బిల్లుల పంచాయితి

ABN , First Publish Date - 2022-05-26T05:04:13+05:30 IST

పంచాయతీల నిర్వహణ సర్పంచ్‌లకు భారంగా మారుతోంది. ప్రజలకు నాణ్యమైన సేవలందించే క్రమంలో ఉత్సాహంతో చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బిల్లుల పంచాయితి

గ్రామ పంచాయతీలకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో బిల్లులు

అన్ని గ్రామాల్లో అదే దుస్థితి 

అనధికారిక ప్రీజింగ్‌తో ఆగిన నిధులు

సర్పంచ్‌లపై వడ్డీ భారం 

పల్లె ప్రగతికి ముందైనా బిల్లులు క్లియర్‌ చేయాలని విన్నపం


పంచాయతీల నిర్వహణ సర్పంచ్‌లకు భారంగా మారుతోంది. ప్రజలకు నాణ్యమైన సేవలందించే క్రమంలో ఉత్సాహంతో చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు కొన్ని పనుల బిల్లులు అందకపోవడంతో వడ్డీల భారం మోయలేకపోతున్నామని పలువురు సర్పంచులు వాపోతున్నారు. అకౌంట్లలో లక్షల నిధులు కనిపిస్తున్నా, ట్రెజరీల్లో అనధికారిక ఫ్రీజింగ్‌లతో నిధులు డ్రా చేసే పరిస్థితి లేకుండా పోయిందని చెబుతున్నారు. ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, లేదంటే ఆ పనులకు ఆటంకం కలుగుతుందని పలువురు సర్పంచులు బాహాటంగానే చెబుతున్నారు. 

- మహబూబ్‌నగర్‌, ఆంరఽధజ్యోతి ప్రతినిధి


చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్‌లు తలలు పట్టుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఏ పంచాయతీ సర్పంచ్‌ను పలుకరించినా కనీసం రూ.రెండు లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయని తెలుస్తోంది. శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, సీసీ రోడ్లు,  రైతు వేదికలు, మొక్కల పెంపకం వంటి పనులు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేయగా, మిగిలిన డ్రైనేజీలు, ఇతర నిర్మాణాలు, తాగునీటి సరఫరా తదితర రోజువారీ నిర్వహణ పనులను 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, స్థానిక పన్నులు తదితర నిధుల నుంచి చేపడుతున్నారు. ఏ పనైనా పూర్తయిన తర్వాత ఎంబీ రికార్డులు తయారు చేయడానికి మూడు నెలల సమయం పడితే, ఆతర్వాత మరో మూడు నెలలకు చెక్కులు వస్తున్నాయని, ఆ చెక్కులు మారేందుకు ఏడాది నుంచి రెండేళ్ల సమయం పడుతుండడంతో అప్పులపాలు కావాల్సి వస్తోందని పలువురు సర్పంచులు ‘ఆంధ్రజ్యోతి’తో వాపోయారు. పంచా యతీల ఖాతాల్లో నిధులుంటున్నాయని, కానీ డ్రా చేసేందుకు మాత్రం అనుమతించడం లేదని చెబుతున్నారు. ట్రెజరీల్లో అనధికారిక ఫ్రీజింగ్‌ వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. మార్చి నెలాఖరుకు అన్ని బిల్లులకు సంబంధించిన చెక్కులు క్లియరెన్స్‌కు పెడితే, అన్నింటినీ రిజెక్ట్‌ చేశారని, మళ్లీ ఎంబీలు సమర్పించి, చెక్కులు సమర్పించాలని సూచించారని తెలిపారు. ఏప్రిల్‌ నెల మొత్తంతో పాటు ఈ నెల 10 వరకు సైట్‌ ఓపెన్‌ కాలేదని, సర్వర్‌ బిజీ వచ్చిందని అంటున్నారు. ఈ నెల 10 తర్వాత సైట్‌ ఓపెన్‌ అయ్యాక ఎంబీలు అప్‌లోడ్‌ అవుతున్నాయని, కానీ బిల్లులు మాత్రం రావడం లేదని పేర్కొన్నారు.


లక్షల్లో పెండింగ్‌ బిల్లులు

పాలమూరు ఉమ్మడి జిల్లాలోని ఏ పంచాయతీని పరిశీలించినా రూ.రెండు లక్షలు మొదలుకొని రూ.30 లక్షల వరకు పెండింగ్‌ బిల్లులు పేరుకుపోయాయి. గండీడ్‌ మండలం వెన్నచేడ్‌  పంచాయతీకి రూ.9.63 లక్షల బిల్లు లు రావాలని, రెండు నెలల నుంచి బిల్లులు లేకపోవడంతో మల్టీ పర్పస్‌ వర్కర్లకు, కరెంటు బిల్లులకు, డీజిల్‌కు చెల్లింపుల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆ గ్రామ సర్పంచ్‌ తెలిపారు. రైతు వేదికకు సంబంధించి రూ.9.10 లక్షల బిల్లు పెండింగ్‌లోనే ఉందని చెప్పారు.

హన్వాడ మండలం బుద్ధారంలో నాలుగు నెలల కింద ట నిర్మించిన డ్రైనేజీకి సంబంఽ దించి రూ.ఆరు లక్షల బిల్లులు రావాల్సి ఉన్నాయి. 

నవాబుపేట మండలం తీగలపల్లిలో రూ.33 లక్షల వరకు పెండింగ్‌లో ఉన్నాయని ఆ సర్పంచ్‌ తెలి పారు. సర్పంచ్‌గా ఎన్నికయ్యాక మొదట రెండెకరాల భూమి అమ్మామని, ఇప్పుడు మరో రెండు ఎకరాలు అమ్మి ఈ పనులకు వెచ్చిం చామని చెప్పారు. గ్రామంలో పేరుకోసం సర్పం చ్‌గా ఎన్నికైతే ఇన్ని అవస్థలు పడాల్సి వస్తోందని వాపోయారు.

నారాయణపేట జిల్లా కోటకొండ పంచాయతీని పరిశీలిస్తే ఇక్కడ ఏడాది క్రితం వేసిన వీధి దీపాల బిల్లులు రూ.4.50 లక్షలు, సీసీ రోడ్లుకు సంబంధించి రూ.ఐదు లక్షలు, ఐదు నెలల కింద వేసిన డ్రైనేజీలకు సంబంధించి రూ.ఆరు లక్షలు, ఏడాది క్రితం పూర్తయిన రైతు వేదిక, శ్మశానవాటికలకు సంబంధించి రూ.1.12 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆ గ్రామ సర్పంచ్‌ చెప్పారు. ఇతర పనులన్నీ కలిపితే దాదాపు రూ.20 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

సీసీకుంట మండలం దమగ్నాపూర్‌లో రూ.14.70 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం ధర్మాపూర్‌లో రూ.24 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. 

ఉట్కూరు మండలం చిన్నపొర్లలో మొత్తం రూ.32 లక్షల బిల్లులు రావాల్సి ఉందని ఆ గ్రామ సర్పంచ్‌ తెలిపారు. దామరగిద్ద మండలం మల్‌రెడ్డిపల్లిలో సీసీరోడ్లకు సంబం ధించి రూ.27 లక్షల బిల్లులు పెండింగ్‌ ఉన్నా యని సర్పంచ్‌ వెల్లడించారు. పాలమూరులో ప్రతీ పంచాయతీలో పెండింగ్‌ బిల్లులు పేరుకుపోయాయని తెలుస్తోంది. అప్పులు చేసి పనులు చేయించామని, వడ్డీల భారంతో ఇబ్బంది పడుతున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


బిల్లులు క్లియర్‌ చేయాలి

చేసిన పనులకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో వడ్డీల భారం ఎక్కువవుతోంది. ఎప్పటి బిల్లులు అప్పుడు క్లియర్‌ చేస్తే మరింత ఉత్సాహంగా పనులు చేయగలుగుతాం.

- విజయలక్ష్మి, కోటకొండ సర్పంచ్‌, నారాయణపేట జిల్లా


అకౌంట్‌ ప్రీజింగ్‌ వల్లే..

మా పంచాయతీకి రూ.27 లక్షల బిల్లులు రావాలి. పంచాయతీ అకౌంట్‌లో నిధులున్నా, ఫ్రీజింగ్‌ వల్ల డ్రా చేయలేకపోతున్నాం. తక్షణం బిల్లులు ఇవ్వాలి.

- చంద్రం, మల్‌రెడ్డిపల్లి సర్పంచ్‌, దామరగిద్ధ మండలం


ఆర్థిక భారం పడుతోంది 

మాకు దాదాపు రూ.19 లక్షల వరకు బిల్లులు రావాలి. ఒక్కో పనికి సంబంధించి ఏడాదిన్నర వరకు బిల్లులు రాకపోతే ఇబ్బంది కలుగుతోంది. పెండింగ్‌ పెరిగే కొద్ది ఆర్థిక భారం మోయలేకపోతున్నాం.

- పుల్లారెడ్డి, వెన్నచేడ్‌ సర్పంచ్‌, గంఢీడ్‌ మండలం


భూములు అమ్మి పనులు చేయిస్తున్నాం 

 బిల్లులు సకాలంలలో రాకపోవడంతో వడ్డీల భారం ఎక్కువవుతోంది. మాకు ఇప్పటికీ రూ.32 లక్షల వరకు బిల్లులు రావాలి. రెండు దఫాలుగా నాలుగు ఎకరాలు అమ్మాం. బిల్లులు పెండింగ్‌ లేకుండా ఇస్తే మరిన్ని పనులు చేయాలని ఉంది.

- జంగయ్య, తీగలపల్లి సర్పంచ్‌, నవాబుపేట మండలం 


బిల్లులు చెల్లిస్తేనే పనులు చేపడతాం

ఏడాదిన్నర నుంచి బిల్లుల పెండింగ్‌ కొనసాగుతోంది. రూ.32 లక్షల బిల్లులు రావాలి. చిన్నాచితక పనులు చేయలేని పరిస్థితి దాపురించింది. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తేనే త్వరలో చేపట్టే పల్లెప్రగతి పనులు చేపడతాం. లేకపోతే ఆ కార్యక్రమాన్ని నిర్వహించం. 

- రవీందర్‌రెడ్డి, నారాయణపేట జిల్లా సర్పంచుల సంఘం సహాయ కార్యదర్శి


కొత్త పనులు ఎలా చేపట్టాలి 

పంచాయతీలకు రూ.లక్షల్లో పెండింగ్‌ బిల్లులున్నాయి. మా పంచాయతీలో దాదాపు రూ.15 లక్షల బిల్లులు రావాలి. ఈ బిల్లులు చెల్లించకుండా మళ్లీ కొత్తపనులు ఎలా చేపడతాం. అప్పులు చేసి మరీ పనులు చేయించాం. ప్రభుత్వం ప్రీజింగ్‌ ఎత్తేసి తక్షణం బిల్లులు విడుదల చేయాలి. అప్పుడే కొత్త పనులు చేయగలం.

- హనుమంతరెడ్డి, దమగ్నాపూర్‌ సర్పంచ్‌, సీసీకుంట మండలం 


బిల్లులు చెల్లించాలి 

మా పంచాయతీకి ఇంకా రూ.24లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు పెండింగ్‌ ఉండటంతో వడ్డీలకు తెచ్చి ఆ పనులు చేయించాం. ఏడాది వరకు బిల్లులు రాకపోతే పనులు ఎలా నిర్వహిస్తాం. అకౌంట్‌లో నిధులున్నా ప్రీజింగ్‌ వల్ల బిల్లులు రావడం లేదు. తక్షణం ప్రీజింగ్‌ తొలగించి బిల్లులు విడుదల చేయాలి.

- శ్రీనివాస్‌రెడ్డి, ధర్మాపూర్‌ సర్పంచ్‌, మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం

Updated Date - 2022-05-26T05:04:13+05:30 IST