దగ్గు, జలుబు, జ్వరం వస్తే CORONA అని భయపడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..!

ABN , First Publish Date - 2021-09-07T17:19:21+05:30 IST

ఈ సీజన్‌లో దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా కరోనా అన్న ఆందోళన వెంటాడుతోంది...

దగ్గు, జలుబు, జ్వరం వస్తే CORONA అని భయపడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..!

హైదరాబాద్‌ సిటీ : ఈ సీజన్‌లో దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా కరోనా అన్న ఆందోళన వెంటాడుతోంది. వైరల్‌ ఫీవర్లు, ఇతర జ్వరాలపై అవగాహనతోపాటు, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం వస్తే చాలు.. కొవిడ్‌ అని భయపడొద్దని అంటున్నారు. వాతావరణ మార్పులు, జలుబు, కొన్ని రకాల మందుల వల్ల జ్వరాలు రావొచ్చనని వైద్యులు అంటున్నారు. 


పిల్లలు.. పెద్దల విషయంలో.. 

మూడు నుంచి 21 నెలల వయస్సు శిశువు శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారిన్‌ హీట్‌ ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. పెద్దలకు తలనొప్పి, జలుబు, గొంతునొప్పి, దగ్గు, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీనొప్పి, కడుపునొప్పి, దద్దుర్లు, ఒంటి  నొప్పులు, ఇతర ఇబ్బందులు ఉంటే డాక్టర్‌ను సంప్రందించాలి. ఒక వ్యక్తికి ఎనిమిది నుంచి 12 గంటల పాటు మూత్ర విసర్జన లేకుండా జ్వరం ఉంటే డాక్టర్‌ను కలవాలి.


48 గంటలు దాటితే...

సాధారణ జ్వరం సగటున 48 గంటల పాటు ఉంటుంది. అంతకు మించి ఎక్కువ రోజులు ఉంటే వెంటనే డాక్టర్‌ను  సంప్రందించి సలహాలు తీసుకోవాలి. ధర్మామీటర్‌తో ఉష్ణోగ్రతను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. చలితో ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారన్‌ హీట్‌ నుంచి 101 డిగ్రీల ఫారన్‌ హీట్‌ మధ్యలో ఉంటే వైద్యుడి సలహా మేరకు మందులు వాడాలి. జ్వరం వచ్చిన మొదటి రోజు పారాసిట్‌మాల్‌ వేసుకోవాలి. పెద్ద వాళ్లు అయితే బీపీ, షుగర్‌ లెవల్స్‌, శరీర ఉష్ణోగ్రత కూడా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. శారీకర, మానసిక ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతి తీసుకోవాలి.


గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి, లేదా శరీరాన్ని స్పాంజ్‌/కాటన్‌ న్యాప్‌కిన్‌తో తుడవాలి. ఇది ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. జ్వరం సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. జ్యూస్‌లు, సూప్‌, కొబ్బరినీళ్లు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఒకే సారి ఎక్కువ ఆహారం కాకుండా మూడు గంటలకు ఒకసారి కొంచెం, కొంచెంగా తీసుకోవాలి. - డాక్టర్‌ నందన జాస్తి, జనరల్‌ ఫిజిషియన్‌, మెడికవర్‌ ఆస్పత్రి

Updated Date - 2021-09-07T17:19:21+05:30 IST