Jun 14 2020 @ 21:10PM

అర్చన చెప్పిన ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ సంగతులివే

హీరోయిన్ అర్చన పేరు వినగానే ‘శ్రీరామదాసు’ చిత్రంలోని సీత పాత్ర గుర్తుకి వస్తుంది. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎం.ఎస్.రాజు నిర్మించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలోని పాత్ర గుర్తుకి వస్తుంది. ఆ తర్వాత ఎన్నో తెలుగు తమిళ చిత్రాలలో నటించి, ఈ మధ్య బిగ్‌బాస్‌లో ఓ మెరుపు మెరిసిన అర్చన ఇప్పుడు ఎమ్మెన్నార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించబడిన పదహారణాల తెలుగు సినిమా ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’లో హీరోయిన్‌గా చేస్తోంది. మిర్యాలగూడలో జరిగిన అమృత, ప్రణయ్‌ల యదార్ధగాధ ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రంలో అర్చన అమృత పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ అర్చన ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ సంగతులను తెలియజేసింది. అవేంటో చూద్దాం..


హాయ్ అర్చన గారు ఎలా ఉన్నారు?

“చాలా బావున్నాను”


‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ చిత్రంలో నటిస్తున్నారట?

“అవునండీ”


మీరు చేసే రోల్స్ ఆచితూచి ఎన్నుకుంటారని విన్నాం. ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారు?

“ఈ మూవీకి సీనియర్ డైరెక్టర్ నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) గారు దర్శకత్వం వహించటం, గతంలో ఆయన ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్స్‌తో సినిమాలు చేయటం నాకు నచ్చి ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నాను.”


ఈ సినిమాలో మీ పాత్ర గురించి వివరిస్తారా?

“ఈ సినిమాలో నేను అమృత పాత్ర పోషిస్తున్నాను. ఎన్నో భావోద్వేగాలతో కూడుకుని ఉన్న పాత్ర అది. కూతురిగా, ప్రియురాలిగా, ఇల్లాలిగా, చివరకు తల్లిగా ఎన్నో వేరియేషన్స్ చూపించాల్సిన సీరియస్ రోల్ నాకు ఇచ్చారు. నిజ జీవితంలోని ఆ పాత్రలోకి నన్ను నేను పరకాయ ప్రవేశం చేసుకుని ఎంతో హుందాగా నటించాను. దర్శకులు శివనాగుగారు ఎప్పటికప్పుడు లొకేషన్స్‌లో చక్కని సూచనలు ఇస్తూ.. నాలోని మాక్సిమమ్ నటనను రాబట్టుకున్నారు. సినిమా అద్భుతంగా వచ్చింది. మాయమవుతున్న మానవ సంబంధాల ఆవశ్యకతను ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించారు. అందమైన గ్రామీణ వాతావరణంలో కనులవిందు చేసే లొకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరించబడింది. జమున గారు, అన్నపూర్ణగారు, బెనర్జీగారు లాంటి సీనియర్ నటీనటులతో కలిసి నటించటం చాలా సంతోషంగా అనిపించింది. నిర్మాత ఎమ్మెన్నార్ చౌదరిగారు ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమాని భారీగా నిర్మించారు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది, అద్భుత విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను”


“అన్నపూర్ణమ్మ గారి మనవడు” సినిమా ప్రేక్షకులకు చేరేది ఎప్పుడు?

“ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. లాక్‌డౌన్ వల్ల విడుదల ఆగిపోయింది. మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవగానే ఈ సినిమా విడుదల అవుతుంది” అంటూ అర్చన ఈ చిత్ర విశేషాలను చెప్పుకొచ్చింది.

Advertisement