AAP ప్రభుత్వాలను మోదీ వెంటాడుతున్నారు : Kejriwal

ABN , First Publish Date - 2022-06-08T01:08:53+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని, ఆ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను

AAP ప్రభుత్వాలను మోదీ వెంటాడుతున్నారు : Kejriwal

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని, ఆ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) వెంటాడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) ఆరోపించారు. ఢిల్లీ రాష్ట్ర మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధంగల కొన్ని చోట్ల నుంచి పెద్ద ఎత్తున నగదు, బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. 


సత్యేందర్ జైన్‌కు చెందిన పలు చోట్ల నుంచి సరైన వివరణ లేని నగదు రూ.2.85 కోట్లు, 133 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం తెలిపింది. మనీలాండరింగ్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సోమవారం సత్యేందర్ జైన్, ఆయన సహచరులకు సంబంధించిన పలు చోట్లపై దాడులు నిర్వహించినట్లు తెలిపింది. జైన్‌కు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరించినవారికి సంబంధించిన ఆస్తులపై ఈ దాడులు జరిగినట్లు పేర్కొంది.


ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈడీ ఆరోపణలు అబద్ధాలని తెలిపారు. ‘‘ఈసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సంపూర్ణ అధికారంతో ఆమ్ ఆద్మీ పార్టీని వెంటాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల వెంటపడుతున్నారు. అబద్ధం తర్వాత అబద్ధం, అబద్ధం తర్వాత అబద్ధం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీకు (మోదీకి) అన్ని సంస్థల బలం ఉంది, కానీ మాకు భగవంతుడి తోడు ఉంది’’ అని పేర్కొన్నారు. 


సత్యేందర్ జైన్ (57)ను ఈడీ మే 30న అరెస్టు చేసింది. జూన్ 9 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉంటారు. ఆదాయానికి మించిన ఆస్తులను కలిగియున్నారని జైన్‌, తదితరులపై  కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) 2017 ఆగస్టులో కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ కేసు నమోదైంది. 




Updated Date - 2022-06-08T01:08:53+05:30 IST