టీడీపీ నేతల్ని తిట్టడానికే సభలు పెడుతున్నారా

ABN , First Publish Date - 2022-10-02T06:23:26+05:30 IST

చెరకు రైతుల కోసం ఏం చేస్తున్నారో చెప్పకుండా, టీడీపీ నాయకులను తిట్టడానికే గోవాడ షుగర్స్‌ మహాజన సభను డిప్యూటీ సీఎం బూడి, ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ నిర్వహించినట్టు కనపడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్‌ విమర్శించారు.

టీడీపీ నేతల్ని తిట్టడానికే సభలు పెడుతున్నారా
శిబిరం వద్ద మాట్లాడుతున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగజగదీశ్‌

రైతులకు ఏం చేస్తారో చేతల్లో చూపించండి

చోడవరం, మాడుగుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రండి

డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్‌లకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్దా డిమాండ్‌

డీసీసీబీలో అవినీతిపై త్వరలో సొసైటీల వద్ద ఆందోళన


చోడవరం, అక్టోబరు 1: చెరకు రైతుల కోసం ఏం చేస్తున్నారో చెప్పకుండా, టీడీపీ నాయకులను తిట్టడానికే గోవాడ షుగర్స్‌ మహాజన సభను డిప్యూటీ సీఎం బూడి, ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ నిర్వహించినట్టు కనపడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్‌ విమర్శించారు. శనివారం టీడీపీ ఆందోళనలో ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్‌ల తీరును తప్పుపట్టారు. ఒకపక్క ఫ్యాక్టరీలను మూసివేస్తూ, మరోవైపు గోవాడను ఉద్ధరిస్తామని బూడి, గుడివాడ అమర్‌, ధర్మశ్రీ ప్రకటించడాన్ని ఆయన విమర్శించారు. ప్రభుత్వం చెరకు రైతుల కోసం ఏదో చేస్తుందని ఆశగా ఎదురుచూస్తే, చివరకు రైతులకు పేమెంట్లు ఇవ్వడాన్ని గొప్పగా ఆ పార్టీ నాయకులు చెప్పుకోవడం రైతుల దౌర్భాగ్యమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ నాయకుల్ని తిట్టడం, తిరిగి వారిపైనే కేసులు పెట్టి వేధించడం చేస్తూ దౌర్జన్యపాలన సాగిస్తున్నారన్నారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు రైతుల్ని బెదిరించి రూ.25లక్షలకు కొని, వాటిని ప్రభుత్వానికి రూ.50లక్షలకే అమ్మి  దోచుకుంటున్నారని ఆరోపించారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు డిప్యూటీ సీఎం ఏం చేశారని ప్రశ్నించారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ మూడేళ్లలో వైసీపీ నేతలు చేసింది శూన్యమని విమర్శించారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధికి, ప్రస్తుత పాలనపై బహిరంగ చర్యకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. 

సొసైటీల వద్ద త్వరలో ఆందోళనలు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రూ.15 కోట్లు దుర్వినియోగం అయ్యిందని, దీనిపై విచారణ చేసి సహకార సంఘాల సొమ్మును తిరిగి వెనక్కి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని బుద్దా నాగజగదీశ్‌ తెలిపారు. డీసీసీబీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచాణ జరిపించి, దోషులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే త్వరలో అన్ని సహకార సంఘాల వద్ద ఆందోళనలు నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. 


Updated Date - 2022-10-02T06:23:26+05:30 IST