Abn logo
Feb 18 2020 @ 00:40AM

రైతులు శ్రీమంతులయ్యేనా

2023 సంవత్సరం నాటికి రైతుల రాబడి రెట్టింపు కావాలంటే వారి ఆదాయం ఏటా 30 శాతం పెరగవలసివున్నది. రైతుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-–21 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన దిగుబడుల పెంపుదల వ్యూహం ఆ లక్ష్య పరిపూర్తికి తోడ్పడదు.


రైతుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం దృఢనిశ్చయంతో వున్నది. 2023 సంవత్సరం నాటికి సాగుదారుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు నిబద్ధమయింది. ఈ మేరకు తన హామీని 2020–21 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో కూడా పునరుద్ఘాటించింది. 


2013–19 సంవత్సరాల మధ్య మన రైతుల ఆదాయం ఏడాదికి 7శాతం చొప్పున పెరిగిందని ఒక ప్రతిష్ఠాత్మక ఆర్థిక అధ్యయనాల సంస్థ నిర్ధారించింది. మరో మూడేళ్ళలో రైతుల రాబడిని రెట్టింపు చేయాలన్న పాలకుల సంకల్పం నెరవేరాలంటే సాగుదారుల ఆదాయం ఏడాదికి 30 శాతం చొప్పున పెంపొందవలసివున్నది! రైతుల ఆదాయాన్ని అధికం చేసేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్‌లో ఒక ప్రతిపాదన చేశారు. దిగుబడుల పరిమాణాన్ని ఇతోధికం చేయడమే ఆ వ్యూహం. సమతుల్య ఎరువులు, సోలార్ పంప్ సెట్స్ నుపయోగించడాన్ని ప్రోత్సహించడం ద్వారా దిగుబడులను అధికంచేయవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు సాధారణంగా అమ్మకాలు విరివిగా జరుగుతాయి. రైతులకు మరింత ఆదాయం లభిస్తుంది. 


అయితే దిగుబడుల పెరుగుదల, ఆదాయాల హెచ్చుదల మధ్య సంబంధం సున్నితమైనది. అంతేకాదు, అది సాగుదారుకు సానుకూలంగా వుండే అవకాశమూ లేదు. ఎందుకంటే ఉత్పత్తులకు లభించే ధరపై ఆ సంబంధం ఆధారపడివున్నది. పాలంపూర్ రైతులు తాము ఉత్పత్తి చేసిన బంగాళాదుంపలను రోడ్లపై పారేశారు. తమ ఫలసాయానికి గిట్టుబాటు ధర లభించక పోవడం వల్ల వారు తీవ్ర నైరాశ్యానికి గురయ్యారు. ‌


నిజానికి వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గిపోవడమనేది గత కొన్ని దశాబ్దాలుగా రైతులకు ఆశనిపాతంగా వున్నది. ఎందుకని? నవీన సాంకేతికతలు ఉత్పత్తిని ఇతోధికంగా పెంచుతున్నాయి. వ్యవపాయోత్పత్తుల సరఫరా సమృద్ధిగా ఉంటోంది. సమస్యేమిటంటే ఈ సమృద్ధ సరఫరాకు అనుగుణంగా మార్కెట్‌లో డిమాండ్ ఉండడం లేదు.పెరుగుతున్న ఉత్పత్తులకు సమ నిష్పత్తిలో ప్రపంచ జనాభా పెరగడం లేదు. సరఫరా వున్నా గిరాకీ లేదు. ఫలితంగా వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గిపోతున్నాయి. జీవ ఇంధనాల (బయో ఫ్యూయెల్స్) అభివృద్ధి రైతులకు కొంత ఉపశమనాన్నిచ్చింది. అయితే వీటి ధర కూడా గత కొన్ని సంవత్సరాలుగా తగ్గిపోతున్నది. ఆర్థిక మంత్రి అభిలషించినట్టు దిగుబడుల పెరుగుదల ఆదాయాల హెచ్చుదలకు విధిగా దారితీయదు. ఉత్పత్తి వ్యయాలను సైతం రాబట్టుకోలేని విధంగా రైతుల పరిస్థితి విషమించే ప్రపమాదమూ ఎంతైనా వున్నది. 


మరి రైతుల శ్రేయో సాధనకు మార్గాంతరమేమిటి? దిగుబడుల నాణ్యతను పెంపొందించడమే. ఆర్థిక మంత్రి ఈ దిశగా ప్రశస్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు ఆమె ఎంతైనా అభినందనీయురాలు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఒక నిర్దిష్ట పంటను గుర్తించి ఆ పంట సాగుకు, దిగుబడుల పెంపుదలకు అవసరమైన చర్యలను సంపూర్ణంగా తీసుకోవాలని ఆమె సూచించారు. నిస్సందేహంగా ఇది మంచి నిర్ణయం. అలసత్వానికి తావివ్వకుండా అమలుపరచవలసిన నిర్ణయమిది. 


మన దేశ శీతోష్ణ స్థితులలో అపారమైన వైవిధ్యమున్నది. హిమాలయాలు, ఇతర పర్వత ప్రాంతాలలో వేసవిలో చల్లని వాతావరణం వుంటుంది. కేరళ, తమిళనాడులలో శీతాకాలంలో వెచ్చని వాతావరణం వుంటుంది. ఈ వాతావరణ వెసులుబాటుతో మనం గులాబీ పువ్వుల లాంటి శీతాకాల ఉద్యాన పంటలను సంవత్సరం పొడుగూనా ఏదో ఒక ప్రాంతంలో సాగుచేసి, ఎలాంటి విరామం లేకుండా ప్రపంచ మార్కెట్‌కు సరఫరా చేయవచ్చు. నెదర్లాండ్స్ లాంటి ఒక చిన్న దేశం తులిప్ పుష్పాలను ప్రపంచమంతటికీ సరఫరా చేస్తూ ఏడాదికి రూ.2500కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇది మన మొత్తం వ్యవసాయ దిగుబడుల విలువలో (రూ.30,000 కోట్లు) 8 శాతం. నెదర్లాండ్స్‌లో వ్యవసాయ యోగ్యమైన భూమి వైశాల్యం పది లక్షల హెక్టార్లు మాత్రమే. ఇది మన మొత్తం వ్యవసాయ యోగ్య భూమిలో 0.6 శాతం మాత్రమే. అయితే ఒక హెక్టారు భూమిలో మనం సాధించే దిగుబడి కంటే నెదర్లాండ్స్ రైతులు సాధించే ఉత్పత్తి 12 రెట్లు అధికంగా ఉంటుంది. పైగా ఆ యూరోపియన్ దేశ వాతావరణంలో వైవిధ్యమేమీ లేదన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెదర్లాండ్స్ వలే టునీసియా కూడా ఆలివ్ ల ఎగుమతులతో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ద్రాక్షా సవం (గ్రేప్ వైన్) ఎగుమతితో ఫ్రాన్స్ పొందుతున్న లబ్ధి గురించి మరింక చెప్పనవసరం లేదు. ఆ దేశాల వలే మనమూ హెక్టారుకు సగటు దిగుబడుల స్థాయిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. 


జిల్లాల వారీగా నిర్దిష్ట పంటల సాగును అభివృద్ధి పరచుకోవడానికి విస్తృత, ప్రగాఢ పరిశోధన చేయవలసివున్నది. ఇటువంటి బృహత్ కర్తవ్య నిర్వహణకు మన విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) ప్రయోగశాలలు చాలా వెనుకబడి వున్నాయి. ఒక రైతు అనుభవమే ఇందుకొక ఉదాహరణగా చెప్పవచ్చు. ఒక సుప్రసిద్ధ విశ్వవిద్యాలయంలోని ఉద్యానవన శాస్త్ర విభాగం ఆచార్యుడు ఒకరు కినో పండ్లను సాగుచేయమని ఒక రైతుకు సలహా ఇచ్చాడు. ఆ రైతు ఒక ఎకరంలో కినో మొక్కలను నాటాడు. అవి పెరిగి, ఐదు సంవత్సరాలకు కాపుకు వచ్చాయి. తీరా చాలా చిన్న పరిమాణంలో ఉన్న పండ్లను మాత్రమే అవి ఇచ్చాయి. కినో సాగుకు తనను ప్రేరేపించిన హార్టికల్చర్ ప్రొఫెసర్ మహాశయుడి వద్దకు వెళ్ళి ఆ రైతు మొరపెట్టుకున్నాడు. ‘అవునయ్యా, నా చెట్లు కూడా చిన్న పండ్లనే కాచాయని’ ఆ ఆచార్యుడు అంగీకరించాడు. ఆయన అంగీకరించడం అలావుంచితే, రైతుకు జరిగిన నష్టం ఎలా తీరుతుంది? ఈ వాస్తవం దృష్ట్యా రైతులకు సరైన మార్గదర్శకత్వం ఇచ్చేందుకు ప్రతి జిల్లాకు లేదా కొన్ని జిల్లాలకు కలిపి ఒక ఐఐటి లేదా ఐఐఎమ్ స్థాయి వ్యవసాయ పరిశోధనా సంస్థను నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ఇది జరిగితీరాలి. దిగుబడుల నాణ్యతకు కాకుండా దిగుబడుల పరిమాణానికి మాత్రమే ప్రాధాన్యమివ్వడం వల్ల రైతుల ఆదాయాన్ని 2023 సంవత్పరం నాటికి రెట్టింపు చేయడం సాధ్యం కాదు. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరదు. తొలుత జిల్లాలవారీగా నిర్దిష్ట పంటను గుర్తించి, ఆ పంట సాగును ప్రోత్సహించాలి. గోదాంలు, శీతల గిడ్డంగులు మొదలైన సదుపాయాలను అభివృద్ధిపరచాలి. బడ్జెట్ లో సూచించిన విధంగా కేవలం దిగుబడుల పరిమాణాన్ని పెంచినంత మాత్రాన రైతులకు మేలు జరగదు.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...