ఇష్టారాజ్యంగా నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-06-24T04:55:57+05:30 IST

జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
కామారెడ్డి పట్టణ ముఖచిత్రం

- పట్టణాల్లో అడ్డగోలుగా కొనసాగుతున్న భవన నిర్మాణాలు
- కొత్త మున్సిపల్‌ చట్టాన్ని సైతం లెక్కచేయని వైనం
- నిబంధనలు పాటించకుండా అపార్ట్‌మెంట్‌లు, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు
- కనీసం వాహనాల పార్కింగ్‌కు స్థలాలూ వదలని పరిస్థితి
- అక్రమ నిర్మాణాలకు నేతల అండదండలు
- ఒత్తిళ్లతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న బల్దియా అధికారులు
- అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీ ఉత్తదేనా?


కామారెడ్డి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో ఇష్టారాజ్యంగా భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఆయా పట్టణాల్లో కొత్తకొత్త కాలనీలు వెలుస్తుండడం, మున్సిపాలిటీ అంతకు అంతగా విస్తరిస్తుండడంతో భవన నిర్మాణాల సంఖ్య సైతం పెరుగుతోంది. అపార్ట్‌మెంట్‌ల కల్చర్‌ సైతం చాలానే వచ్చింది. అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం గత ఏడాది కిందట కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అమలు చేసింది. కానీ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఈ చట్టం అమలు కావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇటు పాలకవర్గాలు దృష్టి సారించకపోవడం అటు అధికారులు పట్టించుకోకపోవడంతో పట్టణాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణలు కొనసాగుతున్నాయి. మూడు మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న 93 దరఖాస్తులను బల్దియా అధికారులు తిరస్కరించినప్పటికీ ఆ నిర్మాణాలు కొనసాగుతునే ఉన్నాయి. స్థానిక నేతల అండదండలతో అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయా మున్సిపాలిటీలకు రావాల్సిన ఆదాయం సమకూరడం లేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేసినా అది కాగితాలకే పరిమితమైనట్లు తెలుస్తోంది.
టీఎస్‌ బీపాస్‌కు భారీగా దరఖాస్తులు
రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాల అనుమతుల కోసం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ విధానం అమలవుతునే ఉంది. ఆయా పట్టణాల్లో ఎవరైన నిర్మాణాలు చేపట్టాలంటే అనుమతి కోసం మీ సేవలోని టీఎస్‌ బీపాస్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల నుంచి భవన నిర్మాణాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి మున్సిపాలిటీలో 798 దరఖాస్తులు రాగా ఇందులో 711కు అనుమతి ఇవ్వగా 86 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. బాన్సువాడలో 51 దరఖాస్తులు రాగా ఇందులో 44 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా 7 దరఖాస్తులను తిరస్కరించారు. ఎల్లారెడ్డిలో 48 దరఖాస్తులు రాగా 40 భవనాలకు అనుమతులు ఇవ్వగా 8 దరఖాస్తులను తిరస్కరించారు. కొత్త మున్సిపల్‌ చట్టం నిబంధనల ప్రకారం 120 గజాల స్థలం ఉన్నవారు ఇళ్లు కట్టుకోవాలంటే 1.5 మీటర్ల సెట్‌బ్యాక్‌ వదలిపెట్టాలి. రోడ్డు 30 అడుగులు ఉంటే ఇరువైపుల 5 అడుగుల చొప్పున స్థలాన్ని మున్సిపాలిటీకి అటాచ్‌ చేయాలి. ప్రధాన రహదారి అయితే ఈ సెట్‌ బ్యాక్‌ మూడు మీటర్లు ఉండాలి. ఇందుకు విరుద్ధంగా రోడ్డు చివరి అంచు వరకు నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో బల్దియాలో పార్కింగ్‌ స్థలాలు కనిపించడం లేదు. హోటల్‌లు, ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలు, పాఠశాలలు, కళాశాలల నిర్మాణాలు అయితే నూతన చట్టం ప్రకారం 25 శాతం స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఎక్కడా కూడా అమలు కావడం లేదు.
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయకపోవడంతో జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో జీప్లస్‌ 2, జీప్లస్‌ 3, జీప్లస్‌ 4 అనుమతి తీసుకుని నిర్మించుకుంటున్న ఇళ్ల మీద నీళ్ల ట్యాంకుల నిర్మాణం పేరుతో అదనపు స్లాబ్‌లు వేస్తున్నారు. వాస్తవానికి ట్యాంక్‌ నిర్మిస్తే దాని కింద ఇంటి నిర్మాణం ఉండకూడదు. ఉంటే అదనపు గదిగా పరిగణిస్తారు. దీంతో దాని అక్రమ కట్టడం కింద లెక్క కడతారు. ఇలా అనుమతి ఒకలా తీసుకుంటూ నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు. ఇక చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఇక అపార్ట్‌మెంట్‌, వాణిజ్య, వ్యాపార సముదాయాల నిర్మాణాలు చాలా మట్టుకు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారు. పార్కింగ్‌ కోసం వదిలిపెడుతున్న సెల్లార్‌లను మడిగలుగా ఏర్పాటు చేసి కమర్షియల్‌గా ఉపయోగిస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకుండా చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది.
అక్రమ నిర్మాణాలకు నేతల అండదండలు
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో సాధారణ కొత్త ఇళ్ల నిర్మాణాలతో పాటు భారీ అంతస్తుల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీల నుంచి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు. కానీ కొందరు ఇళ్ల యజమానులు, బిల్డర్‌లు, వ్యాపారవేత్తలు మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆయా వార్డులలో అక్రమ నిర్మాణాలు జరగడానికి నేతల అండదండలు ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపల్‌ నుంచి అనుమతులు తీసుకోకపోవడమే కాకుండా కనీసం నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. మున్సిపాలిటీలకు చెందిన డ్రైనేజీ, రోడ్లను కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నట్లు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. కానీ స్థానిక నేతల ఒత్తిళ్లతో అధికారులు వెనుకడుగు వేస్తుండడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినా అక్రమ నిర్మాణాలు నిర్వహించినా వాటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం పలు శాఖల అధికారులతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను ఏర్పాటు చేసింది. కానీ ఆ ఎన్‌పోర్స్‌మెంట్‌ అధికారులు ఇప్పటి వరకు ఏ ఒక్క అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అసలు ఆ కమిటీలు ఉన్నాయా లేక కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా అనే వాదన వినిపిస్తోంది.

Updated Date - 2021-06-24T04:55:57+05:30 IST