ఇష్టారాజ్యంగా ఒప్పందాలు!

ABN , First Publish Date - 2021-10-27T05:44:04+05:30 IST

జిల్లాలో ఎర్రజొన్న పంట సాగు వ్యాపారుల చేతుల్లోకి వెళ్తోంది. యాసంగిలో వరి పంట వేయొద్దని.. ఆరుతడి పంటలే సాగుచేయాలని ప్రభుత్వం ప్రకటించడంతో ఎర్రజొన్న విత్తన వ్యాపారులు సిండికేట్‌ అయి రైతులతో గ్రామాలలో ఇష్టారాజ్యంగా ఒప్పందాలు చేసుకుంటూ విత్తనాలు సరఫరా చేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా ఒప్పందాలు!

సిండికేట్‌ అయిన ఎర్రజొన్న విత్తన వ్యాపారులు

ధర తగ్గించి రైతులతో ఒప్పందాలు

విత్తనాల ధరను సైతం పెంచిన వైనం

తప్పనిసరిగా బైబ్యాక్‌ పద్ధతిలో ఒప్పందాలు చేసుకోవాలంటున్న యంత్రాంగం

జిల్లాలో ఈసారి పెరగనున్న ఎర్రజొన్న సాగు

నిజామాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ఎర్రజొన్న పంట సాగు వ్యాపారుల చేతుల్లోకి వెళ్తోంది. యాసంగిలో వరి పంట వేయొద్దని.. ఆరుతడి పంటలే సాగుచేయాలని ప్రభుత్వం ప్రకటించడంతో ఎర్రజొన్న విత్తన వ్యాపారులు సిండికేట్‌ అయి రైతులతో గ్రామాలలో ఇష్టారాజ్యంగా ఒప్పందాలు చేసుకుంటూ విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఎర్రజొన్న సాగు చేసే రైతులు తప్పనిసరిగా బైబ్యాక్‌ పద్ధతిలో ఒప్పందాలు చేసుకోవాలని కలెక్టర్‌, వ్యవసాయ శాఖ అధికారులు సూచించినా కొన్ని గ్రామాల్లో కొనసాగడం లేదు. వ్యాపారులు చెప్పినవిధంగా నే ఒప్పందాలు చేసుకుంటున్నారు. 

పదిహేను రోజులుగా ఒప్పందాలు

జిల్లాలో ఈ సంవత్సరం ఎక్కువమంది రైతులు ఎర్రజొ న్న సాగుకు మొగ్గుచూపుతున్నారు. గత సంవత్సరం ఈ పంటకు డిమాండ్‌ భారీగా ఉండడంతో ఈ సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన పదిహేను రోజులుగా విత్తన వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే, గత సంవత్సరం ఎర్రజొన్నకు డిమాండ్‌ ఉండి ఆశా జనకంగా ధర వచ్చింది. కానీ, ఈ ఏడాది మాత్రం వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. విత్తనాల ధర పెంచడంతో పాటు ఒప్పందం కూడా ధర తగ్గించి చేసుకుంటున్నారు. గత సంవత్సరం క్వింటాల్‌కు రూ.3వేల నుంచి రూ.3,500ల వరకు ఒప్పందం చేసుకోగా.. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.2,500లకే చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. గత సంవత్సరం ఎకరం విత్తనంకు 500ల రూపాయలు వసూలు చేయగా.. ఈ సంవత్సరం మాత్రం 800ల రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే, ఒప్పందంలో భాగంగా ఎర్రజొన్న సాగు పూర్తయిన తర్వాత కొనుగోలు సమయంలో సంచికి ఆరు కిలోల కడ్తా తప్పనిసరిగా తీస్తామని ఒప్పందంలో రాసుకుంటున్నారు. డబ్బులు సైతం పంట విక్రయిచిన నెలనుంచి నెలన్నర తర్వాతే చెల్లిస్తామని ఒప్పందంలో పేర్కొంటున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌ అయి ధర పెంచకపోవడంతో రైతులు చేసేదేమీ లేక ఒప్పందాలు చేసుకుంటున్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈయేడు కూడా పూర్తిస్థాయిలో ఒప్పందాలు చేసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి రైతులకు సూచించినా నామమాత్రంగానే ఒప్పందాలు జరుగుతున్నాయి. ఈ పంటకు మద్దతు ధర లేకపోవడం, వ్యాపారులపై ఆధారపడి సాగు చేస్తుండడంతో ముందుగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ నెలాఖరు నుంచి నవంబరు చివరి వరకు పంట వేయనుండడంతో ఈ ఒప్పందాలు కొనసాగిస్తున్నారు. 

18 మండలాల పరిధిలో సాగవుతున్న పంట

జిల్లాలో ప్రతీ సంవత్సరం 18 మండలాల పరిధిలో రైతులు ఎర్రజొన్న పంటను సాగు చేస్తున్నారు. గత 40 సంతవ్సరాలుగా ఇది కొనసాగుతోంది. జిల్లాలోని నందిపేట, ఆర్మూర్‌, జక్రాన్‌పల్లి, బాల్కొండ, ముప్కాల్‌, మెండోరా, ఏర్గట్ల, మోర్తాడ్‌, భీంగల్‌, వేల్పూర్‌, కమ్మర్‌పల్లి మండలాల పరిధిలోని 185 గ్రామాల్లో సుమారు 50వేల ఎకరాల వరకు ఎర్రజొన్నను సాగు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఎర్రజొన్న సాగు మొదట ఆర్మూర్‌కే పరిమితమైనా.. ఆ తర్వాత ఇతర మండలాల్లోనూ రైతులు సాగు చేయడం మొదలుపెట్టారు. పొరుగున ఉన్న నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని మండలాల పరిధిలో కూడా ఎర్రజొన్నను సాగుచేస్తున్నారు. 

వ్యాపారుల కనుసన్నల్లోనే పంట సాగు

గడ్డి విత్తనాలుగా పిలవబడే ఎర్రజొన్నకు ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అక్కడి పశువులకు వాడే చొప్ప కోసం ఈ విత్తనాలను వినియోగిస్తారు. ఈ రాష్ట్రాలకే కాకుండా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దేశాలకు కూడా ఈ విత్తనాలను సరఫరా చేస్తారు. అయితే, ఈ ఎర్రజొన్న పంట సాగు డీలర్లు, విత్తన వ్యాపారుల కనుసన్నల్లోనే సాగుతోంది. ప్రతీ యేడు యాసంగి సీజన్‌ ప్రారంభ సమయంలో రైతులు విత్తన వ్యాపారులతో ఒప్పందాలు చేసుకొని.. విత్తనాలు తీసుకొని పంటను వేస్తున్నారు. పంట పండించిన తర్వాత వ్యాపారులకు విక్రయిస్తున్నారు. విత్తనాలు ఇచ్చే సమయంలోనే వ్యాపారులు ధరను నిర్ణయిస్తారు. పంట పండిన తర్వాత ఒప్పందం ప్రకారం రైతులు అదే ధరకు వ్యాపారులకు విక్రయిస్తారు. మరికొంతమంది రైతులు ధర ఎక్కువగా ఉంటే ఇతర వ్యాపారులకు సైతం అమ్ముతున్నారు. ఒప్పందం చేసుకున్న వ్యాపారులకు కొద్ది మొత్తంలో విక్రయించి ఎక్కువ మొత్తంలో ఇతర వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

ఎర్రజొన్న సాగుచేసే ప్రతి రైతు తప్పనిసరిగా బైబ్యాక్‌ పద్ధతిలో ఒప్పందాలు చేసుకోవాలని జేడీఏ గోవింద్‌ తెలిపారు. రైతులు ఒప్పందాలు లేకుండా పంట సాగు చేస్తే విక్రయ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన తెలిపారు. ఒప్పంద వివరాలను తమ శాఖ ఏఈవోలకు కూడా అందించాలని ఆయన సూచించారు. 

Updated Date - 2021-10-27T05:44:04+05:30 IST