PM Modi చాలా అహంకారంగా మాట్లాడారు..!

ABN , First Publish Date - 2022-01-04T06:55:20+05:30 IST

మూడు వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడేందుకు తాను ప్రధాని..

PM Modi చాలా అహంకారంగా మాట్లాడారు..!

    • రైతులు నా కోసం చనిపోయారా?
    •        మోదీ ప్రశ్నించారు: మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ 

న్యూఢిల్లీ, జనవరి 3: మూడు వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడేందుకు తాను ప్రధాని మోదీ వద్దకు వెళ్లగా, చాలా అహంకారంతో మాట్లాడారని మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ వెల్లడించారు. హరియాణలోని దాద్రీలో ఆదివారం ఓ కార్యక్రమంలో మాలిక్‌ మాట్లాడుతూ ‘500 మంది రైతులు చనిపోయారు. కనీసం ఓ కుక్క చనిపోయినా మీరు సంతాప లేఖ పంపుతారు కదా! అని నేను అడిగితే.. వారంతా నాకోసం చనిపోయారా? అంటూ ప్రధాని చాలా అహంకారంగా ప్రశ్నించారు. మీరే పాలకుడు కనుక మీ వల్లే వారు చనిపోయారని అన్నాను. దీంతో అమిత్‌షాను కలవమని ప్రధాని చెప్పారు. నేను అమిత్‌షాను కలవగా బాధపడొద్దని, ఆందోళనలు పెరగనివ్వండని అమిత్‌షా అన్నారు’ అని మాలిక్‌ వివరించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించిన రైతులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించాలని కూడా మాలిక్‌ డిమాండ్‌ చేశారు. రైతులకి అన్యాయం జరిగినా, వారి పట్ల అతిగా ప్రవర్తించినా ఆందోళన మళ్లీ మొదలవుతుంది’ అని మాలిక్‌ స్పష్టం చేశారు.


మాలిక్‌ మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే, ఆ వ్యాఖ్యలపై మాలిక్‌ సోమవారం మధ్యాహ్నం వివరణ ఇచ్చారు. ‘సాగు చట్టాలపై మాట్లాడేందుకు నేను ప్రధానిని కలువగా, ఆయన వినేందుకు సిద్ధంగా లేరు. అమిత్‌షాను కలవమని పంపించేశారు. అమిత్‌షాకు మోదీ అంటే గౌరవం ఎక్కువ. ప్రధానిని ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారని అమిత్‌షా చెప్పారు. ఈ విషయాన్ని ఏదో ఒకరోజు ప్రధాని అర్థం చేసుకుంటారని కూడా అన్నారు. ప్రధాని గురించి అమిత్‌షా చెడుగా ఏమీ మాట్లాడలేదు. మీ ఆందోళనను అర్థం చేసుకుంటామని మాత్రమే అమిత్‌షా నాతో అన్నారు’ అని ఓ ఆంగ్ల న్యూస్‌ చానల్‌కు మాలిక్‌ వివరించారు.


కాగా, ప్రధానికి అహంకారం ఎక్కువని మాలిక్‌ అన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ఆ అహంకారమే ప్రజాస్వామ్యంలో ఆందోళనకు కారణమని పేర్కొంది. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ‘గవర్నర్‌ చెప్పినా సరే, నిజాలు వినేందుకు మోదీ సిద్ధంగా లేరు. ఆయనకు కావాల్సింది పొగడ్తలే’ అని విమర్శించారు. కాగా, జమ్మూకశ్మీర్‌ను రెండుగా విడగొట్టినప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్‌గా సత్యపాల్‌ మాలికే ఉన్నారు. ఆ తర్వాత ఆయనను గోవా గవర్నర్‌గా పంపించారు. ప్రస్తుతం మేఘాలయ గవర్నర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఇటీవలి కాలంలో మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.

Updated Date - 2022-01-04T06:55:20+05:30 IST