వాణిజ్య వివాదాల పరిష్కారంలో ‘మధ్యవర్తిత్వ విధానం’ ఉత్తమం : CJI NV Ramana

ABN , First Publish Date - 2022-07-06T03:34:43+05:30 IST

వాణిజ్య ప్రపంచంలో వివాదాల పరిష్కారానికి ‘మధ్యవర్తిత్వ విధానం’ (Arbitration mechanism) అత్యుత్తమై

వాణిజ్య వివాదాల పరిష్కారంలో ‘మధ్యవర్తిత్వ విధానం’ ఉత్తమం : CJI NV Ramana

లండన్ : వాణిజ్య ప్రపంచంలో వివాదాల పరిష్కారానికి ‘మధ్యవర్తిత్వ విధానం’ (Arbitration mechanism) అత్యుత్తమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) ఎన్‌వీ రమణ(NV Ramana) అభిప్రాయపడ్డారు. సంప్రదాయకమైన న్యాయ ప్రక్రియలకు మధ్యవర్తిత్వం సమర్థవంతమైన ప్రత్యమ్నాయమని వ్యాఖ్యానించారు. వివాదంలో  పక్షాలు(Parties) గతంలో అంగీకారం తెలిపిన నిబంధనల ప్రకారమే ప్రాథమిక నియంత్రణ ఉంటుందని ఆయన చెప్పారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ ఏకాభిప్రాయం, గోప్యతతో కూడినదని, ఫలితానికి కట్టుబడి ఉండాలని ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. యూకే పర్యటనలో ఉన్న ఆయన లండన్‌ నగరంలో జరిగిన ‘ఆర్బిట్రేటింగ్ ఇండో - యూకే కమర్షియల్ డిస్ప్యూట్స్’  అంశంపై మాట్లాడారు. వాణిజ్య, వ్యాపార అంశాల్లో అవరోధాలను అధిగమించేందుకు భారత్ తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.


మధ్యవర్తిత్వ చట్టాలకు సంబంధించిన సమస్యలపై కూలంకుష చర్చకు న్యాయ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఫిక్కీ(FICCI), ఐసీఏ(Indian Council of arbitration) ప్రతినిధులను సీజే ఎన్‌వీ రమణ మెచ్చుకున్నారు. భారత్‌ను పెట్టుబడిదారులు, వ్యాపారాల గమ్యస్థానంగా మార్చేందుకు ఫిక్కీ, ఐసీఏ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్(ICA) దక్షిణాసియాలో ప్రధాన వ్యవస్థల్లో ఒకటి ఉందని ప్రస్తావించారు. దీని ద్వారా సత్వరంగా, చౌకగా న్యాయం దక్కుతోందన్నారు.


ఇక యూకే(United Kingdom), భారత్(India) వాణిజ్య బంధాలను పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం యూకేకి భారత్ 12వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిందని గుర్తుచేశారు. 2020లో 14.9 బిలియన్ పౌండ్లను భారత్‌లో యూకే పెట్టుబడి పెట్టిందని గుర్తుచేశారు. ఇదే సమయంలో యూకేలో భారత్‌ 10.6 బిలియన్ పౌండ్ల పెట్టుబడులు పెట్టిందని ఎన్‌వీ రమణ ప్రస్తావించారు. ఇరుదేశాల మధ్య ఇటివలే కుదిరిన ఎఫ్‌టీఏ(Free trade agreement) భవిష్యత్ పెట్టుబడుల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-07-06T03:34:43+05:30 IST