Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నక్సల్స్‌తో చర్చల ఆలోచన నాది కాదు

twitter-iconwatsapp-iconfb-icon
నక్సల్స్‌తో చర్చల ఆలోచన నాది కాదు

కుల పక్షపాతం ఆరోపణలు సరికాదు

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూలినపుడు బాధపడ్డా

భాను అరాచకత్వం మా వాళ్ల వైఫల్యమే

రాజకీయాల్లో చేరి సమయం వృథా చేసుకోను

14-5-2012న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో మాజీ డీజీపీ అరవిందరావు


రిటైర్డ్‌ జీవితం ఎలా ఉంది?

మొదట్లో కొన్నాళ్లు ఏదో పోయినట్లనిపిస్తుంది. నాకు మాత్రం చాలా స్వేచ్ఛ, ఖాళీ సమయం దొరికినట్లు ఉంది. పుస్తకాలకు అలవాటు పడ్డాను.


మీరు ఖాకీ నుంచి ఆధ్యాత్మికంలోకి రావడానికి కారణమేంటి?

ఇది పూర్తి ఆధ్యాత్మికం కూడా కాదు. నా ఉద్యోగంలో ఓ భాగం. 1994లో సిటీ పోలీసు విభాగంలో ఉన్నప్పుడు సిమి వాళ్లను కొందరిని అరెస్టుచేశాం. వాళ్లు వాళ్ల మతం గురించి గొప్పగా చెప్పారు. వాళ్లకు నేను సమాధానం చెప్పలేక, జ్ఞానం సంపాదించాలని చదవడం మొదలుపెట్టాను. పుల్లెల రామచంద్రుడు, తత్వవేదానందల శిష్యరికంలో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు అన్నీ చదివాను. ఉద్యోగంలో ఉండగానే ఎంఏ, పీహెచ్‌డీ కూడా చేశా.


సర్వీసులో ఉండగా మిమ్మల్ని రాక్షసుడు అనేవారు కదా..

అని ఉండొచ్చు. కానీ, అదంతా నా విధినిర్వహణలో భాగమే. వాళ్ల అభిప్రాయం వాళ్లది.


నక్సలైట్లు, తెలంగాణ విషయంలో మీపై విమర్శ వచ్చింది?

గత పాతికేళ్లుగా ఇంటెలిజెన్స్‌లో చేసినవాళ్లను చూస్తే.. అంతా నాలుగైదు జిల్లాల్లో చేసినవాళ్లే. వారికి సమస్యలు తెలుసు. పైగా నేనొక్కడినే అంతా చేశాననడం కూడా సరికాదు. అందరూ చేసినదానికి నేనూ కొంత జోడించా. నక్సలైట్‌ టెర్రరిజంపై 1996 నవంబర్‌లో నేనో పుస్తకం రాశానంతే. కోవర్టులనేది ఎప్పటినుంచో ఉన్నదే. అందులో తప్పులేదు. వీళ్లంతా దారితప్పినవారని నా అభిప్రాయం. నాయకులు వెనక్కి వస్తే వాళ్లకు గుర్తింపు ఉండదు. అందుకని వాళ్లకూ తప్పట్లేదు.


సోహ్రాబుద్దీన్‌ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏమనిపించింది?

నేనే అక్కడకు వెళ్లాను. నిజానికి ఆ కేసులో మన పాత్ర ఏమీ లేదు. ఇంటెలిజెన్స్‌కు సంబంధమే లేదు. కానీ ఏదో ఉంటుందనుకుని పిలిచారు. నేను మూడుసార్లు వెళ్లి వివరంగా చెప్పాను.


భాను సంఘటన చూస్తే.. కేవలం నలుగురు వ్యక్తులు, నాలుగు తుపాకులతో రాజ్యం చేశారు. దానిపై ఏమంటారు?

అది ఇంటెలిజెన్స్‌ వైఫల్యమే. నిజానికి సెటిల్మెంట్ల గురించి ఇంటెలిజెన్స్‌ వాళ్లు చూడరు. కానీ స్థానిక పోలీసులకు తెలియకుండా ఇవన్నీ జరగవు. ఇది వ్యవస్థల వైఫల్యమే. భూమి సెటిల్మెంట్‌ కేసుల విషయంలో ఓ జూనియర్‌ ఐఏఎస్‌ అధికారి, జూనియర్‌ ఐపీఎస్‌ అధికారితో టీమ్‌గా ఉండి.. వీళ్లే చూడాలని అనుకున్నాం. కానీ అది కుదరలేదు. అప్పుడు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉండదు.


అధికారిగా పూర్తిస్వేచ్ఛతో వ్యవహరించిన సమయం ఏది?

డీఐజీ అయ్యేవరకు స్వేచ్ఛగా చేశాను. తర్వాతే తొలిసారి మా ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐల కులాల గురించి తెలిసింది. అప్పటివరకు ఆ విషయాన్నే పట్టించుకోలేదు. డి పార్ట్‌మెంట్‌లో ఒకటి చెబుతుంటారు. పెద్దవాళ్లం అయ్యేకొద్దీ ఒక్కో వెన్నుపూస పోతుందంటారు. వెన్నెముక మరీ వంగిపోకుండా చూసుకోవాలి.


తెలంగాణకువ్యతిరేకంగాచేశారన్న పేరెందుకు వచ్చింది?

తెలంగాణకు వ్యతిరేకం అన్న పరిస్థితి లేదు. హరీశ్‌రా వు లాంటి నాయకులు కూడా నాతో స్వేచ్ఛగా మాట్లాడతారు. వాళ్లు కూడా ఎప్పుడూ అనలేదు. వ్యక్తిగతంగా నేను తెలంగాణ గురించి ఏమీ చెప్పలేను. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను. అనంతపురంలో మాకు ఇప్పుడు ఏమీలేదు.

నక్సల్స్‌తో చర్చల ఆలోచన నాది కాదు

మీ ఆధ్యాత్మిక పరిశోధనలు ఎంతవరకు వచ్చాయి?

నేను ఉపనిషత్తులపై శంకరాచార్యులు, ఆయన శిష్యులు రాసిన వ్యాఖ్యానాలను తీసుకున్నాను. ‘ఉపనిషత్తుల్లో జ్ఞాన స్వ రూప వివేచనం’ అనే పరిశోధనగ్రంథం సంస్కృతంలో రాశాను. మన సం స్కృతి మొత్తం సంస్కృతంలోనే ఉంది. బౌద్ధులూ సంస్కృతంలో రాశారు. ఇప్పుడు ఇంగ్లీషు ఎలాగో, అప్పుడు సంస్కృతం అలాగన్నమాట. మన ప్రాచీన సైన్స్‌ని ఎవరూ పట్టించుకోవట్లేదు. దాంట్లో ఏముందో తెలుసుకోవాలి కదా.


హిందూమతం భవిష్యత్తు గురించి ఏమంటారు?

అది దాదాపు అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ పురోహితుడిపైన బ్రహ్మ తప్ప మరెవరూ లేరు. ఇతర మతాల్లో అలా కాదు. గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ ప్రధాన కేంద్రం వరకు అన్నీ ఉంటాయి. నిధులూ అందుతాయి. హిందువులను కలిపి ఒక చోట కూర్చోబెడదామంటే కలవరు.స్వాముల్లో సామాజిక చైతన్యం తక్కువగా కనిపిస్తోంది.


మామూలు పేదల దగ్గరకు మన స్వాములు వెళ్లట్లేదు కదా?

రామకృష్ణమిషన్‌, చిన్మయ మిషన్‌ లాంటివాళ్లు వెళ్తున్నారు. కానీ వాళ్లు మేజిక్కులు చేయరు కాబట్టి జనం ఎక్కువగా వెళ్లరు.


హిందూధర్మం బలాబలాలేంటి?

మన సిద్ధాంతంలో చాలా బలం ఉంది. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేనిమాట వాస్తవం. అమలును మనం సరిచేసుకోవాలి. ఉపనిషత్తుల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది. ‘నీకు నీ ప్రవర్తన గురించి ఏమైనా అనుమానం వస్తే, అక్కడ స్థానికంగా ఉన్న బ్రాహ్మణులు (బ్రహ్మజ్ఞానం ఉన్నవారు), సత్యం పట్ల నిష్ట ఉన్నవారు ఏది ధర్మం అని భావిస్తారో అది ఆచరించు’.


కులబ్రాహ్మణులు వేరు.. బ్రహ్మజ్ఞానం ఉన్నవారు వేరని మీరంటారు. సమస్య ఏమీ రాలేదా?

కొంతమంది నన్ను ప్రశ్నించారు. ఇదేంటి.. ఇలా చేస్తున్నావు అన్నారు. మడి, శుచి అనేవి మానసికం అని చాలా స్పష్టంగా చెప్పారు. దేవతలు, రాక్షసులంటే ఆకాశంలో కొట్టుకునేవాళ్లు కారు. మనసులో ఉండే మంచి వృత్తులే దేవతలని.. ఇంద్రియాల ఆనందంతో రమించేవాడు అసురుడని శ ంకరాచార్యులు చె ప్పారు. లోకం అంటే అదో స్టేట్‌ ఆఫ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటారు. మనం ఇక్కడ ఉండే స్వర్గాన్ని, నరకాన్ని అనుభవిస్తాం. రామానుజులు కూడా మరో గొప్పవ్యక్తి. శంకరాచార్యులు అద్వైతం అన్నారు. రామానుజుల కాలంలో భక్తి కావల్సి వచ్చింది.ఆయన తిరుమంత్రం చెబుతానన్నాడు. మధ్వాచార్యుడు ఓ యోధుడు. ఆయన ద్వైతం తెచ్చారు.


బ్రాహ్మణ పక్షపాతి అన్న విమర్శ ఎందుకు వచ్చింది?

ఎప్పుడూ రాలేదు, అసలు డిపార్ట్‌మెంట్‌లో బ్రాహ్మణులు ఎక్కడున్నారు? అవును.. రామాంజనేయు లు ఇంటెలిజెన్స్‌లో చేశారు. మాకున్న చురుకైన, తెలివైనవాళ్లలో ఒకరు. బహుశా ఆయనను ప్రోత్సహించామని అలా అని ఉండొ చ్చు.


నక్సల్స్‌తో చర్చల ఆలోచన మీదేనా?

అది మాదికాదు.. పార్టీది. కొందరు సీనియర్‌ జర్నలిస్టులు వాళ్ల మేనిఫెస్టో రాశారు. వాళ్లే చెప్పారంటారు. విడగొట్టాలన్నది కూడా నా ఐడియా కాదు. ఢిల్లీ వెళ్లినప్పుడు చూస్తే.. అక్కడ చర్చల మధ్యవర్తులు, ఇతర అంశాలు కనిపించాయి. చిన్న విషయాన్ని అంతర్జాతీయం చేసేశారు. కొందరు మేధావులు వేర్వేరు దేశాలకు వెళ్లి, ఆ తెలివి చూపించారు. చర్చలు ఇలాగే సాగితే ఏకంగా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాల్సి వచ్చేలా ఉంది. ఒక సమయంలో నక్సల్స్‌ సమావేశాలకు ఎమ్మెల్యేలు జనాన్ని పంపాల్సి వచ్చేది. స్థానికంగా ఉండే పీడబ్ల్యుజీ కాస్తా జాతీయస్థాయి మావోయిస్టు పార్టీ అయ్యింది. అప్పుడు వారికి విదేశీ మద్దతు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ పరిస్థితి వచ్చేసరికి వైఎస్‌ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడూ అంతా అయిపోయిందనుకోకూడదు. అలా అనుకుంటే చాలా ప్రమాదకరం.


మీరు రాజకీయాల వైపు వెళ్తున్నారా?

సమయం వృథా చేసుకోదలచుకోలేదు. ఆ ఆలోచనే లేదు. నాకు చదువుకోడానికి సమయం దొరికింది. సురభారతి, తెలుగుభాషా సంరక్షణ సమితి, సంస్కృతభాషా సంరక్షణసమితి.. ఇలాంటి సంస్థలతో అనుబంధం పెంచుకుంటున్నాను. తెలుగు కనుమరుగైపోతోంది. అందుకే పాఠశాలల్లో కూడా కావాలంటే లెక్కలు, సైన్స్‌ లాంటివి ఇంగ్లీషులో చెప్పి, సోషల్‌ లాంటివి తెలుగులో చెప్పాలని అడుగుతున్నాం. ఇప్పటికైనా మేలుకోకపోతే ఒక జాతి అంతరించిపోతుంది.


మీ పిల్లలు ఏం చేస్తున్నారు?

అమ్మాయి, అబ్బాయి అమెరికా మోజు పుట్టి వెళ్లిపోయారు.


బాగా బాధ కలిగించిన సంఘటన ఏది?

డీజీపీగా ఉన్నప్పుడు విగ్రహాలు ధ్వంసమయ్యాయి. రెండు రోజులు చాలా బాధపడ్డాను.


జీవిత లక్ష్యం?

మేధావులను మోటివేట్‌ చేయడం, సిద్ధాంత రక్షణకు సులభ శైలిలో పుస్తకాలు రాయడం

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.