యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల్లో ఇటుక బట్టీల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-06-20T05:00:29+05:30 IST

పెందుర్తిలోని ప్రభుత్వ స్థలాల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు అవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల్లో ఇటుక బట్టీల ఏర్పాటు
ఇటుక బట్టీ

ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహణ

రాజకీయ నాయకుల అండదండలు

పట్టించుకోని అధికారులు


పెందుర్తి, జూన్‌ 19: పెందుర్తిలోని ప్రభుత్వ స్థలాల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు అవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పేదలు పూరిళ్లు వేసుకుంటే ప్రతాపం చూపే అధికారులు ఇసుక బట్టీల వ్యవహారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉండడమే దీనికి కారణమనే విమర్శలున్నాయి. పెందుర్తి సర్వే నంబరు 201లో గల 1.25 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నాలుగేళ్లుగా ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారి సమీపంలో గల ఈ స్థలాన్ని తప్పుడు పత్రాలతో ఆక్రమించి బట్టీ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. అలాగే పెందుర్తి సర్వే నంబరు 191లోని సుమారు రెండెకరాల ప్రభుత్వ స్థలంలో బట్టీ నిర్వహిస్తున్నారు. జుత్తాడ సర్వే నంబరు 65లోని మూడు ఎకరాల ప్రభుత్వ భూమిలో బట్టీ నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా వీటిని నిర్వహిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.

నిబంధనలు గాలికి..

వ్యవసాయ భూములతో పాటు మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ భూముల్లో వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నందుకు నాలా సుంకాన్ని రెవెన్యూకి చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి వీటిని ఏర్పాటు చేయాలంటే కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి, భూగర్భ గనులు, రెవెన్యూ, భూగర్భ జల వనరుల శాఖ అధికారుల అనుమతులు తీసుకోవాలి. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే మండలంలోని పలు గ్రామాల్లో సుమారు పదుల సంఖ్యలో బట్టీలు నిర్వహిస్తున్నారని ఇటీవల అధికారులు గుర్తించారు. కాగా వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తూ ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతం, చెరువుల నుంచి ఇటుకకు కావాల్సిన మట్టిని నిర్వా హకులు అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిసింది.

ప్రభుత్వ ఆదాయానికి గండి

అక్రమంగా మట్టిని తరలించి ఇటుకల తయారీకి వినియోగించడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. లక్ష ఇటుకలు తయారు చేస్తే సుమారు రూ.8 వేల వరకు రాయల్టీ కింద చెల్లించాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కానీ ఇటుక బట్టీల నిర్వాహకులు చెల్లించడం లేదని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహించే ఇటుక బట్టీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

చర్యలు తీసుకుంటాం

ఇటుక బట్టీల నిర్వహణకు సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వ స్థలాల్లో ఇటుక బట్టీల ఏర్పాటుపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. అక్రమ ఇటుక బట్టీల నిర్వహణపై ఆరా తీస్తాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

                        - పైల రామారావు, తహసీల్దార్‌, పెందుర్తి



Updated Date - 2021-06-20T05:00:29+05:30 IST