇంతకూ దళితులు, ఆదివాసీలు కరోనా వైరస్‌ బారిన తక్కువగా పడేంతగా రోగ నిరోధక శక్తి కలిగివున్నవారా? పేద ప్రజల ఆరోగ్యాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడమేమిటి?


మనిషి మనుగడకు ఆర్థికం ముఖ్యం. ఆదాయమే ఆర్థికం. పనివుంటేనే ఆదాయం. గనుకనే ప్రస్తుత సంక్షోభ వేళలో కూడా చాలా మంది ఉపాధి హమీ పనులు ప్రారంభమవడాన్ని స్వాగతించారు. ఆరోగ్యపరమైన చిక్కులు ఎన్ని వున్నప్పటికీ ఆదాయాన్ని కల్పించే అవకాశాలకు వారు సహజంగా ప్రలోభ పడ్డారు. చిత్తూరు జిల్లా కెవిబి పురం మండలానికి చెందిన సామాజిక నిర్వాహకురాలు ఒకరు ఉపాధి హమీ పనులు భౌతిక దూరం ప్రమాణాలను అతిక్రమిస్తున్నాయని సంబంధిత ప్రభుత్వాధికారి దృష్టికి తీసుకువెళ్లగా ‘మీ ఇష్టం. పనికావాలనుకుంటే రండి. పని అవసరం లేకపోతే రావద్దు’ అని ఆ మహాశయుడు పుల్ల విరుపుగా మాట్లాడాడు. ఇవన్నీ లాక్‌డౌన్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమే. మరి ఉపాధి హమీ కార్మికులలో అత్యధికులు దళితులు, ఆదీవాసీలేనన్న సత్యాన్ని ప్రత్యేకించి చెప్పాలా? ఉపాధి హామీ కార్మికులకు సంబంధిత వేతనాలను అడ్వాన్స్ పేమెంట్‌గానో లేదా పని ప్రాతిపదికనో పూర్తిగా తక్షణమే చెల్లించి తీరాలి. లాక్‌డౌన్ కాలానికి గాను ఈ చెల్లింపులు జరిగితీరాలి. ఇదే సమయంలో ఆ పనుల నిర్వహణను పూర్తిగా నిలిపివేయాలి. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తరువాతనే ఆ పనులను పునః ప్రారంభించాలి. ఇలా జరగని పక్షంలో, అది, మన సమాజంలోని అత్యంత దుర్బల, పేద వర్గాల వారి పట్ల రాజ్యవ్యవస్థ వివక్షకు మరో స్పష్టమైన దృష్టాంతమవుతుంది.

సాగరి రాందాస్

రాధా గోపాలన్ ఆర్. చరణ్య 

ఫుడ్ సావర్నిటీ అలయెన్స్

Updated Date - 2020-04-28T05:53:31+05:30 IST