కుంగిపోతున్నాయి

ABN , First Publish Date - 2021-06-12T05:10:36+05:30 IST

జిల్లాలో చేపడుతున్న మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం నిధులు నీళ్ల పాలవుతున్నాయి.

కుంగిపోతున్నాయి
అసంపూర్తిగానే ఉన్న జంగంపల్లి ట్యాంక్‌బండ్‌ పనులు

  • - జిల్లాలో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్‌ నిధులు నీళ్ల పాలు
    - పనుల్లో నాణ్యతా లోపాలు.. పగుళ్లు తీస్తున్న కట్టలు
    - ప్రణాళిక లేకుండా అలుగుల నిర్మాణాలు
    - ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్‌ల పనులు
    - కల్కి చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ కుంగిపోవడమే నిదర్శనం
    - మిగితా నాలుగు ట్యాంక్‌బండ్ల నిర్మాణ పనుల్లోనూ నాణ్యతా లోపాలు
    - ఇంకా కొనసాగుతూనే ఉన్న ఎల్లారెడ్డి ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులు
    - నాణ్యతా లోపంతో రూ.27.62 కోట్లు వృథా
    - ప్రజలకు అందుబాటులోకి రాని మినీ ట్యాంక్‌బండ్‌ల ఆహ్లాదం



కామారెడ్డి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపడుతున్న మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం నిధులు నీళ్ల పాలవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్‌లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతుండడంతో పక్షం రోజులకే సుందరీకరణంగా ఉండాల్సిన మినీ ట్యాంక్‌బండ్‌లు అంధవికారంగా కనిపిస్తున్నాయి. కురుస్తున్న వర్షాలకు ట్యాంక్‌బండ్‌ల కట్టలు కుంగిపోయి భారీ పగుళ్లు ఏర్పడుతున్నాయి. ప్రణాళిక లేకుండా ట్యాంక్‌బండ్‌ల అలుగుల నిర్మాణ పనులు చేపట్టారని విమర్శలు వస్తున్నాయి. ఇందుకు నిదర్శనం బాన్సువాడ మినీ ట్యాంక్‌బండ్‌ కల్కి చెరువు కట్ట వాకింగ్‌ట్రాక్‌ కట్టపై వేసిన బీటీ రోడ్డు తొలగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.


ట్యాంక్‌బండ్‌ నిర్మాణ విషయంలో సంబంధిత కాంట్రాక్టర్‌లు ఇష్టారాజ్యంగా నాణ్యత లేకుండా పనులు చేసినట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల బిల్లులు లేపుకున్నప్పటికీ స్థానికంగా లక్షల్లో కూడా పనులు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇలా నాణ్యత లోపంతో మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణాలకు సంబంధించి రూ.27 కోట్లు వృథా అయినట్లు జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.



జిల్లాలో 5 మినీ ట్యాంక్‌బండ్ల నిర్మాణాలు

మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా గత నాలుగు సంవత్సరాల కిందట రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 5 మినీ ట్యాంక్‌బండ్‌లను మంజూరు చేసింది. ఈ మినీ ట్యాంక్‌ బండ ్ల నిర్మాణానికి ప్రభుత్వం మొత్తం రూ.27.62 కోట్ల నిధులను మంజూరు చేసింది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువుకు రూ.8.96కోట్లు, బాన్సువాడలోని కల్కి చెరువుకు 6.8 కోట్లు, ఎల్లారెడ్డిలోని పెద్ద చెరువుకు రూ.5.41 కోట్లు, జంగంపల్లి చెరువుకు రూ.3.65 కోట్లు, బిచ్కుంద కమ్మరి చెరువుకు రూ.3.52 కోట్లు మంజూరు చేశారు. ఈ ట్యాంక్‌బండ్ల నిర్మాణానికి ప్రభుత్వం గతంలోనే నిధులు విడుదల చేసింది.



మినీ ట్యాంక్‌బండ్‌ కట్టలకు పగుళ్లు

జిల్లాలో 5 మినీ ట్యాంక్‌బండ్‌లలో బాన్సువాడ కల్కిచెరువు పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా నాలుగు చెరువుల మినీ ట్యాంక్‌బండ్‌ పనులు ఇప్పటికీ నత్తనడకనే కొనసాగుతునే ఉన్నాయి. బాన్సువాడ పట్టణంలోని కల్కిచెరువు ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులు పూర్తవ్వడంతో గతంలోనే ట్యాంక్‌బండ్‌ను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. పనులు పూర్తయి సంవత్సరం గడవకముందే భారీ వర్షానికి ట్యాంక్‌బండ్‌ కట్ట పూర్తిగా కుంగిపోయింది. వాకింగ్‌ ట్రాక్‌, బీటీ రోడ్లలో భారీ పగుళ్లు ఏర్పడడంతో తెగిపోయే ప్రమాదస్థాయికి చేరుకుంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సంబంధిత కాంట్రాక్టర్‌లు నిర్మాణ పనుల్లో అలసత్వం వహించడం, నాణ్యతగా చేపట్టకపోవడంతో ట్యాంక్‌బండ్‌ల పనుల్లో అక్రమాలు బయటకు కనిపిస్తున్నాయి.


మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణాలు పకడ్బందీగా చేపట్టాల్సి ఉంటుంది. సంబంధిత చెరువు కట్టను మొరంతో బలోపేతం చేయడం, కట్ట తెగకుండా, కుంగిపోకుండా బండరాళ్లతో గోడలు నిర్మించాలి. అదేవిధంగా కట్టపైన మొరంతో నింపి టైల్స్‌తో ట్రాక్‌ను ఏర్పాటు చేయడంతో పాటు సైడ్‌ వాల్స్‌ను నిర్మించాల్సి ఉంటుంది. స్థానికంగా గార్డెన్‌ను ఏర్పాటు చేసి మొక్కలు, గడ్డిపోచలతో ట్యాంక్‌ మాదిరిగా ఆహ్లాదకరమైన గార్డెన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, కాంట్రాక్టర్‌లు పనులు నాణ్యత లేకుండా చేపడుతున్న దానికి బాన్సువాడ కల్కి చెరువు కుంగిపోవడమే నిదర్శనం.


కురుస్తున్న వర్షాలకు మినీ ట్యాంక్‌బండ్‌ల కట్టలపై మొరం కొట్టుకపోయి భారీ పగుళ్లు ఏర్పడుతున్నాయంటే కాంట్రాక్టర్‌లు ఏ మేర నాణ్యతతో పనులో చేశారో అర్థమవుతోంది. అలుగుల నిర్మాణాలు సైతం ప్రణాళిక లేకుండా చేపడుతున్నారని ప్రస్తుతం నీటి నిల్వ తగ్గిపోతున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఇలా కాంట్రాక్టర్‌లు ప్రణాళిక లేకుండా నాణ్యత లోపంతో పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.




నత్తనడకన పనులు

జిల్లాలోని ఎల్లారెడ్డి, జంగంపల్లి మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పనులు నత్తనడకనసాగుతున్నాయి. ఎల్లారెడ్డి పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ పనులు ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాయి. భిక్కనూర్‌ మండలం జంగంపల్లి ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కామారెడ్డి పెద్దచెరువు పనులు 90శాతం పూర్తయ్యాయి. పనులను కాంట్రాక్టర్‌లు నత్తనడకన కొనసాగించడమే కాకుండా నాణ్యతతో కొనసాగించడం లేదని విమర్శలు వస్తున్నాయి. బాన్సువాడ కల్కిచెరువు, బిచ్కుంద మండలంలోని కుమ్మరి చెరువు ట్యాంక్‌బండ్‌ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ పనుల్లోనూ కాంట్రాక్టర్‌లు ప్రణాళిక లేకుండా నాణ్యతా లోపంతో పనులు చేపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.



పనుల పేరిట నిధులు దండుకున్న కాంట్రాక్టర్‌లు

జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు రాష్ట్రప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల కిందట మినీ ట్యాంక్‌బండ్‌లకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణాల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసింది. కానీ, మినీ ట్యాంక్‌బండ్ల నిర్మాణ విషయంలో సంబంధిత కాంట్రాక్టర్‌లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనులు చేశారనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ నిర్మాణాల పేరిట కాంట్రాక్టర్‌లు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా జేబులు నింపుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.


ఒక్కో మినీ ట్యాంక్‌బండ్‌కు రూ.2 కోట్లకు పైగానే నిధులు కేటాయించింది. కానీ కాంట్రాక్టర్‌లు నాసిరకం మెటీరియల్‌తో పనులు చేపట్టడం, చెరువు కట్టవెంట నాణ్యత లేకుండా నిర్మించడం అలుగు నిర్మాణంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోఫణలు వస్తున్నాయి. కోట్లాది నిధులు ప్రభుత్వం వెచ్చించినప్పటికీ కాంట్రాక్టర్‌లు మాత్రం కేవలం లక్షల్లోనే పనులు చేశారని స్థానిక పనులను బట్టి చూస్తే అర్ధమవుతోంది.

Updated Date - 2021-06-12T05:10:36+05:30 IST