యథేచ్ఛగా కబ్జా

ABN , First Publish Date - 2022-05-24T05:30:00+05:30 IST

దర్శి పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలు, శివార్ల వద్ద విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకొని స్వాహా చేస్తున్నారు.

యథేచ్ఛగా కబ్జా
ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమార్కులు వేసిన బోరు

ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను

కోట్లాది రూపాయల స్థలం స్వాహాకు తాజా యత్నం

దర్శి, మే 24: దర్శి పట్టణంలో విలువైన ప్రభుత్వ స్థలాలు, శివార్ల వద్ద విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఆక్రమించుకొని స్వాహా చేస్తున్నారు. కొందరు ఆ భూముల్లో నిర్మాణాలు చేసి అద్దెకు సైతం ఇస్తున్నారు. తాజాగా విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు పలువురు ప్రయత్నాలు ప్రారంభించారు. దర్శి-అద్దంకి రోడ్డులోని 340/5 సర్వేనెంబర్‌లో 20సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి సెంటు రూ.10లక్షల విలువ చేస్తుంది. ఆ భూమిని ఆక్రమించుకునేందుకు గతంలో కొంతమంది బోరు వేసి కంచె కూడా వేశారు. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు పరిశీలించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కొద్దిరోజులకు ఆ బోర్డులు మాయమయ్యాయి. అక్రమార్కులు వేసిన బోరు అలాగే ఉంది. ఆ స్థలాన్ని తాజాగా మరికొందరు స్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దర్శిలో కొందరితో పాటు కురిచేడు మండలానికి చెందిన అధికారపార్టీ నాయకుడు ఆ భూమిని స్వాహా చేసేందుకు రెవెన్యూ అధికారులతో రాయబేరాలు చేసినట్లు సమాచారం. కాగా గతంలోనే ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌ వరకుమార్‌తో ఈ విషయంపై చర్చించారు. రికార్డుల్లో వారి పేర్లు ఎక్కించుకునేందుకు ముడుపులు మాట్లాడుకున్నారు. కురిచేడు మండలం పొట్లపాడు రెవెన్యూలోని 80ఎకరాల ప్రభుత్వభూమిని ఏకంగా ఇద్దరు వ్యక్తులకు ఆన్‌లైన్‌ చేసి పాసుపుస్త్తకాలు మంజూరు చేసిన విషయంపై ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత అక్రమార్కుల ప్రయత్నాలకు కొంతగ్యాప్‌ ఏర్పడింది. ఇటీవల దర్శి నూతన తహసీల్దార్‌గా ఏవీ రవిశంకర్‌ బాధ్యతలు స్వీకరించి విధులు నిర్వహిస్తున్నారు. ఆ స్థలం తమకు కట్టబెట్టాలని అక్రమార్కులు తాజాగా తహసీల్దార్‌ను కూడా కోరినట్లు సమాచారం. ఆయన ససేమిరా అనడంతో అక్రమార్కులు ఏం చేయాలో పాలుపోక అధికారపార్టీ పెద్దల చేత ఒత్తిడి చేయిస్తున్నట్లు తెలిసింది. 


ఎన్నెస్పీ భూమికి ఎసరు

ఇదిలావుండగా గతంలో ఎన్నెస్పీ శాఖకు కేటాయించిన భూమిని కొంతమంది అక్రమార్కులు స్వాహా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సాగర్‌ కాలువల నిర్మాణం సమయంలో దర్శి రెవెన్యూలో 323/3, 328, 329, 330, 331, 332/2 సర్వేనెంబర్లల్లో 30ఎకరాల భూమిని రైతులకు అప్పట్లో నష్టపరిహారం చెల్లించి ఎన్నెస్పీ కాలనీ నిర్మించేందుకు భూసేకరణ చేసుకున్నారు. ఇప్పటివరకు ఆ భూమి వారి ఆధీనంలోనే ఉంది. అయితే అందులోని 332/2 సర్వేనెంబర్‌లో ఎకరా యాభైసెంట్ల భూమి ఖాళీగా ఉంది. ఆ భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. పూర్వపు రికార్డుల్లో ఆ భూమి పట్టాభూమిగా ఉందని అందువలన ఇది ఎన్నెస్పీకి  సంబంధం లేదని వాదిస్తూ ఆ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. తాజా రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నది. ఈ విషయాన్ని అక్రమార్కులు పట్టించుకోకుండా స్వాహా చేసేందుకు ప్రయత్నాలు  చేస్తున్నారు. ఆ స్థలాన్ని విక్రయించేందుకు అనధికారికంగా బ్రోచర్‌ తయారు చేసి ప్లాట్లుగా విభజించి బేరం పెట్టినట్ల్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఎన్నెస్పీ అధికారులు తమ శాఖ తీసుకున్న 30ఎకరాల భూమిని కొలిచి హద్దులు ఏర్పాటుచేయాలని రెవెన్యూ అధికారులకు లేఖ పంపారు. తమ భూమి నిర్థారణ అయిన తర్వాత కంచె ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ భూమిని కొలిచి హద్దులు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. 


మార్జిన్‌ ఆక్రమించి షాపుల నిర్మాణం

అదేవిధంగా దర్శి-పొదిలి రోడ్డులో రోడ్డు మార్జిన్‌ పోరంబోకు భూమిని ఆక్రమించి పలువురు షాపులు నిర్మించి అద్దెలకు ఇస్తున్నారు. ఈ స్థలం కూడా సెంటు రూ.10లక్షలకుపైగా విలువ చేస్తుంది. రెండు ఎకరాలకుపైగా రోడ్డు మార్జిన్‌ పోరంబోకును అనేకమంది ఆక్రమించుకొని దుకాణాలు, గృహలు కూడా నిర్మించుకున్నారు. కొందరైతే షాపులు నిర్మించి వాటిని అధికధరలకు విక్రయించారు. మరికొందరు అద్దెలకు ఇచ్చి ప్రతినెలా వేలు సంపాదించుకుంటున్నారు. ఎంతో విలువైన స్థలాలు, భూములు ఆక్రమణలకు గురవుతుండటంతో ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


ఆక్రమణలు వాస్తవమే: తహసీల్దార్‌

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై తహసీల్దార్‌ ఏవీ రవిశంకర్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా.. కొంతమంది అక్రమార్కులు ఆక్రమణలకు ప్రయత్నిస్తున్న మాట వాస్తవమేనన్నారు. దర్శి-అద్దంకి రోడ్డులోని 340/5లో గల 20సెంట్లు ప్రభుత్వభూమేనన్నారు. 332/2 సర్వేనెంబర్‌లోని ఎకరా యాభైసెంట్లు భూమి నీటి పారుదల శాఖకు చెందినదన్నారు. ఈ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. నీటి పారుదల అధికారుల సూచనల మేరకు వారి కింద ఉన్న భూములను కొలిపించి హద్దులు ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి స్వాహాచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-05-24T05:30:00+05:30 IST