బరితెగించారు

ABN , First Publish Date - 2021-04-15T05:06:06+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ పేరిట కొందరు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనధికారిక లేఅవుట్లు వేసి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ల్యాండ్‌ కన్వర్షన లేకుండానే పంటలు పండే భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేసి అమాయకులకు అంటగడుతున్నారు.

బరితెగించారు
పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో అనుమతి లేని లేఅవుట్లు

ఇష్టారాజ్యంగా అనధికార లేఅవుట్లు

ల్యాండ్‌ కన్వర్షన లేకుండానే వ్యవసాయ భూముల్లో స్థిరాస్తి వ్యాపారం

ఇదీ పెండ్లిమర్రిలో తీరు

పెండ్లిమర్రి, ఏప్రిల్‌ 14: రియల్‌ ఎస్టేట్‌ పేరిట కొందరు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అనధికారిక లేఅవుట్లు వేసి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ల్యాండ్‌ కన్వర్షన లేకుండానే పంటలు పండే భూముల్లో స్థిరాస్తి వ్యాపారం చేసి అమాయకులకు అంటగడుతున్నారు. పెండ్లిమర్రి మండలంలో అడ్డు అదుపులేకుండా అడ్డగోలుగా అనుమతులు లేని లేఅవుట్లు జోరుగా వెలుస్తున్నాయి. కడప - పులివెందుల ప్రధాన రహదారికి ఇరువైపులా చాలా గ్రామాల్లో ఇటీవల పుట్టగొడుగుల్లా లే అవుట్లు పుట్టుకొస్తున్నాయి.


కొప్పర్తి పేరుతో..

కొప్పర్తి పారిశ్రామికవాడలో పలు కంపెనీలు స్థాపిస్తున్నారని అవి ఏర్పాటైతే అందులో పనిచేసేవారికి నివాసగృహాలు అవసరమని రియల్టర్లు ప్రచారం మొదలుపెట్టారు. పారిశ్రామికవాడకు ఈ ప్రాంతం దగ్గరగా ఉండడంతో అక్కడ పనిచేసే ఉద్యోగులు ఇక్కడ నివాసం ఉండేందుకు మొగ్గు చూపుతారు. ఇప్పుడైతే ధరలు తక్కువగా ఉన్నాయి. పరిశమ్రలు పెడితే ఇక్కడ సెంటు స్థలం కూడా లక్షల్లో పోతుందని రియల్టర్లు జనానికి చెప్పి నమ్మిస్తున్నారు. రియల్టర్ల మాటలు నమ్మి కొందరు అగ్రిమెంట్లపైనే ప్లాట్లు కొనేస్తున్నారు. సోగలపల్లెలో సుమారు 3 ఎకరాల్లో వెంచర్లు వెలిశాయు. నంది మండలంలో 4 వెంచర్లు, వెల్లటూరులో 20 ఎకరాల్లో 4 వెంచర్లు, పాతసంగటిపల్లెలో, ఇసుకపల్లెలో రెండు ఎకరాల్లో రెండు వెంచర్లు, రంపతాడులో 50 ఎకరాల్లో 2 వెంచర్లు వెలిశాయి. ఇవన్నీ ప్రధాన రహదారికి దగ్గరగా ఉన్న గ్రామాలే.


ల్యాండ్‌ కన్వర్షన లేకుండానే..  

వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోవాలంటే ల్యాండ్‌ కన్వర్షన చేయించుకోవాలి. అయితే చాలా మటుకు ల్యాండ్‌ కన్వర్షన లేకుండానే లేఅవుట్లు వేశారు. లేఅవుట్లలో కూడా గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం 30 అడుగుల రహదారులు, అంతర్గత రహదారులు, విద్యుత, సాగునీరు, డ్రైనేజీతో పాటు పాఠశాలలు, ఆటస్థలం, మందిరాలు, పార్కులు, కమ్యూనిటీ హాల్స్‌కు 10 శాతం స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. అంటే ఎకరా లేఅవుట్‌ వేస్తే 10 శాతం గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన చేయించాల్సి ఉంది. అయితే చాలావరకు ఆ నిబంధనలు పాటించకుండా రంగురాళ్లు పాతి లేఅవుట్లు వేస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఫీజు చెల్లించకుండానే లే అవుట్లు వేస్తున్నారు. నంది మండలంలో సెంటు రూ.లక్ష పలుకుతుండగా వెల్లటూరులో రూ.2 నుంచి 3 లక్షలు ధర పలుకుతోంది. రిజిస్టేష్రన లేకుండా అగ్రిమెంట్ల పైనే క్రయవిక్రయాలు సాగుతున్నాయి. వెల్లటూరులో అనుమతి లేని లేఅవుట్లకు పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసినా రియల్టర్లు లెక్క చేయడంలేదంటే వారు ఎంతకు బరి తెగించారో అర్థమవుతుంది. లే అవుట్ల పేరుతో బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు కొందరు రియల్టర్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అక్రమ లే అవుట్లపై అఽధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


అనుమతి లేకుండా లేఅవుట్లు వేస్తే చర్యలు

- తహసీల్దారు ఉదయభాస్కర రాజు

ల్యాండ్‌ కన్వర్షన లేకుండా వ్యవసాయ భూముల్లో లేఅవుట్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి లే అవుట్‌కు గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ల్యాండ్‌ కన్వర్షన కోసం 11 దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేస్తే తొలగిస్తాం.


కాలువలు, చెరువుపై కన్ను 

చిట్వేలి, ఏప్రిల్‌ 14: చిట్వేలి మండలంలో చెరువులు, పంట కాలువలు, ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. మట్లిరాజుల కాలంలో రైతుల కోసం ఎల్లమరాజు చెరువును నిర్మించారు. ఈ చెరువు జిల్లాలోని అతి పెద్ద 2వ చెరువుగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇటీవల చిట్వేలిలో రియల్‌ఎస్టేట్‌ జోరందుకోవడంతో సెంటు స్థలం లక్షల్లో పలుకుతోంది. దీంతో ఆక్రమణదారులు చెరువు ప్రధాన కాలువలను సైతం ఆక్రమించే యత్నాలు మొదలుపెట్టారు. చిట్వేలిలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఎల్లమరాజు చెరువు ప్రధాన కాలువను ఆక్రమించేందుకు ప్రతిరోజూ రాత్రి పూట మట్టిని తోలి చదును చేస్తున్నారు. అలాగే చిట్వేలి-రాపూరు ప్రధాన రహదారి తిమ్మాయపాలెం క్రాస్‌లో ఉన్న దత్తగిరి నారాయణ తపోవనం ఆశ్రమం వద్ద ప్రభుత్వ స్థలంలో పూరిగుడిసె వేసి ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లమరాజు చెరువు సైతం కొంతమేర ఆక్రమణకు గురైందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డిని వివరణ కోరగా ఆక్రమించిన స్థలంలో పూరిగుడిసెలు తొలగించి స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


అటవీ భూమి ఆక్రమణ

సిద్దవటం, ఏప్రిల్‌12: సిద్దవటం మండలం ఉమ్మడిగుంటపల్లె గ్రామ నేకనాపురం పంచాయతీ కొండ ప్రాంతంలో కొంతమంది రెండు జేసీబీలు ఉపయోగించి భూ కబ్జాకు పాల్పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రంవరకు ఇక్కడ జేసీబీలతో పని చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. డబ్బు పలుకుబడి, రాజకీయ అండదండలు ఉన్న వారికి మాత్రమే భూములను అప్పగిస్తారని పేద ప్రజలకు వ్యవసాయం చేసుకునేందుకు సెంటు భూమికూడా ఇవ్వడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దారు రమాకుమారిని వివరణ కోరగా నేకనాపురం సమీపంలోని సర్వే నెంబర్‌ 295లోని అటవీభూమిలో జేసీబీతో పనులు చేశారని ఆ భూమికి రెవెన్యూకు సంబంధం లేదని తెలిపారు. దీనిపై ఫారెస్ట్‌ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై సిద్దవటం రేంజర్‌ ప్రసాద్‌ని వివరణ కోరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


గుట్టలు పిండి చేసి..

గాలివీడు, ఏప్రిల్‌ 14: గాలివీడులో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. వెలిగల్లు రిజర్వాయర్‌ పరిసర ప్రాంతంలోని కుడికాలువ గుట్టలు, గుర్రాలమిట్ట, దయ్యాలమడుగు, గండిమడుగు గుట్టలు, తూముకుంట గుట్టలను కొందరు చదును చేసి.. స్వాధీనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాయచోటి- కదిరి ప్రధాన రహదారిలో గుర్రాలమిట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుట్టలను చదును చేసి ఇప్పటికే అక్రమ నిర్మాణాలను పూర్తి చేశారు. మరికొందరు తప్పుడు పత్రాలతో విలువైన భూములను యంత్రాల సాయంతో రాత్రికి రాత్రే చదును చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. గండిమడుగు పుణ్యక్షేత్రం, నాలుగులేన్ల హైవే ప్రతిపాదనలు, వెలిగల్లు రిజర్వాయర్‌ పర్యాటక ప్రాంతం ఇలా అన్నింటికీ అనుకూలంగా ఉండడంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఆక్రమణదారుల ఆగడాలు శృతిమించిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గాలివీడు డిప్యూటీ తహసీల్దార్‌ తిమ్మారెడ్డిని వివరణ కోరగా.. మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఆరోపణలు వస్తున్న స్థలాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-04-15T05:06:06+05:30 IST