వాహనదారుల ఇబ్బందులు తీరేదెన్నడో?

ABN , First Publish Date - 2022-05-28T06:15:55+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారినా ప్రజల, వాహనదారుల అవస్థలు మాత్రం అంతంతమాత్రంగానే తీరుతున్నాయి. ప్రస్తుతం నాలుగు జిల్లాల కూడలిగా ఉన్న ప్రాంతమైన పలుచోట్ల అభివృద్ధి మాత్రం అంతంతే కనిపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

వాహనదారుల ఇబ్బందులు తీరేదెన్నడో?
అశోక్‌నగర్‌ రైల్వే గేటు వద్ద ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

- జిల్లా కేంద్రంగా ఏర్పడిన వాహనదారులకు తప్పని ఇబ్బందులు

- ఇరుకుగా మారిన  రైల్వే వంతెన

- అశోక్‌నగర్‌ వద్ద వంతెన నిర్మాణానికి మోక్షం ఎప్పుడో?

- ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేయాలనే వాదనలు

- కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు

- అశోక్‌నగర్‌ వద్ద రైల్వే బ్రిడ్జి, రైల్వే వంతెనపై ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే తప్ప తప్పని ఇక్కట్లు


కామారెడ్డి టౌన్‌, మే 27: కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారినా ప్రజల, వాహనదారుల అవస్థలు మాత్రం అంతంతమాత్రంగానే తీరుతున్నాయి. ప్రస్తుతం నాలుగు జిల్లాల కూడలిగా ఉన్న ప్రాంతమైన పలుచోట్ల అభివృద్ధి మాత్రం అంతంతే కనిపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని రంగాల్లో పట్టణ ప్రాంతం దూసుకుపోతున్నా పలుచోట్ల వాహనదారులకు కలుగుతున్న ఇబ్బందులపై మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించకపోవడంతో వాహనదారులకు నానా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కామారెడ్డిని  కొత్త, పాత పట్టణంగా విడదీసే విధంగా రైల్వేస్టేషన్‌ ఉండడం పాత పట్టణం వ్యాపారసంస్థలకు అడ్డాగా ఉండడంతో ఏదైనా అవసరమైన వస్తువులను తెచ్చుకోవాలని వెళ్లాలనుకునే ప్రజలకు ఇరుకుగా ఉన్న వంతెనతో పాటు అశోక్‌నగర్‌ కాలనీలో ఉన్న రైల్వేగేట్‌ ద్వారా ఇక్కట్లు తప్పడం లేదు. వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో అర గంటకోసారి పడే రైల్వేగేట్‌తో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పట్టణంలోని పోస్ట్‌ ఆఫీస్‌ వద్ద ఉన్న వంతెన మీద ఏదైనా వాహనం ఆగిపోయినా ఎవరైన ర్యాలీ నిర్వహించినా ఆ దారి గుండా పోవాలంటే వాహనదారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కేవలం చిన్నపాటి కారు మాత్రమే ఓ వైపు నుంచి వెళ్తుందే తప్ప సమాంతరంగా మరో వాహనం వెళ్లే పరిస్థితులు లేవు. పట్టణంలో ఇరుకైన ఈ రెండు ప్రాంతాలపై ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని దృష్టి  సారించకపోవడం పట్ల వాహనదారులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు.

వంతెన నిర్మాణం కలేనా?

పట్టణంలో పోస్టు ఆఫీస్‌ వద్ద ఉన్న బ్రిడ్జి ఒక్కటే ఉండడంతో దూర భారాన్ని తగ్గించుకోవడానికి అడ్లూర్‌తో పాటు పోసానిపేట్‌, రంగంపేట్‌ గ్రామస్థులు, సైలాన్‌బాబా కాలనీ, బతుకమ్మ కుంట, అశోక్‌నగర్‌, జయశంకర్‌ కాలనీలతో పాటు తదితర కాలనీల ప్రజలు పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌ ప్రాంతాలకు వెళ్లాలంటే ఎక్కువ సంఖ్యలో అశోక్‌నగర్‌ కాలనీ వద్ద గల రెల్వేగేట్‌ మార్గంను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించడం వల్ల ప్రజలకు ప్రయాణదూరం తగ్గుతుండడంతో పాటు, ట్రాఫిక్‌ కష్టాలు లేక పోవడంతో ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. కానీ నిత్యం ఎక్కువ సంఖ్యలో రైళ్లు ప్రయాణిస్తుండడం, ప్రతీ అర గంటకోసారి గేటు పడుతుండటంతో 15 నుంచి 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు అడ్లూర్‌ శివారులో ఏర్పడి సంవత్సరం గడుస్తుంది. కొత్త బస్టాండ్‌ వైపు నుంచి కలెక్టరేట్‌కు వచ్చే ఉద్యోగులు సైతం నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించేదెప్పుడో?

కామారెడ్డి జిల్లా కేంద్రంగా మారినప్పటి నుంచి వ్యాపారపరంగా మరింత అభివృద్ధి చెందుతూ వస్తోంది. రోజురోజుకూ వస్త్ర, వ్యాపార సముదాయాలు పెద్దసంఖ్యలో నెలకొంటుండడంతో చుట్టు పక్కల గ్రామాలు, మండలాలతో పాటు ఇతర జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఎక్కువ మొత్తంలో పాత పట్టణంలో వస్త్రవ్యాపార సముదాయాలు, కూరగాయలు, స్టీల్‌ సామాన్లతో పాటు అన్ని రకాల దుకాణ సముదాయాలు ఉండడం ఆ ప్రాంతాలకు చేరాలంటే ఖచ్చితంగా రైల్వేకమాన్‌ను ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తుంటారు. ఈ మార్గంను గతంలో ప్రజలకు అనుగుణంగా నిర్మాణం చేసినప్పటికీ ప్రస్తుతం పెరిగిన జనాభాకు, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారితో నిత్యం ఆ ప్రాంతం నుంచి ప్రయాణించాలంటే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చనిపోయిన వ్యక్తులను తీసుకుపోయిన, ర్యాలీలు, ఊరేగింపులు ఆఖరకు ఓ చిన్నపాటి వాహనం ఆగినా వాహనదారులు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రైల్వేకమాన్‌ విస్తీర్ణం, అశోక్‌నగర్‌ కాలనీ రైల్వేగేట్‌ వద్ద వంతెన నిర్మాణం చేపట్టే విధంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2022-05-28T06:15:55+05:30 IST