గాలిలో నిబంధనలు

ABN , First Publish Date - 2021-10-20T05:34:51+05:30 IST

-శ్రీకాకుళంలోని బలగ సమీపంలో ఓ పెట్రోలు బంకులో వాహనాల టైర్లకు గాలి కొట్టే యంత్రం కనిపిస్తుంటుంది. తీరా అక్కడికి వెళితే... సిబ్బంది లేరని..గాలి కొట్టడం కుదరదని అక్కడి సిబ్బంది చెబుతారు. మరికొన్ని బంకుల్లో గాలికొట్టే యంత్రాలే కనిపించవు. జాతీయ రహదారిపై ఉన్న బంకుల వద్ద గాలి కొట్టే యంత్రాలు ఉన్నా...సమీపంలో షెడ్ల కింద టైర్లకు పంక్చర్లు వేసే వారి వైపు చూపిస్తారు. అక్కడికి వెళితే వారు ఎంత చెబితే అంత వదిలించుకోవాలి.

గాలిలో నిబంధనలు
శ్రీకాకుళం రామలక్ష్మణ్‌ జంక్షన్‌ వద్ద బంకులో పనిచేయని వాటర్‌ ట్యాంకర్‌


ఇష్టారాజ్యంగా పెట్రోల్‌ బంకుల నిర్వహణ

ధనార్జనే ధ్యేయం

కానరాని సౌకర్యాలు, సేవలు

మంచినీటి సౌకర్యం లేని బంకులెన్నో

అధికారుల తూతూమంత్రపు తనిఖీలు

 (శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

ఓవైపు పెట్రోలు కల్తీ ... మరోవైపు కొలతల్లో తేడాలు...అంతేకాకుండా కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం...ఇదీ జిల్లాలోని అధికశాతం పెట్రోలు బంకుల్లో పరిస్థితి. ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించవు. త్వరగా గమ్యం చేరాలనే వినియోగదారుడి ఆరాటం...అవగాహన లోపం... బంకుల యాజమాన్యాలకు కలసివస్తోంది. ఇదే కల్తీకి...నిబంధనలు పాటించకపోవడానికి ఊతమిస్తోంది.

-శ్రీకాకుళంలోని బలగ సమీపంలో ఓ పెట్రోలు బంకులో వాహనాల టైర్లకు గాలి కొట్టే యంత్రం కనిపిస్తుంటుంది. తీరా అక్కడికి వెళితే... సిబ్బంది లేరని..గాలి కొట్టడం కుదరదని అక్కడి సిబ్బంది చెబుతారు. మరికొన్ని బంకుల్లో గాలికొట్టే యంత్రాలే కనిపించవు. జాతీయ రహదారిపై ఉన్న బంకుల వద్ద గాలి కొట్టే యంత్రాలు ఉన్నా...సమీపంలో షెడ్ల కింద టైర్లకు పంక్చర్లు వేసే వారి వైపు చూపిస్తారు. అక్కడికి వెళితే వారు ఎంత చెబితే అంత వదిలించుకోవాలి. ఇదీ పెట్రోలు బంకుల వద్ద వినియోగదారుల పరిస్థితి. వాస్తవానికి బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలే కాదు. వాహన చోదకుడికి అవసరమైన ఎన్నో రకాల సేవలు అందుబాటులో ఉండాలి. అత్యవసర, అనారోగ్య సమయాల్లో ప్రథమ చికిత్స కిట్లు ఉంచాలి. పెట్రోల్‌ నాణ్యత నిర్థారణకు ‘పేపర్‌ ఫిల్టర్‌ టెస్ట్‌’ చేయాలి. మరుగుదొడ్లు, వాష్‌రూమ్‌లను పరిశుభ్రంగా ఉంచాలి. వాహనాల టైర్లకు ఉచితంగా గాలి ఎక్కించాలి..ఇవన్నీ ఫిల్లింగ్‌ స్టేషన్ల (పెట్రోల్‌ బంకులు)లో తప్పనిసరి. కానీ జిల్లాలో ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. జిల్లావ్యాప్తంగా 125 ఫిల్లింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. కొన్ని బంకుల్లో అయితే కనీసం మంచి నీరు కూడా దొరకదు. పెట్రోల్‌ పోయించుకొని క్షణాల్లో ముందుకెళ్లాల్సిందే. లేకుంటే అక్కడి సిబ్బంది చిందులేస్తారు. ‘ఇష్టముంటే పెట్రోల్‌ వేయించుకోండి..లేకుంటే వెళ్లిపోండి’ అంటూ హుకుం జారీచేస్తారు. పెట్రోల్‌ బంకుల నిర్వహణ నిబంధనల విషయం చాలామందికి తెలియదు. అక్కడి సిబ్బందికి కూడా అవగాహన లేదు. ధనర్జానే ధ్యేయంగా బంకు యాజమాన్యాలు ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. అధికారులు కూడా తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతుండడంతో బంకుల యాజమాన్యాల దోపిడీకి హద్దే లేకుండా పోతోంది.  

 దాహం కేకలు

ప్రధానంగా బంకుల వద్ద తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడా శుభ్రత పాటించిన దాఖలాలు లేవు. సాధారణ నీటినే ట్యాంకర్లలో వేసి చేతులు దులుపుకుంటున్నారు. మినరల్‌ వాటర్‌ను కొన్ని బంకులే అందుబాటులో ఉంచుతున్నాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులు ఉన్నవి కొన్నే. అవి కూడా వాహన చోదకులకు ప్రవేశం ఉండదు. నిబంధనల మేరకు నిర్మించిన యాజమాన్యాలు సొంత అవసరాలకు, సిబ్బందికే ఉపయోగిస్తున్నాయి. ఎవరైనా అత్యవసర సమయాల్లో అడుగుతుంటే బయటికి వెళ్లిపోండి అంటూ అక్కడున్న సిబ్బంది బదులిస్తున్నారు. టైర్లకు ఉచితంగా గాలి కొట్టాల్సి ఉన్నా...కేవలం కొద్ది బంకుల్లోనే అమలవుతోంది. 

 తనిఖీల ఊసే లేదు

వాస్తవానికి ఏరోజుకారోజు బంకుల వద్ద పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రదర్శించాలి.  పెట్రోల్‌, డీజిల్‌లో నాణ్యత కొరవడితే ఏ అధికారికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని సంప్రదించాలి? వంటి ఫోన్‌ నంబర్ల వివరాలు నోటీసు బోర్డులో ఉంచాలి. కానీ కొద్ది బంకుల్లోనే ఇటువంటివి పాటిస్తున్నారు. వాస్తవానికి తమ పరిధిలో ఉండే బంకులను తూనికలు కొలతల శాఖ అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ సిబ్బంది నిత్యం తనిఖీ చేయాలి. సంబంధిత ఆయిల్‌ కంపెనీ ప్రతినిధి సైతం సందర్శిస్తుండాలి. పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షిస్తుండాలి. కానీ ఇవేవీ జిల్లాలో జరగడం లేదు. అసలు తనిఖీలే ఉండవు. ఎక్కడైనా ఆరోపణలు వచ్చినా... వాహనదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినా అధికారులు హడావుడి చేస్తున్నారు. తరువాత ఆ మాటే మరిచిపోతున్నారు. అసలు జిల్లాలో తూనికలు, కొలతల శాఖ ఒకటి ఉందన్న విషయమే తెలియడం లేదు. బయటకు సిబ్బంది కొరత అని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కానీ నెలనెలా మామూళ్లు  అందడం వల్లనే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  

 ఆరు రకాల సేవలు తప్పనిసరి

బంకుల వద్ద ఆరు రకాల సేవలు అందుబాటులో ఉండాలి. లేకుంటే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవచ్చు. వినియోగదారుడికి ఇబ్బందులు తలెత్తితే డీలర్‌షిప్‌ కూడా రద్దు చేసే అవకాశముంది. కానీ ఈ సేవలపై వినియోగదారులకు అవగాహన ఉండడం లేదు.

1. పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యతను సరిచూసుకోవచ్చు. బంకుల వద్ద ఫిల్టర్‌ పేపర్‌ టెస్ట్‌ అందుబాటులో ఉంచాలి. ఆ పేపరుపై రెండు మూడు చుక్కలు పెట్రోల్‌ వేస్తే అది ఆవిరైపోతే నాణ్యత కలిగినదిగా గుర్తించవచ్చు. అదే మరకలుగా మిగిలిపోతే కల్తీ జరిగినట్టు నిర్థారించవచ్చు. 

2. సాధారణంగా పెట్రోల్‌ బంకులకు సమీపంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అటువంటి సమయంలో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అవసరం. అందుకే బంకుల వద్ద తప్పనిసరిగా ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లు అందుబాటులో ఉంచాలి. 

3. అత్యవసర, అనారోగ్య సమయాల్లో సమాచారం అందంచేందుకు బంకుల వద్ద ఫోన్‌ అందుబాటులో ఉంచాలి. అటువంటి పరిస్థితుల్లో వచ్చిన వారికి అన్నివిధాలా అండగా నిలవాలి. 

4. దూర ప్రాంత ప్రయాణికుల కోసం మరుగుదొడ్లు, స్నానపు గదులు అందుబాటులో ఉంచాలి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చూసుకునే బాధ్యత యాజమాన్యాలదే. 

5. దాహంతో వచ్చేవారికి తప్పకుండా నీరందించాలి. ఇందుకుగాను పరిశుభ్రమైన వాటర్‌ ఫిల్టర్‌ను ఏర్పాటుచేయాలి. ప్రయాణికులు, వాహన చోదకుల దాహార్తిని తీర్చడమే కాకుండా నీరు బయటకు తీసుకెళ్లేందుకు అవకాశమివ్వాలి. 

6. వాహనాలకు సంబంధించి టైర్లకు గాలిని ఉచితంగానే కొట్టాలి. ఇందుకు ఎటువంటి రుసుం తీసుకోకూడదు. ఎక్కడైనా సిబ్బంది డబ్బులు డిమాండ్‌ చేస్తే యాజమాన్యం చర్యలకు ఉపక్రమించాలి. కానీ సిబ్బంది కొరత సాకుగా చూపుతోనో... యంత్రం సరిగా పనిచేయదనే పేరుతోనో ఎక్కడా గాలిని ఉచితంగా కొట్టే అవకాశం ఉండడం లేదు. 


Updated Date - 2021-10-20T05:34:51+05:30 IST