యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

ABN , First Publish Date - 2022-06-16T04:53:13+05:30 IST

శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
అనుమతులు లేకుండా పెంట్‌ హౌజ్‌ నిర్మాణం

  • ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌
  • నిద్రమత్తులో అధికారులు


శంకర్‌పల్లి, జూన్‌ 15 : శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలు యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లను కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్థులు నిర్మాణం చేపడుతూ ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడంటం లేదు.

ప్రభుత్వం  అనుమతి లేకుంటే అక్రమ కట్టడాలను నిర్మిస్తే చర్యలు తీసుకోవాలని సూచించినా అధికారులు మాత్రం నిద్రమత్తు వదలడం లేదు. అక్రమ కట్టడాలపై మున్సిపల్‌ కమిషనర్లు నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి అక్రమ కట్టడాలను గుర్తించాల్సింది పోయి.. కార్యాలయాల కుర్చీలకే పరిమితం అవుతున్నారు. కిందిస్థాయి మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు అక్రమంగా నిర్మిస్తున్న గృహ యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ అక్రమ కట్టడాల గురించి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కాలనీ వాసులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఫిర్యాదు చేసినా నామమాత్రపు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాస్తూ కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పార్కింగ్‌ లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, గృహ యాజమానులు రోడ్లపైనే కార్లను పార్కింగ్‌ చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జీప్ల్‌సటూకె అనుమతి తీసుకొని కొందరు బహుళ అంతస్థుల నిర్మాణం చేపడుతున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు, కాసులకు కక్కుర్తి పడి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే.. కొందరు అక్రమార్కులు వారిష్టాను సారం రోడ్లను కబ్జాలు చేస్తూ గృహనిర్మాణాలు చేపడుతున్నారు. మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్లు బహుళ అంతస్థులు వేసి యధేచ్ఛగా అద్దెకు ఇచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు  కార్యాలయాల నుంచి బయటకు వచ్చి అక్రమ నిర్మణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై కొరఢా ఝుళిపించాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. 


అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం 

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన అధికారులు మా మాటను వినడం లేదు. మున్సిపల్‌ కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కార్యాలయాలకే పరిమితమై అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై ప్రభుత్వానికి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.

- విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌


అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం

 అక్రమ నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పరిధిని మించి నిర్మిస్తే నోటిసులు జారీచేసి వాటిని కూల్చి వేస్తాం. ఎవరైనా అక్రమ కట్టడాలు చేపడితే మా దృష్టికి తీసుకురావాలి. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టాలి. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.

- యాదగిరి, మున్సిపల్‌ కమిషనర్‌



Updated Date - 2022-06-16T04:53:13+05:30 IST