ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వకాలు

ABN , First Publish Date - 2022-01-24T05:24:21+05:30 IST

‘‘అధికారమే మాకు అండగా ఉంది... మేమేంటి అనుమతులు తీసుకునేది. మా ఇష్టం వచ్చిన చోట, మాకు కావాల్సినంత గ్రావెల్‌ను అడ్డంగా తోలుకుంటాం. ప్రభుత్వానికి పైసా కూడా పన్ను కట్టం. ఇది మా రాజ్యం’’ అంటూ కావాల్సినంత గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ తవ్వకాలు
గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకుంటున్న రెవెన్యూ, పోలీసు సిబ్బంది

రెవెన్యూ, పోలీసుల అడ్డగింత 

అయినా లెక్క చేయని వైనం 

పెండ్లిమర్రి, జనవరి 23: ‘‘అధికారమే మాకు అండగా ఉంది... మేమేంటి అనుమతులు తీసుకునేది. మా ఇష్టం వచ్చిన చోట, మాకు కావాల్సినంత గ్రావెల్‌ను అడ్డంగా తోలుకుంటాం. ప్రభుత్వానికి పైసా కూడా పన్ను కట్టం. ఇది మా రాజ్యం’’ అంటూ కావాల్సినంత గ్రావెల్‌ను తవ్వేస్తున్నారు. అనుమతులు లేకుండా చేపట్టిన తవ్వకాలు నిలిపివేయాలంటూ రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం ఆదేశించినా తగ్గేదేలా... అంటూ తవ్వుకుంటున్నారు. ఒక టిప్పరో టిప్పర్లో కాదు. సుమారు 600 టిప్పర్ల గ్రావెల్‌ను అనుమతులు లేకుండా తవ్వుకొని రోడ్డు వేస్తున్నారు. మండల పరిధిలోని తుమ్మలూరు వద్ద పాపాగ్ని నదిలో ఇసుక తవ్వకాలకు జేపీ వెంచర్స్‌ సంస్థ అనుమతి తెచ్చుకుంది. అనుమతి రాకముందే ఇక్కడ జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఇక్కడ ఇసుక తవ్వకాలు అనుమతిస్తే భూగర్భజలాలు అడుగంటుతాయంటూ తుమ్మలూరు, చాబలి, కొండూరు, బుడ్డాయపల్లితో పాటు మరి కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. క్వారీ వద్ద వస్తున్న రోడ్డు పనులు అడ్డుకున్నారు. అయినా ఇక్కడ రోడ్డు పనులు సాగుతున్నాయి. ఇసుక క్వారీ దగ్గరకు రోడ్డు వేసేందుకు అనుమతి లేకుండానే గ్రావెల్‌ను తోలుతున్నారు. తుమ్మలూరు రెవెన్యూ పొలం సర్వే నెంబర్‌ 628, చాబలి రెవెన్యూ పొలం సర్వే నెంబర్‌ 320 లోని భూముల నుంచి గ్రావెల్‌ను తోలుతున్నారు. ఒక్కో టిప్పర్‌కు రాయల్టీ ధర ప్రభుత్వానికి రూ.1800 దాకా చెల్లించాల్సి ఉంది. అయితే పైసా చెల్లించకుండా సుమారు 600 టిప్పర్ల గ్రావెల్‌ను తవ్వేసి దర్జాగా రోడ్డు వేస్తున్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్‌ ఉదయ్‌భాస్కర్‌రాజు దృష్టికి తీసుకెళ్లగా గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు లేవన్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు అందిన వెంటనే సిబ్బందిని పంపించి తవ్వకాలు నిలిపేశామన్నారు.




Updated Date - 2022-01-24T05:24:21+05:30 IST