యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

ABN , First Publish Date - 2022-06-27T04:55:38+05:30 IST

దర్శి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను గ్రామాలకు తరలించి కొంతమంది అక్రమార్కులు నిత్యం వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
ఇసుకను ట్రాక్టర్‌లోకి నింపుతున్న కూలీలు ... ఇసుక తవ్వకంతో రూపురేఖలు కోల్పోయిన వాగు ...

వాగుల్లో నుంచి తోడేస్తున్న అక్రమార్కులు

పట్టించుకోని అధికారులు 

దర్శి, జూన్‌ 26 : దర్శి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.  ట్రాక్టర్ల ద్వారా ఇసుకను గ్రామాలకు తరలించి కొంతమంది అక్రమార్కులు నిత్యం వేలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అనేక వాగుల నుంచి ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నప్పటికీ సెబ్‌ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు.   ముడుపులు తీసుకుంటూ అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముసి నదిలో పలుచోట్ల ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. దర్శి-పొదిలి మండలాల మధ్య ఈ నది ఉండటంతో ఇరు మండలాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు ఇసుక అక్రమ వ్యాపారం చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎర్రోబనపల్లి, గణేశ్వరపురం వద్ద  వాగు నుంచి రోజూ డజన్ల కొద్దీ ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నాయి. అదేవిధంగా రాజంపల్లి వద్ద నదిలో రాజంపల్లి, ఉన్నగురువాయపాలెం గ్రామాలకు చెందిన కొంతమంది ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పెద్ద ఉయ్యాలవాడ వద్ద  ఇసుకను జోరుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దోర్నపువాగులోని ఇసుకను బొట్లపాలెం వద్ద పలువురు అక్రమార్కులు గ్రామాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా మారెళ్ల, గంగన్నపాలెం, జమ్మలమడక గ్రామాల వద్ద గుండ్లకమ్మ నదిలో, తమ్మలూరు వద్ద చిలకలేరు వాగులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ప్రభుత్వ భూముల్లో, పట్టాభూముల్లో ఇసుకను అనుమతులు లేకుండా విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. 

ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరుతో..  

 అక్రమార్కులు ప్రభుత్వ కార్యాలయాలు, జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్నారు. అధికారుల నుంచి ఒక పర్మిట్‌ తీసుకొని అదే పర్మిట్‌తో నెలల తరబడి వాగుల్లో ఇసుకను తోడేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలు అడిగినప్పుడు పర్మిట్ల ద్వారా ఇసుక తోలుతున్నామని చెబుతున్నారు. ఈ విషయం గమనించిన రెవెన్యూ అధికారులు కొద్దిరోజుల క్రితం ఎర్రోబనపల్లి వద్ద దాడులు నిర్వహించగా అక్రమంగా తరలిస్తు న్న ఏడు ఇసుక ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. అదేవిధంగా ఆ ట్రాక్టర్లకు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు అధికారులు నామమాత్రపు పెనాల్టీలు వేసి వదిలేశారు. ఆ మరుసటి రోజే దోర్నపువాగులో అక్రమంగా ఇసుక తరలిస్తూ మరో రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. వీరికి నామమాత్రపు జరిమానా వేసి వదిలేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన సెబ్‌ అధికారులు మా త్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. కొద్దిరోజుల క్రితం నదిలో ఇసుక ఎత్తుతున్న ట్రాక్టర్ల వద్దకు వెళ్లి కొంతమంది మైనింగ్‌ అధికారుల మంటూ చెప్పి వేలాది రూపాయలు వారి వద్ద నుంచి తీసుకున్నట్లు తెలిసింది.  ఉన్నతాధికారులు స్పందించి పటిష్ఠ చర్యలు తీసుకోకపోతే వాగుల్లోని ఇసుకను పూర్తిగా తోడేసే ప్రమాదముంది.




Updated Date - 2022-06-27T04:55:38+05:30 IST