వాస్తవాలు దాస్తే దాగుతాయా?

ABN , First Publish Date - 2022-04-23T06:05:20+05:30 IST

నిత్యజీవితంలో కాలాన్ని నిమిషాలు, గంటలుగా కొలుచుకుంటూ ఉరుకులు, పరుగులు తీస్తుంటాం; డబ్బును మళ్లీ మళ్లీ లెక్కించుకుంటాం; ఎన్ని ఆటలు ఆడామో, పరుగులు ఎన్ని తీశామో, సరైన సంఖ్యలో గోల్స్ చేశామా లేదా అన్న గణన మనకు చాలా ముఖ్యం; విజయాలూ, వైఫల్యాలూ సమస్థాయిలో ఉండాలని కోరుకుంటాం...

వాస్తవాలు దాస్తే దాగుతాయా?

నిత్యజీవితంలో కాలాన్ని నిమిషాలు, గంటలుగా కొలుచుకుంటూ ఉరుకులు, పరుగులు తీస్తుంటాం; డబ్బును మళ్లీ మళ్లీ లెక్కించుకుంటాం; ఎన్ని ఆటలు ఆడామో, పరుగులు ఎన్ని తీశామో, సరైన సంఖ్యలో గోల్స్ చేశామా లేదా అన్న గణన మనకు చాలా ముఖ్యం; విజయాలూ, వైఫల్యాలూ సమస్థాయిలో ఉండాలని కోరుకుంటాం. ఓట్ల సంఖ్య బేరీజు వేసుకుంటాం; సీట్లు రావలసినన్ని వచ్చాయో లేదో అని ఆదుర్దా పడతాం... ఇలా అంకెలూ, లెక్కింపులే మన జీవితం.


కచ్చితంగా లెక్క పెట్టుకునేందుకు సిగ్గుపడాల్సిన అ వసరం లేదు– మృతుల లెక్కింపు ఇందుకొక మినహాయింపు అనుకుంటాను కరోనా వైరస్ మహమ్మారి ప్రతీ చోటా మరణ మృదంగం మోగించింది. కరోనా సోకి ఎంత మంది చనిపోయారు అన్నది కచ్చితంగా ఎలా తెలుస్తుంది? కరోనా భారిన పడిన వారిని (సజీవులుగా ఉన్నప్పుడు) కనుగొని, పరీక్షించి, చికిత్స చేయడం లేదా మృతుని భౌతిక కాయానికి పోస్ట్ మోర్టం నిర్వహించడంపై ఆ ప్రశ్నకు సమాధానం ఆధారపడి ఉంది. జనాభా సాపేక్షంగా స్వల్ప సంఖ్యలో ఉన్న దేశాల్లో లేదా అత్యాధునిక ఆరోగ్య భద్రతా సదుపాయాలు ఉన్న దేశాల్లో మాత్రమే అది సాధ్యమవుతుంది 2020 సంవత్సరంలో భారత్‌కు ఆ రెండు సానుకూలతలు లేవు.


కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా మరణాలు సంభవించాయి. అలా చనిపోయిన వారందరికీ రోగ నిర్ణయ పరీక్షలు నిర్వహించడం గానీ లేదా చికిత్స చేయడం గానీ జరగలేదని నిశ్చితంగా చెప్పవచ్చు. మృతదేహాలను నదుల్లో విసరివేయడం లేదా నదీ తీరాన ఖననం చేయడం జరిగిందని మనకు తెలుసు. చెప్పవచ్చిందేమిటంటే కరోనాతో ఎంత మంది ఖచ్చితంగా చనిపోయిందీ ఎవరూ లెక్కలు తీయలేదు. ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు –ప్రభుత్వం తప్ప. 2022 ఏప్రిల్ 22 ఉదయం వరకు కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 5,22,065 అని ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పింది.


కరోనా మరణాలపై జరిగిన అధ్యయనాలు ఎన్నో ప్రభుత్వం చెబుతున్న మృతుల సంఖ్యను నిరాకరించాయి. సర్కారీ సంఖ్య అబద్ధమనేది తొలుత గుజరాత్‌లో నిర్ధారణ అయింది. ప్రభుత్వాధికారులు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న ఒక వార్తా పత్రిక మహమ్మారి సంవత్సరాలలో చనిపోయిన వారి సంఖ్య, ఆ విపత్తుకు పూర్వపు సంవత్సరాలలో మరణించిన వారి సంఖ్య కంటే అధికంగా ఉందని రుజువు చేసింది. మృతుల సంఖ్యలో తేడాకు కరోనా వైరస్సే కారణమని నిర్ధారించింది. 


ఆ ‘వ్యత్యాసం’ కరోనా సంబంధిత మరణాలపై అధికారిక సంఖ్య కంటే చాలా ఎక్కువగా ఉంది, గుజరాత్ యేతర రాష్ట్రాలలోని మునిసిపాలిటీలలో కూడా నిర్వహించిన అటువంటి అధ్యయనాలలో కరోనా మరణాల సంఖ్య, ప్రభుత్వం అంగీకరించడానికి సుముఖంగా ఉన్న సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంగా వెల్లడయింది. భారత్‌లో కరోనా సంబంధిత మరణాల సంఖ్య 30 లక్షలని ఈ ఏడాది జనవరిలో ‘సైన్స్’ జర్నల్‌లో ఒక అధ్యయనం అంచనా వేసింది. ‘లాన్సెట్’ జర్నల్‌లో ఈ ఏప్రిల్‌లో ప్రచురితమైన రెండో అధ్యయనంలో మృతుల సంఖ్య 40 లక్షలని అంచనా వేశారు. ప్రపంచ ఆరోగ్య సంఖ్య ఆధ్వర్యంలో ఏడాది పొడుగునా జరిగిన మరో అధ్యయనం (దీని నివేదిక ఇంకా ప్రచురితం కాలేదు) కూడా కరోనా సంబంధిత మృతుల సంఖ్య 40 లక్షలని తేల్చింది (ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాల సంఖ్య 90 లక్షలని అంచనా).


కరోనా సంబంధిత మరణాల సంఖ్య 30 నుంచి 40 లక్షల మధ్య ఉన్నా వాటిని నివారించడంలో భారత ప్రభుత్వం విఫలమయిందని సహేతుకంగా ఆరోపించవచ్చు. కేంద్రంలో ఆరేళ్ళుగా, రాష్ట్రాలలో చాలా సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా ఆరోగ్య భద్రతా సదుపాయాలను అభివృద్ధిపరచడంలో బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న ఆరోగ్య విపత్తు గురించి వైద్య నిపుణులు ముందుగానే హెచ్చరించినప్పటికీ ఆ విలయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయింది. ప్రయాణాలను నిషేధించడం, లాక్‌డౌన్ విధించడం, తాత్కాలిక ఆరోగ్య భద్రతా సదుపాయాలను సృష్టించడం, వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇవ్వడం మొదలైన విషయాలలో ప్రభుత్వం గర్హనీయమైన జాప్యం చేసింది.


మహమ్మారి సంబంధిత మరణాల సంఖ్య అధికారిక గణాంకాల కంటే 6 నుంచి 8 రెట్లు అధికంగా ఉందన్న విషయాన్ని అంగీకరించడానికి ప్రభుత్వం సుముఖంగా లేకపోవడం ఎంతైనా భీతి గొల్పుతోంది. పైగా వివిధ అధ్యయనాలు జరిగిన తీరు తెన్నుల పట్ల తీవ్ర ఆక్షేపణలు తెలుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన నిపుణులు పాల్గొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయన పద్ధతిని భారత ప్రభుత్వం తప్పుపట్టింది!


గణాంకాలు వివాదాస్పదం కాకపోతే మరేమవుతాయి? భారత్‌లో కటిక పేదరికం 2011లో 22.5 శాతం నుంచి 2019లో 10.2 శాతానికి తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంక్ అధ్యయన పత్రం ఒకటి వెల్లడించింది. తొమ్మిదేళ్లలో పేదరికం మొత్తం మీద 12.3 శాతం తగ్గగా గ్రామీణ ప్రాంతాలలో అది 14.7 శాతం మేరకు తగ్గిపోయింది. పేదరికం తగ్గిపోయిందనే అంచనాతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే ఇందుకు అనేక మినహాయింపులు ఉన్నాయి. మొదటిది– ప్రపంచ బ్యాంకు అధ్యయనం 2019లో నిలిచిపోయింది. ఆ తరువాత మహమ్మారి కారణంగా సంభవించిన ఆర్థిక విధ్వంసాన్ని అది పరిగణనలోకి తీసుకోలేదు. రెండోది– 2020 మార్చి నుంచి అన్ని అభివృద్ధి సూచకాలు అధోముఖంలో ఉన్నాయి. 2020 సంవత్సరం నుంచి 23 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారని అజిమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం అధ్యయనం ఒకటి అంచనా వేసింది. మరి 2019 దాకా సాధించినట్టుగా భావిస్తున్న ఆర్థిక విజయాలన్నీ కరోనా దెబ్బకు వ్యర్థమై పోలేదా? మూడోది– కరోనా విలయపు నష్టాలను మనం ఇంకా అధిగమించలేదు. కోల్పోయిన ఉద్యోగాలు తిరిగి రాలేదు. పెరిగిన కుటుంబ సంబంధిత రుణభారం అలానే ఉండిపోయింది. కొత్త ఉద్యోగ అవకాశాలు ఇంకా అరకొరగా మాత్రమే ఉన్నాయి.


మరో లెక్కింపు వ్యవహారం కూడా వివాదానికి ఆస్కారమిచ్చింది. ‘ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు మేము వినియోగిస్తున్న రాబడి ప్రజలపై పన్నులు విధించడం ద్వారా సమకూర్చుకోవడం లేదు. ఎవరిమీదా మేము ‘‘కోవిడ్ పన్ను’’ అనే దాన్ని విధించలేదు’ అని వాషింగ్టన్‌లో మన ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. నిజమా? కేంద్ర ప్రభుత్వం 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాలలో ఇంధన పన్నుల ద్వారా రూ.8,16,126 కోట్లను వసూలు చేసుకుంది. భారీ లాభాలను ఆర్జించిన కారణంగా చమురు కంపెనీల నుంచి మరో రూ.72,531 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. కొవిడ్ మరణాలను తక్కువగా అంచనా వేశామని, పేదరికం తగ్గుదలను అధికంగా చూపామని, చమురు పన్ను విధింపు వినియోగదారులపై అధిక భారం మోపిందనే వాస్తవాన్ని అసలు చెప్పనే లేదని అంగీకరించేందుకు సిగ్గుపడవలసిన అవసరమేముంది?


(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)



Updated Date - 2022-04-23T06:05:20+05:30 IST