యథేచ్ఛగా ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2022-01-28T05:30:00+05:30 IST

రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సాక్షిగా గోదావరి దోపిడీకి గురవుతున్నది..

యథేచ్ఛగా ఇసుక దోపిడీ

- గోలివాడ గోదావరి నుంచి 80 ట్రాక్టర్లలో నిరంతర తరలింపు

- నాలుగు ఠాణాలు.. రెండు తహసీల్దార్‌ కార్యాలయాలు దాటి ప్రయాణం

- అక్రమ రవాణా మాపరిధి కాదంటున్న పోలీస్‌, రెవెన్యూ అధికారులు

- సాండ్‌ ట్యాక్సీకి లేని ‘గిరాకీ’

గోదావరిఖని, జనవరి 28: రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సాక్షిగా గోదావరి దోపిడీకి గురవుతున్నది.. ఇసుక మాఫియా గోలివాడ తీరంలో గోదావరిని దోచేస్తున్నది... ఒకటి కాదు, రెండు కాదు రోజూ 80ట్రాక్టర్లు పగలు, రాత్రి తేడా లేకుండా గోదావరి నుంచి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాయి. నాలుగు పోలీస్‌ స్టేషన్లు, రెండు తహసీల్దార్‌ కార్యాలయాలు దాటి ఇసుక నిరాటంకంగా అక్రమ రావాణా జరుగుతోంది. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం మాత్రం అక్రమ రావాణా తమ పరిధి కాదంటున్నారు. మైనింగ్‌శాఖ పత్తా లేకుండా పోయింది. 

అంతర్గాం మండలం గోలివాడ శివారు నుంచి అంతర్గాం, ముర్మూర్‌, గోలివాడకు చెందిన సుమారు 80ట్రాక్టర్లను అక్రమ దందాలో వినియోగిస్తున్నారు. సాండ్‌ మాఫియా సిండికేట్‌ పెట్టి ప్రతినిధులను నియమించుకున్నారు. తమ అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగించేందుకు ట్రాక్టర్‌కు నెలకు రూ.30వేల చొప్పున ఖర్చులకు వసూళ్లు చేసుకుంటున్నారు. నెలకు రూ.20లక్షల నుంచి రూ.25లక్షలు మామూళ్ల నిధిని ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నమే ట్రాక్టర్లు గోదావరినదిలో దిగడం, రాత్రి 7గంటలు అయ్యిందంటే ఎన్‌టీపీసీ, గోదావరిఖని, జగిత్యాల, ధర్మపురి ప్రాంతాలకు రావాణా చేస్తున్నారు. గోలివాడ నుంచి గోదావరిఖని వరకు అంతర్గాం, రామగుండం, ఎన్‌టీపీసీ ఠాణాల ముందు నుంచి గోదావరిఖని ఠాణా పరిధికి చేరుస్తున్నారు. అలాగే అంతర్గాం, రామగుండం తహసీల్దార్‌ కార్యాలయాలు కూడా దాటే అక్రమ రవాణా జరుగుతోంది. సాయంత్రం 7గంటల నుంచి తెల్లవారు 6గంటల వరకు రోజుకు ఒక్కో ట్రాక్టర్‌ నాలుగు ట్రిప్పులు ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది.

- రోజుకు రూ.10లక్షల మేర...

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల యజమానులు రోజంతా నిర్మాణదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నారు. గోదావరిఖనిలో నిర్మాణదారుల అవసరాన్ని బట్టి ట్రిప్పుకు రూ.3000 నుంచి రూ.3500 వసూలు చేస్తున్నారు. ఒక్కో రోజు గోదావరి నుంచి 300 నుంచి 400ట్రిప్పుల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. రూ.10లక్షల అమ్మకాలు జరుగుతున్నాయి. 

- సాండ్‌ ట్యాక్సీ పాలసీ నిర్వీర్యం..

ఇసుక అక్రమ రవాణాను నిరోధించి సామాన్యులకు అందుబాటు ధరలో పారదర్శకంగా ఇసుకను అందించేందుకు అప్పటి జిల్లా కలెక్టర్‌ అలుగు వర్షిణి జిల్లాలో సాండ్‌ ట్యాక్సీ విధానానికి రూపకల్పన చేశారు. దీనిని ప్రభుత్వం రాష్ట్రమంతా అమలులోకి తీసుకువచ్చింది. జిల్లాలో వందల సంఖ్యలో ట్రాక్టర్ల యజమానులు సాండ్‌ ట్యాక్సీలో రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. ఒక్క ముర్మూర్‌ క్వారీకే 498మంది ట్రాక్టర్ల యజమానులు రూ.25వేల చొప్పున డిపాజిట్లు చెల్లించి రిజిష్టర్‌ చేసుకున్నారు. ఆరేళ్లుగా కోటి రూపాయలకుపైగా సొమ్ము జిల్లా యంత్రాంగం వద్ద డిపాజిట్‌ అయి ఉంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న ఇసుకను సాండ్‌ ట్యాక్సీ ట్రాక్టర్ల ద్వారా వినియోగదారులకు రావాణా చేయాల్సి ఉంటుంది. ఇసుక అక్రమ రవాణాతో సాండ్‌ ట్యాక్సీలో బుకింగ్‌లు పడిపోయాయి. సాండ్‌ ట్యాక్సీలో బుకింగ్‌లతో రెండు మూడు రోజులకు ఇసుక అందుబాటులోకి వస్తే అక్రమ రవాణా దారులు రాత్రికి రాత్రి అవసరాన్ని ఇసుకను రవాణా చేస్తున్నారు. దీంతో సాండ్‌ ట్యాక్సీలో బుకింగ్‌లు పడిపోయాయి. ఆర్డర్లు రాక 500మంది ట్రాక్టర్ల యజమానులు రోడ్డున పడ్డారు. 

గోలివాడ నుంచి ఇసుక అక్రమ రవాణా ఇక్కడి పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాలకు తెలియని దందేమీ కాదు... ఠాణాలు, కార్యాలయాల ముందు నుంచి యథేచ్ఛగా పోతున్నా పట్టింపు ఉండదు. పైగా తమ పరిధి కాదంటూ, మైనింగ్‌శాఖ డ్యూటీ అంటూ చేతులెత్తుతున్నారు. మైనింగ్‌ శాఖ అధికారులు, సిబ్బంది పత్తాలేని పరిస్థితే ఉంది. సాధారణంగా ఇసుక అక్రమ రవాణా విషయంలో పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగాలు కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు సైతం ఉన్నాయి.

-  నిఘా నేత్రాల సాక్షిగా..

ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానమంటూ పోలీస్‌శాఖ గ్రామగ్రామాన ప్రచారం చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో విరివిరిగా సీసీ కెమెరాలను  ఏర్పాటు చేశారు. అంతర్గాం నుంచి గోదావరిఖని వరకు ప్రతీ ఊరు, ప్రతివాడ, కూడలిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ అక్రమ రవాణా అంతా సీసీ కెమెరాల్లో ‘బంధీ’ అవుతూనే ఉన్నాయి. అయినా కూడా వీటిని అడ్డుకోలేకపోతున్నది. 

-  కలెక్టర్‌పైనే భారం...

గోలివాడ కేంద్రంగా గోదావరిలో జరుగుతున్న దోపిడీపై సాండ్‌ ట్యాక్సీ యజమానులు సైతం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ ఉపాధికి భంగం కలుగుతుందంటూ 500మంది మొర పెట్టుకున్నారు. మీదే భారమంటూ కలెక్టర్‌కు విన్నవించారు. ఇసుక అక్రమరవాణాను ఆపి సాండ్‌ ట్యాక్సీ ద్వారా ప్రభుత్వ ఖాజానాకు ఆదాయం  చేకూర్చడం, 500మంది ఉపాధిని కాపాడడం అంతా కలెక్టర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.


Updated Date - 2022-01-28T05:30:00+05:30 IST